దొంగల బీభత్సం

18 Jul, 2014 02:35 IST|Sakshi
దొంగల బీభత్సం

 గౌరిబిదనూరు/అనంతపురం క్రైం :   అనంతపురం జిల్లాకు చెందిన అంతర్ రాష్ర్ట దొంగల ముఠా కర్ణాటకలో బీభత్సం సృష్టించింది. చోరీ చేసి.. తప్పించుకునే క్రమంలో కాల్పులు జరిపి ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను గాయపరిచింది. పోలీసులు ఎదురు కాల్పులకు దిగి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
 
 విశ్వసనీయ సమాచారం మేరకు... కర్ణాటక రాష్ర్టం గౌరిబిదనూరు తాలూకాలోని గంగసంద్ర గ్రామ శివారులో బలరాం అనే వ్యక్తికి చెందిన ఫాం హౌస్‌లో బుధవారం రాత్రి దోపిడీ దొంగలు చొరబడ్డారు. యజమాని సమాచారం మేరకు గౌరిబిదనూరు పట్టణ, గ్రామీణ పోలీసులు ఆగమేఘాలపై అక్కడకు చేరుకున్నారు. పోలీసులను గుర్తించిన దొంగలు.. ఫాంహౌస్ యజమాని తుపాకీతో కాల్పులకు దిగడంతో పట్టణ ఎస్‌ఐ బైరా, కానిస్టేబుళ్లు ఖలీల్, లింగప్ప, చిక్కణ్ణ గాయపడ్డారు. ఆత్మ రక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడి నుంచి తప్పించుకునేందుకు దొంగలు ప్రయత్నించారు. వెంటాడిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నా రు. వీరిలో ఇద్దరిని మధు, రామాంజిగా గుర్తించారు. ఈ ముఠా కీలక నేత దుర్గాప్రసాద్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  దీన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. దుర్గాప్రసాద్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తెలుస్తోంది.
 
 ఇతను 2013 లో ఇదేరీతిలో అనంతపురం త్రీటౌన్ పోలీసులపై కాల్పులు జరిపారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన హిందూపురంలోని గుడ్డం ప్రాంతానికి చెందిన దుర్గ.. ఇతనితో కలిసి వందలాది చోరీల్లో భాగస్వాముడైన నారాయణస్వామి, వీరి శిష్యుడైన గంగన్న పోలీసు రికార్డుల్లో పేరుమోసిన దొంగ లు. చిన్న చిన్న దొంగతనాలతో ఆరంభమై భారీ చోరీలు చేసే స్థాయికి ఎదిగారు.
 
 దుర్గను ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్లాన్! : కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో దుర్గ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వారు ధ్రువీకరించడం లేదు. దుర్గ పరారీలో ఉన్నాడని చెప్పి, అతడిని ఎన్‌కౌంటర్ చేయడానికి కర్ణాటక పోలీసులు వ్యూహం రూపొందించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు