అన్నదాతలో అయోమయం

10 Jun, 2014 00:54 IST|Sakshi
అన్నదాతలో అయోమయం
  •    రుణాల రద్దుపై హామీ ఇచ్చి ఇప్పుడు కమిటీనా?
  •   ఎన్నికల మేనిఫెస్టో, ప్రసంగాల్లో ఇచ్చిన హామీలపై ఇప్పుడు సాగదీత ధోరణి
  •   ఖరీఫ్ పెట్టుబడులపై అన్నదాతల్లో బెంగ
  • చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల సభల్లోనూ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత దీనిపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించటంతో రైతుల్లో అయోమయం నెలకొంది. రుణమాఫీపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని రైతులు నమ్మారు. అధికారం చేపట్టాక టీడీపీ ప్రభుత్వం.. కమిటీయే విధివిధానాలు ఖరారు చేస్తుందని ప్రకటించటం రైతులను ఆగ్రహానికి గురిచేస్తోంది. చంద్రబాబు తీరు రైతులను మోసగించేలా ఉందని వారు విమర్శిస్తున్నారు.
     
    మచిలీపట్నం : తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో, చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. మీరు పంట రుణాలు చెల్లించవద్దని రైతులకు చెబుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ రుణాలను రద్దుచేస్తూ తొలి సంతకం చేస్తానని స్పష్టం చేశారు.

    ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబునాయుడు రుణాలను రద్దు చేయకుండా రుణాల మాఫీపై కమిటీని వేయటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కమిటీ రుణమాఫీపై 15 రోజుల్లో ప్రాథమిక నివేదికను అందిస్తుందని, అనంతరం 45 రోజుల్లో తుది నివేదికను సమర్పిస్తుందని, అప్పుడే సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ ప్రకటన      రైతుల్లో ఆందోళనకు కారణమైంది.
     
    అన్నీ మాఫీ చేస్తారా? కొర్రీలు పెడతారా?

    రుణమాఫీపై కమిటీ నిర్ణయం తీసుకునే సమయంలో అన్ని రకాల రుణాలను రద్దు చేస్తూ నియమ నిబంధనలు రూపొందిస్తారా లేదా అనే అంశంపైనా రైతుల్లో గందరగోళం నెలకొంది. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు రుణమాఫీపై కమిటీ వేస్తామని ప్రకటించటంతో రైతుల్లో నైరాశ్యం నెలకొంది. వ్యవసాయ రుణాలంటే 12 రకాలు ఉన్నాయి. అవి అడంగల్ కాపీ డాక్యుమెంటేషన్ ద్వారా, పట్టాదారు పాస్‌పుస్తకం ద్వారా, శిస్తు కట్టిన రశీదు చూపి బంగారం కుదువ పెట్టి తీసుకున్న రుణాలు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక, గొర్రెల పెంపకం, వ్యవసాయ యంత్రాల కొనుగోలు తదితర రకాలు. వాటిలో ఏ రకం రుణాలను రద్దు చేస్తారు, ఎంత మొత్తం వరకు రద్దు చేస్తారనే అంశంపై రైతుల్లో అయోమయం నెలకొంది.
     
    ముంచుకొస్తున్న ఖరీఫ్ సీజన్...
     
    జూన్ ఒకటి నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. జూన్ నెలాఖరు నాటికి వాతావరణం అనుకూలిస్తే నారుమడులు పోసుకుని వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉంది. బోర్ల ద్వారా మంచినీటి వసతి ఉన్న కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, తోట్లవల్లూరు తదితర ప్రాంతాల్లో రైతులు ముందస్తుగానే వరినాట్లు పూర్తిచేస్తారు. రుతుపవనాలు ప్రవేశించి వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా మారితే వరినాట్లు వేగవంతమయ్యే అవకాశం ఉంది. నారుమడుల దశ నుంచే రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకుంటారు.

    జిల్లాలో వివిధ రకాల వ్యవసాయ రుణాలు రూ.9,137 కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గతంలో తీసుకున్న రుణాలను చెల్లిస్తేనే మళ్లీ రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు వస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో పాదయాత్ర సమయంలో తాను వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తానని, రుణాలు చెల్లించవద్దంటూ రైతులకు భరోసా ఇచ్చారు.

    ఈ నేపథ్యంలో రైతులు రుణాలు తిరిగి చెల్లించలేదు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పాత రుణం రద్దుకాకుండా మళ్లీ పంట రుణం ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు చొరవ చూపుతారా, లేదా అన్న అంశంపై రైతుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. సకాలంలో పంట రుణం రద్దుకాకుంటే 11.75 శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీపై నూతన ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి 45 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. వ్యవసాయ రుణాలతో పాటు డాక్రా, చేనేత రుణాల పైనా ఈ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
     
    రైతుల్లో నెలకొన్న అనుమానాలివే...
     
    వ్యవసాయ రుణాల మాఫీపై కమిటీ ఎలాంటి నిర్ణణం తీసుకుంటుందనే అనుమానాలు రైతుల్లో ఉన్నాయి. దీంతో పాటు వ్యవసాయ రుణాలు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు, ఎంత మొత్తంలో రుణమాఫీ జరుగుతుంది అనే అంశంపై అయోమయం నెలకొంది. పంట రుణం సకాలంలో తీసుకుంటేనే పంట బీమా ప్రీమియం చెల్లించేందుకు అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఆగస్టు 30వ తేదీతో పంట రుణం తీసుకున్న రైతులు పంట బీమా ప్రీమియం చెల్లించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 45 రోజుల తర్వాత సూచనలు చేసినా... వాటిని ప్రభుత్వం ఎన్ని రోజుల్లోగా పాటిస్తుందనే అంశంపైనా రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
     
    తెలంగాణలో అలా...
     
    తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల్లోపు రుణాలను రద్దు చేస్తామని ప్రకటిస్తే ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు పంట రుణాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సీమాంధ్రలో పంట రుణాలు రద్దు చేయడానికి కమిటీ వేసి రైతుల్లో గందరగోళానికి తెరతీశారనే వాదన రైతుల నుంచి వినబడుతోంది. ఎలాంటి షరతులూ విధించకుండా వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
     
    రుణమాఫీపై చంద్రబాబు తీరు సమంజసం కాదు. తొలి సంతకంతో రద్దు చేస్తానని ప్రకటించి.. ఇప్పుడు కమిటీ ఏర్పాటు ఫైలుపై సంతకం చేయడం తగదు. పైగా 45 రోజులు గడువుతో పాటు విధివిధానాలు పాటిస్తామని ప్రకటించటం రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. మరోపక్క ఖరీఫ్ రానే వచ్చింది. చంద్రబాబు హామీతో రైతులెవరూ రుణాలు చెల్లించలేదు. ఇప్పుడు మళ్లీ బ్యాంకు వద్దకు వెళ్లి పంట రుణం ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితి లేదు. రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. సకాలంలో పంట రుణాలు అందకుంటే రైతుల పరిస్థితి అగమ్యగోచరమే.
     - పుప్పాల నరసింహారావు, రైతు, కృత్తివెన్ను
     
    ఎన్నికల మేనిఫెస్టోలో రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీలు చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. అంతకు ముందు ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రలోనూ ఇదే విషయాన్ని చెప్పి ప్రజలను నమ్మించారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా రుణమాఫీ పరిశీలనకు కమిటీ వేస్తున్నామని చెప్పటం రైతులను మోసగించటమే. ఒక వైపు ఖరీఫ్ ముంచుకొస్తున్న తరుణంలో బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావటం లేదు. రుణమాఫీ ప్రకటనపై ప్రభుత్వం పునస్సమీక్షించుకుని రైతులకు సకాలంలో రుణాలు అందించే ఏర్పాట్లు చేయాలి.
     - ఆకునూరి అప్పయ్య, రైతు, గూడూరు
     

మరిన్ని వార్తలు