పీఠం కోసం ఇంకొన్నాళ్లు!

14 Jun, 2014 00:41 IST|Sakshi
పీఠం కోసం ఇంకొన్నాళ్లు!
  • ఉసూరుమంటున్న ‘స్థానిక’ ప్రతినిధులు
  •  రెండు నెలలైనా దక్కని అధికారం
  •  ఎమ్మెల్యేల ప్రమాణం అనంతరమే నోటిఫికేషన్
  •  అప్పుడే ఎంపీపీ, జెడ్పీ,పురపాలక చైర్మన్‌ల ఎన్నిక
  • విశాఖ రూరల్ : ఎన్నో వ్యయప్రయాసలకోర్చారు. ప్రజాక్షేత్రంలో విజ యం సాధించారు. ప్రజల ఓట్లతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై రెండు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు చేతికి అధికారం మాత్రం చిక్కలేదు. జిల్లా పరిషత్తు చైర్మన్ స్థానంతో పాటు 39 మండల పరిషత్తులకు అధ్యక్షులను, రెండు  మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్, వైస్‌చైర్సన్‌లను ఎన్నుకోవాల్సి ఉంది. అయి తే ఈ ఎన్నికలు నెలాఖరు వరకు జరిగే అవకాశం కని పించడం లేదు.

    ఈ ఏడాది మార్చి 30న జిల్లాలో యల మంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. రెండిం టిని టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జిల్లాలో ఉన్న 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 24 జెడ్పీటీసీలను టీడీపీ, 15 జెడ్పీటీసీలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గెలుచుకున్నాయి. అలాగే 656 ఎంపీటీసీ స్థానాలకు రెండు వాయిదా పడగా, 334 స్థానాలను టీడీపీ, 254 వైఎస్‌ఆర్ కాంగ్రెస్, 17 కాంగ్రెస్, 5 సీపీఎం, 3 సీపీఐ, బీజేపీ, బీఎస్పీ ఒక్కోటి, స్వతంత్రులు 17 స్థానాలను కైవసం చేసుకున్నారు.
     
    ఎమ్మెల్యేల ప్రమాణం అనంతరమే..
     
    ఎంపీపీ, జెడ్పీ పీఠాల పరిస్థితి ఒకలా ఉంటే.. పురపాలక సంఘాల పరిస్థితి మరోలా ఉంది. ఎమ్మెల్యేలకు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉండడమే ఇందుకు కారణం. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తే తప్పా మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫిషియోగా ఓటేసే అధికారం రాదు. ఈ నెల 19 లేదా 20వ తేదీన శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

    తొలి లేదా మలి రోజున ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పదవీ ప్రమాణ స్వీకారం చేశాకే స్థానిక సంస్థల్లో వారి ఎక్స్ అఫిషియో సభ్యత్వం ఖరారవుతుంది. ఆ తర్వాతే వారి ఎక్స్ అఫీషియో సభ్యత్వాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు సమాచార మందిస్తుంది. ఆ తరువాతే ఎన్నికల సంఘం వీటి అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది.

    అయితే ఎంపీపీ, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికలను ఎప్పుడైనా నిర్వహించే అవకాశమున్నప్పటికీ ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు సం బంధించి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పురపాలక, ప్రాదేశిక అధ్యక్ష ఎన్నికలకు ఒకేసారి నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీని కోసం ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే. అసెంబ్లీ సమావేశాలు తరువాత వారంలోనే నోటిఫికేషన్ రావచ్చని అధికారవర్గాలు భావిస్తున్నాయి. అప్పటి వరకు గె లుపొందిన అభ్యర్థులు అధికారం కోసం ఎదురుచూడక తప్పదు.
     

>
మరిన్ని వార్తలు