రూ.103.89 కోట్లు ఆదా

27 Dec, 2019 04:45 IST|Sakshi

ఏపీ టిడ్కో మూడో దశకు రివర్స్‌ టెండరింగ్‌

రూ.942.90 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్‌ టెండర్లు

రూ.839.01 కోట్లు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 

రాష్ట్రంలో ఇప్పటి దాకా ఈ విధానం వల్ల రూ.1,671.78 కోట్లు ఆదా

సాక్షి, అమరావతి :  ఏపీ టౌన్ షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ టిడ్కో)లో గురువారం తాజాగా ఖరారు చేసిన మూడో దశ రివర్స్‌ టెండరింగ్‌లో రూ.103.89 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని 19,296 ఇళ్ల నిర్మాణానికి రూ.942.90 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్‌ టెండర్లను ఆహ్వానించారు. డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ రూ.839.01 కోట్లతో బిడ్‌ దాఖలు చేసి ఎల్‌–1గా నిలిచింది. దాంతో రూ.103.89 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. గతంలో తొలి దశలో 14,368 ఇళ్ల నిర్మాణానికి నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లో రూ.105.91కోట్లు, రెండో దశలో 6,496 ఇళ్ల నిర్మాణంలో రూ.46.03 కోట్లు ఆదా అయిన విషయం తెలిసిందే.

తాజాగా మూడో దశతో కలుపుకుంటే మొత్తంగా 40,160 ఇళ్ల నిర్మాణానికి రివర్స్‌ టెండరింగ్‌ వల్ల రూ.255.83 కోట్ల ప్రజాధనం మిగిలింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి నిర్వహిస్తున్న రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ సత్ఫలితాలు ఇస్తోందని ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కాగా, ఇప్పటిదాకా అన్ని పనుల్లో రాష్ట్ర ఖజానాకు ఈ విధానం వల్ల రూ.1,671.78 కోట్లు ఆదా అయ్యాయి.   

ఏపీ టిడ్కోకు రూ.135 కోట్లు
సాక్షి, అమరావతి: ఏపీ టౌన్ షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ టిడ్కో)కు ప్రభుత్వం రూ.135కోట్లు మంజూరు చేసింది. పట్టణ గృహ నిర్మాణ పథకం అమలు కోసం బడ్జెట్‌ కేటాయింపుల నుంచి ఈ నిధులను మంజూరు చేస్తూ పురపాలక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.  

ఏపీటిడ్కో ఎండీకి మరో రెండు బాధ్యతలు
ఏపీ టిడ్కో ఎండీ బీఎం దివాన్‌ మైదీన్‌కి ఏపీ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్, ఏపీ అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ల ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ రెండు పోస్టుల్లో ఉన్న ఎన్‌. చంద్రమోహన్‌రెడ్డి సెలవుపై వెళ్లినందున ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాకు రూ.50 కోట్లు
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్ర
చికిత్సలు చేయించుకుని డిశ్చార్జి అనంతరం కోలుకునే సమయంలో ‘వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా’ పేరుతో బాధితులకు ఇచ్చే ఆర్థిక సాయానికి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు 2019–20 సంవత్సరానికి ఈ నిధులు మంజూరు చేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా