దాహం.. దాహం

28 Jul, 2014 00:32 IST|Sakshi
దాహం.. దాహం

నూజెండ్ల: మండలంలోని 50 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. సాగర్ జలాలు విడుదల కాకపోవటం, వర్షాలు లేకపోవటం, గుండ్లకమ్మ నది ఎండిపోవటంతో మంచినీటి పథకాలకు నీరందకపోవటమే ఈ దుస్థితికి కారణం. నెల రోజులుగా జనం దాహం కేకలు పెడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. ప్రతి గ్రామానికి సురక్షితమైన మినరల్ వాటర్ పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం తక్షణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మాత్రం దృష్టి పెట్టడం లేదు.
 
 ఇదీ పరిస్థితి
 మండలంలోని 25 పంచాయతీల పరిధిలో 60 గ్రామాలు ఉన్నారుు. వీటిలోని 50 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.  నీరు లేక తలార్లపల్లిలోని మంచినీటి పథకం పనిచేయకపోవటంతో తలార్లపల్లి, గొల్లపాలెం, మారెళ్లవారిపాలెం, త్రిపురాపురం, రెడ్డిపాలెం తదితర గ్రామాల ప్రజలకు తాగునీరు అందటం లేదు.
 
 దాదాపు నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆయూ గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తలార్లపల్లిలోని బావి, చెరువుల్లో నీరు అడుగంటడం, చాలా గ్రామాల్లో బోర్లు ఎండిపోవటంతో కనీస అవసరాలకు కూడా నీరు దొరక్క జనం అవస్థలు పడుతున్నారు.
 
 గతంలో సాగర్ జలాలు విడుదల చేసినపుడు చెరువులను నింపుకోవాలని ఉన్నతాధికారులు సూచించినప్పటికీ ఎస్‌ఎస్ ట్యాంక్‌లను నింపటంలో స్థానిక అధికారులు విఫలమయ్యారని ప్రజలు మండిపడుతున్నారు.
 
 తలార్లపల్లి ఎస్‌ఎస్ ట్యాంక్‌కు నీరు వచ్చే ఛానల్ మధ్యలో ఉన్న కుంట ఆక్రమణకు గురవటంతో ఇకపై నీరు రాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామం నుంచి వలస పోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
 
 రవ్వారం మంచినీటి పథకానికి సంబంధించిన ఎస్‌ఎస్ ట్యాంక్ కూడా పూర్తిగా ఎండిపోవటంతో పథకం పరిధిలోని ప్రజలు తాగు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు.గుండ్లకమ్మ నది పూర్తిగా ఎండిపోవటంతో తంగిరాల, ఉప్పలపాడు, తెల్లబాడు, ములకలూరు, కొత్తకొత్తపాలెం, ఐనవోలు నాగిరెడ్డిపల్లి, జంగాలపల్లి తదితర గ్రామాల్లోని మంచినీటి పథకాలు నిరుపయోగంగా మారారుు.
 
 సాగర్ జలాలు విడుదలయ్యే వరకు
 ఇబ్బందులు తప్పవు
 ఈ విషయమై ఆర్‌డ బ్ల్యూఎస్ ఏఈ మల్లికార్జునరావును వివరణ కోరగా సాగర్ జలాలు విడుదలయ్యేవరకు ఇబ్బందులు తప్పవని చెప్పారు.
 
 జలాల విడుదలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం ఇంకా అందలేదని వెల్లడించారు. ఉన్నతాధికారులు ఆదేశిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు