13 మంది తహసీల్దార్లకు కరోనా పరీక్షలు 

16 Apr, 2020 08:09 IST|Sakshi

చిత్తూరు కలెక్టరేట్‌: ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జిల్లాలోని 13 మంది తహసీల్దార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని బుధవారం కలెక్టరేట్‌ నుంచి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఇటీవల అనంతపురం జిల్లాలో విధుల్లో ఉన్న ఓ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని రెడ్‌జోన్ల పరిధిలో ఉన్న తహసీల్దార్లు కరోనా పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, వడమాలపేట, పుత్తూరు, నగరి, నిండ్ర, విజయపురం, నారాయణవనం, పలమనేరు తహసీల్దార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు.    

హాట్‌స్పాట్స్‌ జాబితాలో జిల్లా 
చిత్తూరు అర్బన్‌: కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన హాట్‌స్పాట్‌ ప్రాంతాల జాబితాలో మన జిల్లా కూడా ఉంది. కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న జిల్లాలను హాట్‌స్పాట్‌గా గుర్తించిన కేంద్రం ఓ జాబితాను విడుదల చేసింది. జిల్లాలో 23 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆ జాబితాలో చేర్చింది. తిరుపతి, రేణిగుంట, నగరి, పలమనేరు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎక్కు వగా పాటిజివ్‌ కేసులు రావడంతో వీటిని రెడ్‌ జోన్లుగా గుర్తించారు.

ఈ ప్రాంతాల్లో రాకపోకలపై పూర్తిగా నిషేధం. జిల్లా హాట్‌స్పాట్‌గా గుర్తించడం వల్ల మొదటి దశ లాక్‌డౌన్‌ అమలుపై అన్ని నియమ నిబంధనలు, షరతులు అలాగే వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు. పాటిజివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యశాఖ సమాయత్తం అవుతోంది. కేవలం నిత్యావసర వస్తువుల రవాణా, అత్యవసర సేవలకు మాత్రమే వర్తిస్తుంది. 

నేటి నుంచి ట్రూనాట్లతో స్వాబ్స్‌ సేకరణ
చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో గురువారం నుంచి ట్రూనాట్‌ మిషన్ల ద్వారా కరోనా స్వాబ్స్‌ సేకరణ ప్రారంభిస్తామని జిల్లా టీబీ కంట్రోలర్‌ రమేష్‌బాబు తెలిపారు. చిత్తూరులోని జిల్లా కోవిడ్‌ ఆస్పత్రిలో 5, తిరుపతి రుయాలో 5, తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో 3, పలమనేరులో 2 , మదనపల్లెలో 2 చొప్పున ట్రూనాట్‌ మిషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఫలితాలు గంటలోనే తెలుస్తాయన్నారు. పాజిటివ్‌ వస్తే తిరుపతిలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపి మరోసారి పరీక్షిస్తామన్నారు. నెగటివ్‌ వస్తే ఆ ఫలితాన్ని తీసుకుంటామన్నారు. ఒక మిషన్‌ ద్వారా రోజుకు 20 మందిని పరీక్ష చేయవచ్చని వివరించారు. 

ట్రూనాట్‌ యంత్రాలను పరిశీలిస్తున్న రమేష్‌ బాబు  

మదనపల్లెలో కరోనా నిర్ధారణ పరీక్షలు 
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో గురువారం నుంచి కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ రమేష్‌ బాబు తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా ఆస్పత్రిని రమేష్‌బాబు పరిశీలించారు జిల్లా ఆస్పత్రిలో అమర్చిన ట్రూనాట్‌ యంత్రాలను తనిఖీచేసి వాటి పనితీరును పరిశీలించారు. 

మరిన్ని వార్తలు