ఏమయ్యారో?

16 Sep, 2019 08:10 IST|Sakshi
విలపిస్తున్న పిల్లల తల్లి భాగ్యలక్ష్మి, తండ్రి అప్పలరాజు

గోదావరి బోటు  ప్రమాదంలో 13 మంది  నగరవాసుల గల్లంతు

ఇప్పటికీ దక్కని 12 మంది ఆచూకీ 

సురక్షితంగా  బయటపడిన ఓ మహిళ

మహారాణిపేట, ఆరిలోవ, వేపగుంట, అనకాపల్లిలో విషాదం

సాక్షి, విశాఖపట్నం, పాతపోస్టాఫీసు : గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం విశాఖ నగరంతోపాటు ఆరిలోవ, వేపగుంట, అనకాపల్లిలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో నగరానికి 12 మంది గల్లంతుకాగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మహారాణిపేట, కొల్లూరు మేన్షన్‌ ప్రాంతం, రామలక్ష్మి కాలనీ డోర్‌ నెంబరు 14–33–37/ 9బి ఇంట్లో నివాసం ఉంటున్న ప్రైవేటు కారు డ్రైవరు మధుపాడ రమణబాబు (35), అతడి భార్య మధుపాడ అరుణ కుమారి (26), అఖిలేష్‌ (7), కమార్తె కుషాలి (5)లతో పాటు ఆరిలోవ ప్రాంతానికి చెందిన రమణబాబు పెద్ద అక్క తలారి అప్పలనర్సమ్మ(60), ఆమె మనవరాళ్లు గీత వైష్ణవి(3), అనన్య(1), వేపగుంటలో నివాసం ఉంటున్న రమణబాబు చిన్న అక్క బొండ పైడికొండ అలియాస్‌ లక్ష్మి(35), ఆమె కుమార్తె పుష్ప(15), అనకాపల్లి మండలం రేబాక కూడలి, గోపాలపురం ప్రాంతానికి చెందిన రమణబాబు పెద్ద అత్త బూసా లక్ష్మి(40), ఆమె పిల్లలు బోశాల సుస్మిత(3), పూర్ణ(18), చిన్న అత్త పెద్దిరెడ్డి దాలెమ్మ(45)లు శనివారం రాత్రి రమణబాబు ఇంటికి చేరుకుని ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు రైలులో రాజమండ్రి బయలుదేరి వెళ్లారు. ఉదయం 8 గంటలకు రాజమండ్రి చేరుకున్నామని రామలక్ష్మినగర్‌లో నివాసముంటున్న రామకృష్ణకు, ఆరిలోవలో ఉన్న అప్పలనర్సమ్మ కుమారుడికి ఫోన్‌ చేసి చెప్పారు. అక్కడి నుంచి బోటు ఎక్కి భద్రాచలం వెళ్తున్నట్లు చెప్పారు.


ఇంతలో టీవీల ద్వారా ప్రమాదం విషయం తెలుసుకున్న రామకృష్ణ, కుటుంబ సభ్యులు ఉలిక్కి పడ్డారు. ఆందోళన చెందుతూ రమణబాబుకు ఫోన్‌ చెయ్యగా పనిచెయ్య లేదు. ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసినా స్విచ్‌ ఆఫ్‌ వస్తుండటంతో కలెక్టరేట్‌లో ఉన్న కంట్రోల్‌ రూమ్‌ని ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యుల జాడ తెలియకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు రాత్రి 7.30 గంటల ప్రాంతంలో విశాఖ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరారు. అసలు వారేమయ్యారు.. సురక్షితంగా ఉన్నారా..? ప్రమాదంలో చిక్కుకున్నారా.? ఊహకందని ప్రమాదంలో వీరికేమైనా జరిగుంటుందా..? అనే ఆందోళన అందరిలోనూ మొదలైంది. ఎవ్వరికీ ఏ ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడాలంటూ విశాఖ ప్రార్థిస్తోంది. మాటలు కూడా రాని ఆ ఏడాది చిన్నారి.. ఏ పరిస్థితుల్లో ఉందోనని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. రమణబాబు పెద్ద అత్త బూసా లక్ష్మి రాజమండ్రిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

బోటు యజమానిది పెందుర్తి..
గోదావరిలో ప్రమాదానికి గురైన బోటు విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామానికి చెందిన కోడిగుడ్ల వెంకటరమణదిగా గుర్తించారు. నాలుగేళ్లుగా శ్రీ వశిష్ట పున్నమి రాయల్‌ పేరుతో బోటును పర్యాటకం కోసం నడుపుతున్నాడు. గోదావరిలో జల రవాణాకు అనుమతి లేకపోయినా విహార యాత్రలకు వినియోగిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన రాజు ఈ సర్వీసు ప్రారంభమైనప్పటి నుంచి బోటు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈయన మృతి చెందినట్లు సమాచారం. రాజు కుటుంబమంతా సరిపల్లి నుంచి దేవీపట్నం వలస వెళ్లిపోయారు. డ్రైవర్‌ రాజు ఆదివారం సెలవు పెట్టినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ప్రమాదంలో మృతిచెందిన బోటు డ్రైవర్లు ఇద్దరి పేర్లూ రాజు కావడంతో ఆ రాజు ఇతనేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వద్దన్నా.. వినకుండా..
బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు... రమణబాబు కుటుంబ సభ్యులు గత ఆగస్టు 24న భద్రాచలం బయలుదేరాల్సి ఉంది. అయితే వర్షాల కారణంగా ఆ ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. గోదావరిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుందని తెలుసుకున్న బంధువులంతా ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని కోరారు. అయినా వీరంతా వినిపించుకోలేదు. ఇప్పటికే ఆలస్యమైపోయింది... ఎలాగైనా ఆదివారం వెళ్లిపోతామని చెప్పి బయలుదేరారు. ఈ ప్రయాణమే తీరని శోకం మిగులుస్తుందని అనుకోలేదని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 12 మంది గల్లంతుకావడంతో విశాఖ శోకసంద్రంలో మునిగిపోయింది.

టీవీలో చూసి తెలుసుకున్నాం..
రామలక్ష్మీ కాలనీలో మా ఇంట్లో దిగువ పోర్షన్‌లో రమణబాబు తన కుటుంబంతో అద్దెకు ఉంటున్నాడు. టీవీలో బోటు ప్రమాదం వార్త చూసిన వెంటనే నా కుమార్తె, అల్లుడు వారి స్నేహితులను సంప్రదించారు. అప్పుడే విషయం తెలుసుకున్నాం. ఒకేసారి ఇంతమంది గల్లంతవ్వడం  బాధాకరం. అందరితో కలిసిమెలిసి ఉండే కుటుంబానికి ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాం.
– మధుపాడ లక్ష్మి, రామలక్ష్మీ కాలనీ (రమణబాబు ఒదిన)

వార్తల ద్వారా తెలిసింది..
ఎలక్ట్రికల్‌ దుకాణంలో పనిచేస్తుండగా సాయంత్రం 6 గంటలకు వార్తల ద్వారా విషయం తెలిసింది. ఆదివారం ఉదయం 4 గంటలకు వీరంతా బయలుదేరి వెళ్లారు. వెళ్లిన వారంతా ఎలా ఉన్నారన్న సమాచారం తెలియదు. వీరంతా బోటు ప్రమాదంలో గల్లంతయ్యారని, గోపాలపురం ప్రాంతానికి చెందిన బూసా లక్ష్మి మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతుందన్న వార్త టీవీలో చూపించారు. 
– గొర్లె అప్పలరాజు, రామలక్ష్మీ కాలనీ, (రమణబాబు అన్న కొడుకు)

తల్లడిల్లుతున్న హృదయాలు..
చిట్టితల్లుల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు:
ఆరిలోవ(విశాఖ తూర్పు): తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దరి పాపికొండల విహారయాత్రకు వెళ్తూ గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో ఆరిలోవ ప్రాంతానికి చెందిన వారు గల్లంతవడంతో విషాదం నెలకొంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఆరిలోవ ప్రాంతం ఒకటో వార్డు పరిధి దుర్గాబజార్‌ దరి సాయినగర్‌కు చెందిన తలారి అప్పలనరమ్మ తన కొడుకు, కోడలుతో నివాసముంటోంది. ఆమె తన తమ్ముడైన రమణబాబు కుటుంబీకులతో కలిసి పాపికొండలు వెళ్లడానికి తన ఇద్దరు మనవరాళ్లు వైష్ణవి(3), అనన్య(1 సంవత్సరం మూడు నెలలు)తో కలిసి ఆదివారం వేకువన రైలులో బయలుదేరారు.

రాజమండ్రిలో దిగి పాపికొండలు వెళ్లడానికి గోదావరిలో బోటు ఎక్కి ప్రమాదంలో చిక్కుకొన్నారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో అధికారులు గల్లంతైన వారి జాబితాలో వారి పేర్లును చేర్చారు. బోటు ప్రమాదం విషయం తెలిసినప్పటి నుంచి చిన్నారులు వైష్ణవి, అనన్య తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి, అప్పలరాజు కన్నీటిపర్యంతమవుతున్నారు. వారు విలపించిన తీరు స్థానికులను కంటతడిపెట్టిస్తోంది. చిన్న పిల్లలను నాన్నమ్మతో పంపించడమే మేము చేసిన తప్పా అంటూ విలపిస్తున్నారు. బోటు ప్రమాదంలో ఆరిలోవ ప్రాంతానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారనే విషయం ఈ ప్రాంతమంతా దావానంలా వ్యాపాంచింది. చుట్టుపక్కల కాలనీవారంతా వారి నివాసానికి చేరుకొని విలపిస్తున్న చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చుతున్నారు. తల్లి నుంచి పాలు మాన్పించాలనే ఆలోచనతో పిల్లలను నాన్నమ్మతో పంపించినట్లు స్థానికులు అంటున్నారు.

దిగ్భ్రాంతికి గురయ్యా.. 
గోదావరిలో బోటు ప్రమాదం విషయం తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. గల్లంతైన వారిలో 12 మంది విశాఖ జిల్లాకు చెందిన వారున్నారన్న తెలిసి తీవ్రంగా కలతచెందా. వారి ఆచూకీ తెలుసుకునేందుకు పర్యాటక శాఖ తరఫున రక్షణ చర్యలు చేపడుతున్నాం. ప్రమాదానికి కారణమైన బోటుకు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. గల్లంతైన వారి ఆచూకీ కోసం టూరిజం విభాగం నుంచి రెండు బోట్లు సంఘటన స్థలానికి తీసుకొచ్చాం.          
– మంత్రి అవంతి శ్రీనివాసరావు 

  

మరిన్ని వార్తలు