ఘాటు.. నిర్లక్ష్యంతో చేటు

10 Nov, 2017 10:17 IST|Sakshi

ఘాట్‌ రోడ్డు విస్తరణ గోవిందా

ముందుకు సాగని పనులు

ఇంజినీర్ల నిర్లక్ష్యంతో అటకెక్కిన సర్వే

టీటీడీ ఈఓ ఆదేశించినా కదలని ఫైలు?

ఘాట్‌రోడ్డు పనుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా నిపుణులు సూచించిన వాటిని తక్షణమే అమలులోకి తీసుకురావాలని  టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఇప్పటికే పలుమార్లు ఆదేశించారు. కానీ నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనుల విషయంలో సంబంధిత అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి.

సాక్షి, తిరుమల: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా ఉంది తిరుమల ఘాట్‌ రోడ్డు అభివృద్ధి çపరిస్థితి. మొదటి, రెండో ఘాట్‌రోడ్లకు అనుసంధానంగా ఉండే లింక్‌ రోడ్డును మోకాళ్ల పర్వతం నుంచి తిరుమల వరకు నాలుగు లేన్లుగా విస్తరించాలని రెండేళ్లకు ముందే నిర్ణయించినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. రెండో ఘాట్‌ రోడ్డులో తరచూ కొండచరియలు కూలుతున్న నేపథ్యంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైలు ముం దుకు కదలటం లేదు. తిరుపతి నుంచి తిరుమలకు 16 కిలోమీటర్ల దూరం ఉన్న రెండో ఘాట్‌రోడ్డు ప్రమాద స్థితికి చేరుకుంటోంది. కొంతకాలంగా తరచూ ఈ ఘాట్‌ రోడ్డులో కొండచరియలు కూలుతూనే ఉన్నాయి. ఇటీవల వర్షాలకు మరింత ఎక్కువ స్థాయిలో కొండచరియలు కూలాయి. ఏడో కిలోమీటరు  నుంచి 16వ కిలోమీటరు వరకు కొండ చరియలు ఎక్కువ మోతాదులో కూలుతున్నాయి. భవిష్యత్‌లో ఈ రోడ్డు మరింత ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణుల బృందం తేల్చింది.

ప్రత్యామ్నాయ లింకు రోడ్డును పట్టించుకోని టీటీడీ
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌ రోడ్డులోని 13వ కిలోమీటరు నుంచి మొదటి ఘాట్‌రోడ్డు మోకాళ్ల పర్వతం వరకు అనుసంధానంగా లింక్‌రోడ్డు ఉంది. విపత్కర పరిస్థితుల్లో ఘాట్‌ రోడ్డు ట్రాఫిక్‌ జామ్‌ అయితే ఈ రోడ్డు మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉంది.  రెండేళ్లకు ముందు రెండో ఘాట్‌లోని  15వ కిలోమీటరు వద్ద రోడ్డుపై అడ్డంగా పడిన కొండ చరియల వల్ల 20 రోజులపాటు రెండో ఘాట్‌రోడ్డులోని ఐదు మలుపులు మూసేశారు. ప్రత్యామ్నాయంగా వాహనాలను లింక్‌రోడ్డు మీదుగా తిరుమలకు అనుమతించారు. అరగంటపాటు అటుఇటుగా ఆపేసి పంపటం వల్ల రెండు వైపులా భక్తుల రాకపోకలు ఆగిపోవడమేగాక రైళ్లు, విమాన ప్రయాణాలకు వెళ్లాల్సిన వారు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. 

నిపుణుల సూచన బేఖాతరు
మొదటి, రెండో ఘాట్‌ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న లింక్‌ రోడ్డు నుంచి తిరుమల వరకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని రోడ్డును నాల్గు లేన్లు విస్తరించాలని గతంలో నిపుణులు సూచించారు. దీనికోసం ప్రముఖ నిర్మాణం సంస్థలతో సర్వే చేయించాలని నిర్ణయించారు. ఆ మేరకు టెండర్లు పిలిచారు. వివిధ కారణాలతో టెండర్లు తెరుచుకోలేదు. మరోసారి టెండర్లు పిలిచారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌ టీ టెండర్‌ దాఖలు చేసింది. అయితే, ఆ టెండరు ఫైల్‌ ఇంకా తెరుచుకోలేదు. సుమారు రెండు నెలలు గడచినా ఆ ఫైలుకు మోక్షం రాలేదు. సంబంధిత ఇంజినీరింగ్‌ అధికా రుల నిర్లక్ష్యం కారణంగానే ఆగిందని సమాచారం. దీంతో అభివృద్ధి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి.

ప్రమాదం అంచుల్లో అవ్వాచ్చారి కోన కొండ
తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డు 1945, ఏప్రిల్‌ 10వ తేదీ ప్రారంభించారు. ఈ మార్గంలో మోకాళ్ల పర్వతం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు  1.5 కిలోమీటర్లు ఉంది. ఈ మార్గం అతి ప్రమాదకరమైనది. ఈ మార్గంలో తొలిసారి ఈ నెల 13వ తేదీ భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో గంటన్నరపాటు వాహనాలు స్తంభించాయి. మరింత తీవ్ర స్థాయిలో కొండచరియలు విరిగిపడితే మొదటి ఘాట్‌రోడ్డు మూసివేయక తప్పని పరిస్థితి. అలాంటప్పుడు లింక్‌ రోడ్డు మాత్రమే ప్రత్యామ్నాయ మార్గమవుతుంది. నిటారుగా ఉండే ఈ అవ్వాచ్చారికోన కొండ మీద నుంచి బండరాళ్లు భవిష్యత్‌లో మరిన్ని కూలే అవకాశాలు ఉన్నాయని గతంలోనే నిపుణులు తేల్చారు.

మరిన్ని వార్తలు