ఇదీ ఆటంటే!

25 Nov, 2014 03:25 IST|Sakshi
ఇదీ ఆటంటే!

కర్నూలు: తిమ్మిని బమ్మి చేయడం.. బమ్మిని తిమ్మి చేయడంలో పోలీసులు సిద్ధహస్తులు. కేసులో ఇరికించాలన్నా.. బయటపడేయాలన్నా వీరికి వెన్నెతో పెట్టిన విద్య. అంతే కాదు.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడంలోనూ నేర్పరులే. ఈ కోవలోనే ఓ సారు పేకాట సొమ్ములో చేతివాటం చూపారు. గార్గేయపురం శివారులోని రాంపురం కొత్తూరు రోడ్డు సమీప పొలాల్లో పేకాట ఆడుతుండగా ఆదివారం మధ్యాహ్నం తాలూకా ఎస్‌ఐ విజయభాస్కర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. తొమ్మిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి రూ.28,350 స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

అయితే తమ వద్ద భారీగానే నొక్కేసినట్లు ఆటగాళ్లు చెబుతుండటం గమనార్హం. వాస్తవంగా శనివారం రాత్రి 11 గంటల సమయంలో కొంతమంది పేకాట ముగించుకుని వస్తుండగా గార్గేయపురం మలుపు వద్ద పోలీసులు కాపు కాసి అదుపులోకి తీసుకుని వారి నుంచి డబ్బు లాక్కున్నారు.

పేకాటరాయుళ్లలో ఒకరిచ్చిన సమాచారం మేరకు తొమ్మిది మంది వద్ద భారీ మొత్తంలో డబ్బు నొక్కేశారు. కర్నూలులోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన సుబ్బారెడ్డి పేకాట ముగించుకుని మరో మార్గంలో కర్నూలు చేరుకున్నాడు. అదే కాలనీకి చెందిన గోపాల్ మోటార్ సైకిల్‌పై వస్తూ గార్గేయపురం మలుపు వద్ద పోలీసులకు చిక్కాడు.

అతని ద్వారా సుబ్బారెడ్డి పేకాటలో పాల్గొన్నట్లు తెలుసుకుని పోలీసులు కర్నూలులోని అతని ఇంటికి వెళ్లి అర్ధరాత్రి హల్‌చల్ చేశారు. ముఖంపై పిడిగుద్దులు గుద్ది, బీరువా తెరిపించి.. అందులోని రూ.47వేలు లాక్కున్నట్లు సమాచారం. పేకాటలో గెలిచిన డబ్బు కాదు సార్.. ముఖ్యమైన పని కోసం ఏటీఎంలో డ్రా చేశానని, కావాలంటే సీరియన్ నెంబర్లు చూసుకోండని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది.

అదేవిధంగా బోదెపాడు శ్రీను అనే వ్యక్తి వద్ద రూ.20వేలు నొక్కేసి కేసు పెట్టకుండా వదిలేశారు. ధనుంజయరాజ్ నుంచి రూ.26వేలు, బసవరాజు నుంచి రూ.18వేలు, గోపాల్ నుంచి రూ.8వేలు, జనార్దన్ నుంచి రూ.30వేలు, రఘునాథరెడ్డి నుంచి రూ.9వేలు వసూలు చేసుకుని కేసులు నమోదు చేశారు.

పలుకూరు గ్రామానికి చెందిన మరికొందరు పేకాట ఆడేందుకు కారులో వస్తుండగా వెంకాయపల్లె వద్ద అడ్డుకుని రూ.50వేల వరకు నొక్కేసినట్లు బాధితులు ‘సాక్షి’కి తెలిపారు. అయితే పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు జంకుతున్నారు.

 ఈ విషయంపై ఎస్‌ఐ విజయభాస్కర్‌ను వివరణ కోరగా ‘అదంతా ఫేక్. మీరు ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దు. గత వారంలో తాండ్రపాడు వద్ద పేకాటరాయుళ్లపై దాడి చేసి పట్టుకోగా కొందరు విలేకరులు అక్కడికొచ్చారు. సార్.. రూ.6 లక్షలు దొరికాయట కదా.. అని అడిగారు. అది కూడా తప్పుడు ప్రచారమే. గార్గేయపురం వద్ద తొమ్మిది మంది జూదరులను అరెస్టు చేసి వారి వద్ద రూ.28,350 మాత్రమే స్వాధీనం చేసుకున్నాం.’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు