కాంగ్రెస్‌కు ఇవి అంతిమ యాత్రలే

21 Oct, 2013 00:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎవరి పాలన నుంచి విముక్తి పొందారని ఈ జైత్రయాత్రలు నిర్వహిస్తున్నారంటూ సీపీఎం శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి కాంగ్రెస్ నేతల్ని నిలదీశారు. ప్రజా సమస్యలను పరిష్కరించని కాంగ్రెస్ పార్టీకి ఈ యాత్రలు అంతిమ యాత్రలే అవుతాయని హెచ్చరించారు. ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాలించి ప్రాం తీయ అసమానతలు సృష్టించిందీ, ఇప్పుడు విడిపోవడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీయేనని ధ్వజమెత్తారు. ఈమేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన చేశారు. కులం, మతం, ప్రాంతీయం వంటి భేదాలు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు జైత్రయాత్రలు జరుపుకునే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. 50 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అథోగతి పాల్జేసి ఇప్పుడు పునర్‌నిర్మాణం చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర విభజనపై ఒక స్పష్టమైన విధానంగానీ, ప్రాతిపదిక గానీ లేని ఫలితమే ఒక చోట జైత్రయాత్రలు, మరోచోట శవయాత్రలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అవకాశవాదంతో ప్రాంతానికో విధానాన్ని అనుసరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రకటన రాకతోనే జైత్రయాత్రల పేరుతో జనంపై దండయాత్రలకు దిగిందని మండిపడ్డారు.
 
 రాధాకృష్ణ మృతికి రాఘవులు, నారాయణ సంతాపం
 సాక్షి, హైదరాబాద్: సీపీఎం నాయకుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (వైఆర్‌కే) మృతికి ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు బీవీ రాఘవులు, కె.నారాయణ ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే వైఆర్‌కే జీవితం ప్రజా ఉద్యమంతో మమేకమైందని వివరించారు. పౌరహక్కులను కాపాడడంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. వైఆర్‌కే కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
 

మరిన్ని వార్తలు