నత్తే నయం

26 Sep, 2015 00:30 IST|Sakshi
నత్తే నయం

ఇదీ మరుగుదొడ్ల నిర్మాణం తీరు
లక్ష్యం 1,73,418
పూర్తయినవి 20,266
స్వచ్ఛభారత్‌లో పూర్తి చేయాల్సినవి  75 వేలు
 ఉపాధిహామీ ద్వారా మరో 18 వేలు
 

మచిలీపట్నం : జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన ఆర్భాటంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. పారిశుధ్య చర్యలను మెరుగుపరిచేందుకు జిల్లా వ్యాప్తంగా 1.73 లక్షల మరుగుదొడ్లను నిర్మించాలని పరిపాలనా ఆమోదం తెలిపారు. దీంట్లో మొదటి విడతగా స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణలో 75 వేల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 970 పంచాయతీలు ఉండగా వాటిలో 96 పంచాయతీల్లో మరుగుదొడ్లను నిర్మించే బాధ్యతను ఉపాధి హామీ పథకం అధికారులకు అప్పగించారు. 18 వేల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. బుధవారం కలెక్టర్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో గ్రామాల వారీగా ఎన్ని మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంటుంది వివరాలు తీసుకున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ పథకం మళ్లీ అక్టోబర్ వచ్చే నాటికి వివరాలు తీసుకునేందుకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.

గోరంత ఫలితం
జిల్లాలో 1,73,418 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 20,266 మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తమ పర్యవేక్షణ లోని 19 వేల మరుగుదొడ్లు వివిధ దశల్లో ఉన్నాయని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రాంగోపాల్ తెలి పారు. ఉపాధి హామీ పథకం ద్వారా 1,266 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేశారు. ఉపాధి  పథకం ద్వారా 18 వేల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయింగా 1,266ను పూర్తి చేసి 3,150 మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నట్లు డ్వామా పీడీ మాధవీలత తెలిపారు.

బిల్లులు చెల్లింపులో జాప్యం
ఒక్కొక్క మరుగుదొడ్డికి తొలుత రూ.12 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. ఈ నగదు మరుగుదొడ్ల నిర్మాణానికి సరిపోదని ప్రజల నుంచి వినతులు రావటంతో ఈ మొత్తాన్ని రూ. 15 వేలకు పెంచారు. మరుగుదొడ్డి మంజూరు కావాలంటే రేషన్, ఆధార్‌కార్డులు, ఇంటికి సంబంధించిన వివరాలు, పంచాయతీ కార్యదర్శి ఆమోదం తదితరాలను సేకరించాలి. రేషన్‌కార్డులో, ఆధార్‌కార్డులో కుటుంబ యజమాని పేరు ఒక్క అక్షరం తప్పుగా నమోదైనా మరుగుదొడ్డి నిర్మాణానికి అనర్హులుగా ప్రకటిస్తున్నారు. లబ్ధిదారులు ముందుకు వచ్చి మరుగుదొడ్డి నిర్మిస్తే బిల్లుల చెల్లింపు కోసం నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఆన్‌లైన్ ద్వారానే నగదు చెల్లింపులు ఉంటాయని చెబుతున్నా సకాలంలో నగదు ఇవ్వని పరిస్థితి ఉంది.
 

మరిన్ని వార్తలు