ఎన్‌టీఆర్‌కు ‘భారతరత్న’ ఈసారీ లేనట్టే!

16 Sep, 2014 00:26 IST|Sakshi
ఎన్‌టీఆర్‌కు ‘భారతరత్న’ ఈసారీ లేనట్టే!

మరోసారి టీడీపీ సర్కారు మొండిచేయి...
అవార్డు కోసం కేంద్రానికి ఎన్‌టీఆర్ పేరును సిఫారసు చేయని వైనం
గత ఎన్‌డీఏ హయాంలోనే ఇస్తామన్నా బాబు విముఖత!
పద్మ అవార్డులకు మురళీమోహన్, గల్లా రామచంద్రనాయుడు,  బాపు పేర్లు సిఫారసు

 
హైదరాబాద్: ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల కోసం ఆంధ్రప్రదేశ్ సర్కారు పంపిన సిఫారసు జాబితాలో.. ప్రఖ్యాత తెలుగు నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరుకు చోటు దక్కలేదు. దివంగత ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గతంలో పార్టీ మహానాడులో తీర్మానం చేయడంతోపాటు.. పలుమార్లు డిమాండ్ కూడా చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలోని సర్కారు.. తాజాగా పద్మ అవార్డుల కోసం పలువురి పేర్లు సిఫారసు చేస్తూ కేంద్ర హోంశాఖకు పంపిన జాబితాలో ఎన్‌టీఆర్ పేరును భారతరత్నకు సిఫారసు చేయలేదు. ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో ఇచ్చే పద్మ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు, సమాజానికి ఆయా రంగాల ద్వారా సేవలందించిన వ్యక్తుల పేర్లను సిఫారసు చేస్తాయి. గతంలో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా అప్పట్లో చంద్రబాబు అడ్డుపుల్ల వేశారన్న వార్తలు వచ్చాయి. ఎన్‌టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇస్తే ఆ అవార్డును నిబంధనల మేరకు ఆయన భార్య లక్ష్మీపార్వతి అందుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్లీ ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని సిఫారసు చేసే అవకాశం వచ్చినప్పటికీ చంద్రబాబు అలా సిఫారసు చేయకపోవడంపై టీడీపీ నేతల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు పంపిన సిఫారసుల్లో ఎన్‌టీఆర్ పేరు లేదని, అయితే విమర్శలు వస్తే తరువాత అయినా లేఖ రాసే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి.

25 మంది పేర్లు సిఫారసు...

పద్మ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 25 మంది పేర్లను సిఫారసు చేసింది. ఇందులో టీడీపీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ పేరును పద్మభూషణ్ అవార్డుకు సిఫారసు చేశారు. అలాగే గల్లా రామచంద్రనాయుడు పేరును పద్మశ్రీ అవార్డుకు సిఫారసు చేశారు. ఐటీ రంగంలో నిష్ణాతుడైన రాజిరెడ్డి, ప్రముఖ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ఇటీవలే మరణించిన సినీ, కళారంగ ప్రముఖుడు బాపు, డాక్టర్ నాగేశ్వరరెడ్డిలకు పద్మవిభూషణ్; చాగంటి కోటేశ్వరరావు, నేదునూరి కృష్ణమూర్తిలకు పద్మభూషణ్ అవార్డులు ఇవ్వాలని సిఫారసు చేసిన ప్రభుత్వం.. మరికొందరి పేర్లను కూడా పద్మ అవార్డుల కోసం సిఫారసు చేసింది.

మరిన్ని వార్తలు