‘గ్రేటర్’పైయూటర్న్?

24 May, 2014 00:11 IST|Sakshi
‘గ్రేటర్’పైయూటర్న్?
  • అనకాపల్లి విలీనం రద్దుపై ఊహాగానాలు
  •  మున్సిపోరుపై  స్థానిక నేతల్లో ఆశలు
  •  టీడీపీ ఎమ్మెల్యేదే తుది నిర్ణయం!
  •  అనకాపల్లి, న్యూస్‌లైన్ : కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే అనకాపల్లి పట్టణంలో మునిసిపాలిటీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. గ్రేటర్‌లో విలీనమైన అనకాపల్లి మునిసిపాలిటీకి సంబంధించి ఉత్తర్వులు రద్దవుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి ఈ అంశానికి సంబంధించిన ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగా, తుది నిర్ణయం కొత్త ప్రభుత్వానికి వదిలేసినట్టు తెలుస్తోంది.

    భీమిలి మునిసిపాలిటీకి, గ్రేటర్ విశాఖకు మధ్యలో విలీనమైన ఐదు గ్రామాల విషయంలో గ్రామస్తులు కోర్టును ఆశ్రయించడం, విలీనం ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడంతో పాటు ఆయా గ్రామాలలో ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికితోడు భీమిలి మునిసిపాలిటీ సైతం శాటిలైట్ సిటీగా అభివృద్ధి చేస్తానని విలీన ఉత్తర్వులను రద్దు చేయిస్తానని తాజాగా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన గంటా ఎన్నికల హామీలలో పేర్కొనడంతో భీమిలి సైతం మునిసిపాలిటీగా ఉండిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇదేతరహా ప్రక్రియ అనకాపల్లి మునిసిపాలిటీ, మధ్యలో విలీనమైన ఐదు గ్రామాల విషయంలో కొనసాగనుందనే ప్రచారం మిన్నంటింది. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన పీలా గోవింద్ ‘దేశం’ పార్టీ అభ్యర్థి కావడంతో ఇతని మాటకు ప్రభుత్వంలో విలువ ఉంటుదనేది స్థానికుల అభిప్రాయం. గ్రేటర్ విశాఖలో అనకాపల్లి విలీనం, వెనక్కి మళ్లే అవకాశం ఉన్నటువంటి అంశాలపై ఎమ్మెల్యే ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ సాంకేతికమైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ప్రహసనంగా మారనున్న వార్డుల పునర్విభజన, కోర్టుల జోక్యం వంటి అంశాలతో అనకాపల్లి మళ్లీ మునిసిపాలిటీగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. దీనిపై పూర్తి స్పష్టత ప్రభుత్వం కొలువుదీరిన తరువాతే ఉంటుందని అధికార యంత్రాంగం చెబుతోంది. ఏదేమైనా ద్వితీయ శ్రేణి నేతలకు మాత్రం మళ్లీ మున్సిపోరు ఆశలు చిగురిస్తున్నాయి.

    గ్రేటర్ విశాఖలో విలీనమయితే మహా అయితే మూడు లేదా నాలుగు వార్డులు దక్కే అవకాశముంది. అదే మునిసిపాలిటీ అయితే 34 వార్డుల వరకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో గ్రేటర్ విశాఖలో అనకాపల్లి విలీన ఉత్తర్వులు రద్దయితే రానున్న రెండు, మూడు నెలల్లో మున్సిపోరు అనివార్యం కానుంది. సార్వత్రిక ఎన్నికలను మినహాయిస్తే పట్టణ ఓటర్లను నేరుగా ప్రభావితం చేసే ఈ ఎన్నికలు గత ఏడేళ్ల నుంచి లేనేలేవు.

    పదవుల కోసమే పిల్లిమొగ్గలు

    అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గతంలో జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు గ్రేటర్ విశాఖలో అనకాపల్లి విలీనాన్ని అట్టహాసంగా ప్రకటించారు. భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయానికి ఆ మునిసిపాలిటీని విలీనం కాకుండా అడ్డుకుంటాననే హామీ ఇచ్చారు. ఇలా పరస్పర విరుద్ధ భావాలను వ్యక్తం చేయడం ప్రజలను గందరగోళంలో పడవేస్తోంది.

    రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు వారి అవకాశాలు, పదవులను దృష్టిలో పెట్టుకొని పరిస్థితులకు అనుగుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారనేందుకు గ్రేటర్ విశాఖలో అనకాపల్లి, భీమిలి వంటి మునిసిపాలిటీల విలీనం, రద్దు వంటి ప్రతిపాదనలే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఏదేమైనా గందరగోళంలోకి నెట్టివేయబడిన అనకాపల్లి ప్రజలకు స్పష్టత, స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన అధికార యంత్రాంగాన్ని ఎంత త్వరగా అందిస్తే అంత మంచిదని ప్రజలు కోరుకుంటున్నారు.
     

మరిన్ని వార్తలు