ప్రాజెక్టుల పేరుతో దోపిడీ

27 Nov, 2016 23:15 IST|Sakshi
ప్రాజెక్టుల పేరుతో దోపిడీ

హంద్రీ-నీవాతోనే జిల్లా సస్యశ్యామలం
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
యర్రగుంట (రాప్తాడు) : అనంతపురం జిల్లాలో ప్రాజెక్ట్‌ల పేరుతో మంత్రి పరిటాల సునీత, ఆమె అనుచరులు దోపిడీ చేస్తున్నారని రాప్తాడు నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన రాప్తాడు మండలం యర్రగుంటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు నెలల పాటు పీఏబీఆర్‌ కుడి కాలువ కింద ఉన్న 49 చెరువులకు నీరిచ్చే అవకాశమున్నా... ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని తెలిపారు. అదే రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఐదేళ్ల పాటు ప్రతి ఏటా 49 చెరువులకు నీరు నింపారని గుర్తు చేశారు.

రాప్తాడు, కదిరి, ధర్మవరం ప్రాంత రైతులు, రైతు ప్రతినిధులతో కలిసి ఈ నెల 22 నుంచి రెండ్రోజుల పాటు కృష్ణా జిల్లాలో పర్యటించి అక్కడి సాగునీటి వ్యవస్థపై అధ్యయనం చేసినట్లు చెప్పారు. ప్రకాశం బ్యారేజి నుంచి తూర్పు, పడమర కాలువల వెంబడి, దానికి దిగువన ఉన్న పొలాల్లో ఎటు చూసినా ఒక్క విద్యుత్‌ స్తంభం కూడా కనిపించదని, ఆయకట్టు భూములన్నీ సాగునీటితో పచ్చగా కళకళలాడుతున్నాయని తెలిపారు. ఇలాంటి వాతావరణాన్ని రాయలసీమలో చూడాలని మహానేత వైఎస్‌ఆర్‌ పరితపించారని, ఆయన జీవించి ఉంటే ఇప్పటికే జిల్లా సస్యశ్యామలమై ఉండేదని అన్నారు.

ఈపీసీ విధానం రద్దుతో అన్యాయం
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈపీసీ విధానాన్ని రద్దు చేసి ప్రాజెక్ట్‌ పనుల కాంట్రాక్ట్‌లన్నీ పరిటాల సునీత తన అనుచరులకు కట్టబెట్టి నిధుల దోపిడీకి తెరలేపారన్నారు. ఆమె ప్రమేయంతోనే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ రద్దైందని తెలిపారు. కేవలం కమీషన్ల కోసం రైతులకు అన్యాయం చేశారని విమర్శించారు. 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సునీత ఏ రోజూ పీఏబీఆర్‌, హంద్రీ-నీవా గురించి అసెంబ్లీలో మాట్లాడిన పాపాన పోలేదన్నారు. ఆమె నిరంకుశ విధానాలతో నేడు రాప్తాడు నియోజకవర్గంలోని 74 వేల ఎకరాలకు నీరందని పరిస్థితి నెలకొందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న 20 శాతం హంద్రీ-నీవా పనులకు వంద శాతం పనులకు సమానమైన డబ్బును టీడీపీ నేతలు కొల్లగొట్టారని ఆరోపించారు. అయినా పది శాతం పనులు కూడా చేయలేదని తెలిపారు. రూ. 12 కోట్ల వ్యయమయ్యే ఒక టీఎంసీ హంద్రీనీవా నీటిని వంకల్లోకి, వాగుల్లోకి వదులుతున్నారని అన్నారు.

ఆయకట్టుకు అందని నీరు
హంద్రీనీవా ద్వారా దిగువన ఉన్న 20 చెరువులకు నీటిని వదిలినా... ఇప్పటి వరకు మొత్తంగా మూడు వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందాయన్నారు. రాప్తాడు మండలంలో 10 వేలు, చెన్నేకొత్తపల్లిలో 24 వేలు, కనగానపల్లిలో 17 వేలు, రామగిరిలో 10 వేలు, ఆత్మకూరు మండలంలో 20 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశాన్ని మంత్రి సునీత శాశ్వతంగా దూరం చేశారని ఆరోపించారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి మహానందనరెడ్డి, విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, రాప్తాడు మండల కన్వీనర్‌ బోయ రామాంజినేయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు