బయటకొచ్చినందునే బతికిపోయారు

12 Apr, 2020 08:23 IST|Sakshi

విజయవాడ, గుంటూరు నగరాల్లో కుటుంబాల కన్నీటిగాథలు 

ముందు జాగ్రత్తతోనే కరోనాకు కట్టడి 

అందరి సహకారంతోనే సమాజానికి మేలు 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఢిల్లీలో తబ్లిగీ జమాతేకు వెళ్లిన వారు, విదేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు స్వచ్ఛందంగా బయటకు రండి. కరోనా బారి నుంచి బయటపడండి. మీ కుటుంబాన్ని రక్షించుకోండి. ఇరుగుపొరుగు వారినీ ఇబ్బందులకు గురిచేయకండి అని ప్రభుత్వం పదే పదే చెప్పినా చెవికెక్కించుకోని వారి వల్ల కుటుంబాలకు కుంటుంబాలే తల్లడిల్లుతున్నాయి. ముందుగా ప్రభుత్వానికి సమాచారమిచ్చి ఆసుపత్రిలో చేరిన వారు కరోనా బారి నుంచి తప్పించుకోవడమే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా బయటపడ్డారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో చోటుచేసుకున్న సంఘటనలివి. కరోనా మహమ్మారి ఏ విధంగా కమ్మేస్తుందో చెప్పడానికి ఉదాహరణలివి.
 
గుంటూరులోని కుమ్మరి బజార్‌కు చెందిన వ్యక్తి ఒకరు ఢిల్లీకి వెళ్లారు. ఆ విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. దీంతో అయిదుగురు కుటుంబసభ్యులు, పొరుగింటి వారు ఇద్దరు కరోనా బారినపడ్డారు. ఆ ఇద్దరి నుంచి ఆ కుటుంబాలకు చెందిన 11 మందికి తాజాగా పాజిటివ్‌ వచ్చింది.   

విజయవాడ విద్యాధరపురంలోనూ...  
విద్యాధరపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి ఒకరు ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాతేకు వెళ్లారు. ఆ మత కార్యక్రమంలో పాల్గొన్న వారెవరైనా తక్షణం పరీక్షలు చేయించుకోండని ప్రభుత్వం పదేపదే హెచ్చరించింది. ఆ మాటలను చెవికెక్కించుకోనందున ఆ వ్యక్తి తల్లి మరణించింది.  అనారోగ్యం పాలైన తండ్రిని ఆసుపత్రిలో చేర్చగా కరోనా సోకిందని వైద్యులు నిర్ధరించారు. ఈ జబ్బు ఎలా వచ్చిందని ఆరా తీయగా అసలు విషయం వెల్లడైంది. ఢిల్లీలో మత కార్యక్రమానికి వెళ్లి వచ్చిన కుటుంబసభ్యుడు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. దీంతో అతని భార్య, సోదరుడు, ఆయన భార్య, వారి సమీప బంధువు కరోనా బారిన పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిలో ఇద్దరు మృతి చెందారు కూడా. వారితో కలిసినందున మరో ముగ్గురికి కూడా పాజిటివ్‌ వచ్చిందని నిర్ధారణైంది. చదవండి: లాక్‌డౌన్‌: అయ్యా..బాబూ.. ఆదుకోండయ్యా! 

ముందుగానే మేల్కొన్నందున...   
పారిస్‌ నుంచి విజయవాడకు వచ్చిన విద్యార్థి నాలుగు రోజులు ఐసొలేషన్‌లో ఉన్నారు. కరోనా లక్షణాలేమో అనే అనుమానంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. 14 రోజులు చికిత్స పొంది డిశ్ఛార్జి అయ్యారు. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారెవరికీ సమస్య రాలేదు.  
వాషింగ్టన్‌ నుంచి విజయవాడ గాయత్రి నగర్‌కు చేరుకున్న మరో విద్యార్థి ఒకరోజు ఇంట్లో ఉండి అనుమానంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. సకాలంలో వైద్యం పొంది ఎవరికీ ఇబ్బంది కలగలేదు.
 స్వీడన్‌ నుంచి నగరంలోని అయోధ్యనగర్‌కు వచ్చిన ఉద్యోగికి కూడా పాజిటివ్‌ వచ్చింది. ఇబ్బంది నుంచి బయటపడ్డారు.

దాచేస్తే జబ్బు దాగదు: సీపీ  
కరోనా జబ్బును దాచేస్తే దాగదని, దాని బారిన పడకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గమని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు, గుంటూరు రేంజ్‌ ఐజీ ప్రభాకరరావు అన్నారు. విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు అనుమానం రాగానే ఆసుపత్రికి వెళ్లి జబ్బు నుంచి బయటపడటమే కాకుండా కుటుంబసభ్యులతో సహా మరెవరికి సమస్య రాకుండా మేలు చేశారన్నారు. ఢిల్లీకి వెళ్లిన సంగతిని దాచినందున కుటుంబాలతో పాటు ఇరుగుపొరుగు వారికి తెచ్చారని, ఇది ఆందోళన కలిగిస్తోందన్నారు.  కరోనా రక్కసికి బలికాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త ఒక్కటే మార్గమని, అలాంటి వారే సమాజ శ్రేయోభిలాషులని వారు అభిప్రాయపడ్డారు. చదవండి: వాహ్‌.. కలెక్టర్‌ సాబ్‌ 

మరిన్ని వార్తలు