అది ‘గాలి’ మాటేనా !

20 Jan, 2014 02:49 IST|Sakshi

 నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు బీరాలు పోతుంటారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన మరచిపోతుంటారు. శాసనసభ్యుడి తీరు కారణంగా పుత్తూరులో 80 కుటుంబాలు జీవనోపాధి కరువై రోడ్డున పడి అవస్థలు పడుతున్నాయి.
 
 పుత్తూరు, న్యూస్‌లైన్ : ఇక్కడ థర్టిఫైవ్ ఇయర్‌‌స పొలిటికల్ ఇండస్ట్రీ..అభివృద్ధి అంతా నా హయాంలో జరిగిందే అంటూ నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు బీరాలు పోతుంటారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన మరచిపోతుంటారు. ఆయన తీరు కారణంగా 80 కుటుంబాలు రోడ్డున పడి అవస్థలు పడుతున్నాయి. పుత్తూరులోని కార్వేటినగరం రోడ్డు కూడలి వద్ద సుమారు ఎకరా విస్తీర్ణం కలిగిన కోనేటి స్థలం (రెవెన్యూశాఖ లెక్కల్లో కొలను) ఉంది. కోనేటి గట్టున 40 ఏళ్లుగా 80 కుటుంబాలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నాయి. శ్రీ కామాక్షి అంబికా సమేత సదాశివేశ్వర దేవస్థానానికి ధూప దీప నైవేద్యాలకు పన్ను చెల్లిస్తున్నాయి. ఈ క్రమంలో పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడానికి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు.
 
  ప్రజాప్రతినిధి అనుచరుల్లో ఒకరైన కాంట్రాక్టర్ కన్ను కోనేటి స్థలంపై పడింది. నివాస గృహాలను తొలగించేసి, కోనేరును పూడ్చి వేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలనే పథకం రూపొందిం చారు. ఇక్కడి 80 కుటుంబాల వారికి కాంప్లెక్స్ గదుల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామనే ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పట్లో అధికార పార్టీలో ఉన్న ముద్దుకృష్ణమ నాయుడు నేరుగా కోనేటి గట్టు నివాసితులతో సంప్రదింపులు జరిపినట్లు పలువురు పేర్కొంటున్నారు. బ్యాంకులతో మాట్లాడి రుణం తీసుకుని ఏడాదిలోపు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఇస్తామనే ముద్దుకృష్ణమనాయుడి హామీతో 2007 జూలై 31న కోనేటి గ ట్టున ఉన్న నివాసాలను తొలగించారు. ఆగమేఘాలపై కోనేరును మట్టితో పూడ్చేశారు. ఇంతవరకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించింది లేదు. మరోవైపు 80 కుటుంబాలు జీవనోపాధి కరువై రోడ్డున పడ్డాయి.
 
 మెజారిటీ తగ్గిందనే అక్కసుతోనే..
 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారిన ముద్దుకృష్ణమనాయుడికి పుత్తూరు పట్టణ పరిధిలో మెజారిటీ శాతం తగ్గిందనే అక్కసుతోనే పట్టణాభివృద్ధికి కృషి చేయడం లేదనే వాదన వినిపిస్తోంది. అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్న చందంగా వ్యవహరిస్తున్నారంటూ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు పెదవి విరుస్తున్నారు.
 
 సంపాదన వనరుగా కోనేటి స్థలం
 సదాశివేశ్వర స్వామి ఆలయ నిర్వహణలో ఉన్న కోనేటి స్థలంపై కొందరి కన్ను పడింది. ఆలయానికి ఆదాయం పేరిట పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలు సంపాదన వనరులుగా మారాయి. ప్రతి ఏటా వేలం పాటలో కాంట్రాక్టు పొందుతున్న వారు పవిత్ర ఆలయ స్థలాన్ని అపవిత్రం చేస్తూ నిషేధిత వ్యాపార నిర్వాహకులకు అద్దెకు ఇస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు