మంత్రి, ఎమ్మెల్యే వాగ్వాదం - జనం తోపులాట

6 Dec, 2013 04:14 IST|Sakshi

 సీతానగరం, న్యూస్‌లైన్ :
 స్థానికంగా కల్వర్టు పునర్నిర్మాణం విషయమై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి తోట నరసింహం, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మధ్య గురువారం తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. సీతానగరంలో సీనరేజీ నిధులతో చేపట్టే డ్రెయినేజి, రోడ్లు పనులకు శంకుస్థాపన, పాఠశాల, అంగన్‌వాడీ భవన (సింగవరం) ప్రారంభోత్సవానికి మంత్రి తోట వచ్చారు. సింగవరం నుంచి ఆయన తిరిగివస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు, టీడీపీ కార్యకర్తలు సీతానగరం ఏటిగట్టు వద్ద మంత్రిని అడ్డుకున్నారు.
 
  మూడున్నరేళ్ల కిందట కూలిన కల్వర్టును ఇప్పటివరకూ నిర్మించలేదని వారు మంత్రిని నిలదీశారు. కార్యకర్తలతో కలసి ఎమ్మెల్యే వెంకటేష్ మంత్రి వాహనానికి అడ్డంగా బైఠాయిం చారు. కార్యకర్తలు, పోలీసు సిబ్బంది సహకారంతో మంత్రి తాత్కాలిక కల్వర్టు దాటి వెళ్లేందుకు ప్రయత్నించగా టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. వారిని కాంగ్రెస్ కార్యకర్తలు తోసివేయగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. మూడు సార్లు కల్వర్టు విషయం, మిర్తిపాడు, బొబ్బిల్లంకల మధ్య తొర్రిగడ్డ కాలువపై కాజ్‌వే విషయం తెలిపినా  మంత్రి పట్టించుకోలేదని పెందుర్తి విమర్శించారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ కదలనివ్వబోమన్నారు.
 
 మంత్రి స్పందిస్తూ, అసమర్థ ఎమ్మెల్యే కనుకే పనులు చేయించుకోలేకపోతున్నావని మండిపడ్డారు. ధర్నాలు, రాస్తారోకోలు తప్ప పనులు చేయించుకోవడం రాదని ఎద్దేవా చేశారు. అనంతరం మంత్రి కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రెండు నెలల్లో సీతానగరం ఏటిగట్టు వద్ద కల్వర్టును, బొబ్బిల్లంక, మిర్తిపాడు రోడ్లో కాజ్‌వే పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజానగరం ఎమ్మెల్యేకు అభివృద్ధి పనులు చేతకాదన్నారు. దీనిని కప్పిపుచ్చుకోవడానికే తనను అడ్డుకున్నారన్నారు. డీసీసీబీ మాజీ వైస్‌చైర్మన్ బొల్లిన సుదాకర్, జెడ్‌పీటీసీ మాజీ సభ్యుడు వలవల రాజా, టీపీ స్కీమ్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కాండ్రు శ్రీను, పీఏసీఎస్ అధ్యక్షుడు పెందుర్తి నాగరత్నం పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు