బాబూ.. గుడ్‌బై..

14 Sep, 2019 10:07 IST|Sakshi
రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు

టీడీపీకి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు రాజీనామా

అదే బాటలో ఆయన అనుచరులు

చంద్రబాబు తీరుపై మండిపాటు

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీకి జిల్లాలో కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హామీల మీద హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రజలను నమ్మించి, మోసం చేసిన పాపానికి.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇంతటి పరాభవం ఎదురైనా.. ఏమాత్రం ఆత్మవిమర్శ లేకపోగా.. మితిమీరిన అహంకారంతో అధినాయకత్వం.. ముఖ్యంగా చంద్రబాబు, కొందరు నేతలు మోనార్క్‌ల్లా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీని నమ్ముకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గట్టిగా నమ్ముతున్న ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ‘చంద్రబాబుకో దండం’ అంటూ గుడ్‌బై చెప్పేస్తున్నారు. తాజాగా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, తన అనుచరులతో కలిసి టీడీపీకి రాజీనామా చేయడం.. కునుకుతీస్తున్న నక్క మీద తాటిపండు పడిన చందాన.. టీడీపీని ఓ కుదుపు కుదిపింది. 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి కారణంగా టీడీపీకి నానాటికీ ప్రజాదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఆ పార్టీకి ఒక్కొక్కరుగా నాయకులు తమ అనుచరులతో గుడ్‌బై చెప్పేస్తున్నారు. అధిష్టానం ఒంటెత్తు పోకడలతోనే పార్టీకి ఈ దుర్గతి పట్టిందని, అయినప్పటికీ కళ్లు తెరవకపోగా, నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయిన ఒకరిద్దరు నాయకుల మాటలు నమ్మి చంద్రబాబు పార్టీ పుట్టి ముంచేస్తున్నారని మండిపడుతున్నారు. టీడీపీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని బలంగా నమ్ముతూ, ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల మెట్ట ప్రాంతంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ వరుపుల జోగిరాజు (రాజా) టీడీపీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన వీడాక ఆ నియోజవకర్గానికి ఇన్‌చార్జిగా ఇంతవరకూ ఎవ్వరినీ నియమించుకోలేని దుస్థితిలో టీడీపీ ఉంది.

ఇదిలా ఉండగా ఒక బలమైన సామాజికవర్గంలో పట్టున్న నాయకుడిగా పేరున్న రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి శుక్రవారం గుడ్‌బై చెప్పేశారు. ఆయన వెంట నియోజకవర్గంలోని ఆ పార్టీ ముఖ్య నాయకులందరూ టీడీపీకి రాజీనామా చేశారు. తోటతో పాటు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గోపాల్‌బాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్లు వట్టికూటి సుబ్రహ్మణ్యం (అబ్బు), చెరుకూరి విశ్వేశ్వరరావు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కనకాల వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు యాళ్ల సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీపీ వినకోటి శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు అల్లూరి దొరబాబు, కొండా పోతురాజు, భీమారావు, పదిమంది మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు.. ఇలా దాదాపు ఆ పార్టీ నాయకులందరూ టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. దీంతో ఒక రకంగా రామచంద్రపురంలో టీడీపీ దాదాపు ఖాళీ అయిన పరిస్థితి ఏర్పడింది.

చంద్రబాబు తీరుతోనే..
తన రాజీనామాకు చంద్రబాబు వ్యవహార శైలే కారణమని తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. చంద్రబాబు ఇటీవల కాకినాడలో నిర్వహించిన పార్టీ జిల్లా సమీక్షకు ఆయన డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఆయన రాష్ట్రవ్యాప్తంగా టీడీపీలో ఉన్న తన సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నేతలతో కాకినాడలో భేటీ అయినప్పుడే చంద్రబాబు తీరుపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన, ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన రాజ్యసభ సభ్యులు.. సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహనరావుతో పాటు టీజీ వెంకటేశ్‌ టీడీపీ నుంచి కమళ దళంలో చేరడం వెనుక చంద్రబాబు ప్రోత్సాహం ఉందని నాడు బహిరంగంగానే చెప్పారు. అదే విషయాన్ని తన రాజీనామా సందర్భంగా త్రిమూర్తులు పునరుద్ఘాటించడం గమనార్హం.

జిల్లాలో పట్టు లేని మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలకు విలువనిచ్చి.. క్రియాశీలకంగా పని చేస్తున్న నేతలను చంద్రబాబు దూరం చేసుకుంటున్నారని పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. అంతమంది బీజేపీకి వెళ్లిపోతున్నా చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదన్నది జవాబు లేని ప్రశ్నగానే మిగులుతోంది. దీనిపై టీడీపీ నేతలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుపై ఉందని త్రిమూర్తులు అన్నారు. పాతికేళ్ల రాజకీయ జీవితంలో 17 ఏళ్లపాటు టీడీపీలోనే ఉన్నా.. తనకు చంద్రబాబు కనీస గౌరవం ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు. జొన్నాడ – యానాం ఏటిగట్టు రహదారిని రూ.175 కోట్లతో 40 అడుగులకు విస్తరించే పనులకు 2016లో ప్రతిపాదనలు ఇస్తే జీవో ఇచ్చి తరువాత పట్టించుకోకుండా అవమానించారని, ఇది కూడా తన రాజీనామాకు కారణమని చెప్పారు. కాగా తోట త్రిమూర్తులు తాజా ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి, మాజీ జెడ్పీ చైర్మన్‌ చెల్లుబోయిన వేణు చేతిలో ఓటమి చెందిన విషయం తెలిసిందే.

భవిత ప్రశ్నార్థకం
రానున్న కాలంలో పార్టీకి మరింత గడ్డు పరిస్థితిని తప్పదని టీడీపీ నేతలే విశ్లేషిస్తున్నారు. వరుస రాజీనామాలకు పూర్తిగా చంద్రబాబుతో పాటు జిల్లాలోని ఇద్దరు మాజీ మంత్రుల తీరే కారణమని దుయ్యబడుతున్నారు.

మరిన్ని వార్తలు