ఒంగోలు అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు అవసరం

8 Jun, 2014 01:09 IST|Sakshi
ఒంగోలు అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు అవసరం

 ఒంగోలు, న్యూస్‌లైన్ : ఒంగోలు నగరంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేయాలంటే వెయ్యి కోట్ల రూపాయలు అవసరమని గుర్తించినట్లు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మానుగుంట మహీధర్‌రెడ్డి ఇటీవల వరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రిగా పనిచేసినప్పటికీ జిల్లా కేంద్రమైన ఒంగోలు నగర అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.
 
నగరంలోని కర్నూలు రోడ్డు విస్తరణకు ఆటంకంగా ఉన్న భవనాలతో పాటు ధ్వంసమైన డివైడర్లు, పైపులైన్ లీకేజీలను కార్పొరేషన్, విద్యుత్ శాఖాధికారులతో కలిసి శనివారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెప్పించి ఒంగోలు నగర అభివృద్ధికి ఏడాదిలోగా బాటలు వేస్తానని పేర్కొన్నారు. ప్రధానంగా మంచినీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
 
 అదే విధంగా నగరానికి డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూలు రోడ్డు విస్తరణకు ఆటంకం కల్పిస్తూ కోర్టును ఆశ్రయించిన భవనాల యజమానులతో సోమవారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లో సమావేశమై చర్చించనున్నట్లు వెల్లడించారు.
 
 గోడు వెళ్లబోసుకున్న మహిళలు...
 కర్నూలు రోడ్డు, తదితర ప్రాంతాల్లో పర్యటించిన జనార్దన్‌ను స్థానిక వెంకటేశ్వరనగర్, మఠంబజార్, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాల ప్రజలు కలుసుకుని సమస్యలపై తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ ప్రాంతాలకు నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని వాపోయారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సాయంత్రంలోగా నీరు సరఫరా చేస్తామని కార్పొరేషన్ అధికారులు హామీ ఇచ్చారు.
 
 అదే విధంగా కర్నూలురోడ్డు విస్తరణలో కూలగొట్టిన భవనాలకు సెట్‌బ్యాక్‌కు సంబంధించిన టీడీఎస్ ఫారాలను కార్పొరేషన్ అధికారులు నేటికీ ఇవ్వలేదని వాటి యజమానులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దరఖాస్తులతో సంబంధం లేకుండానే కూలగొట్టిన భవనాల యజమానులకు వాటిని అందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
 
రోడ్డు విస్తరించిన ప్రాంతాల్లో ఇంకా రోడ్డుపైనే ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఆ శాఖాధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ యక్కల తులసీరావు, కార్పొరేషన్ కమిషనర్ విజయలక్ష్మి, ఎంఈ చెన్నకేశవరెడ్డి, పర్యావరణ డీఈ గిరిధర్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు