సూదికొండ క్వారీపై బెదిరింపులు

29 Jan, 2019 09:05 IST|Sakshi
గ్రామస్తులతో మాట్లాడుతున్న మానవహక్కుల వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు బీన ఢిల్లీరావు

అనుమతుల్ని అడ్డుకోవడం

నేరమంటూ బంజిరి నారాయణపురం  

గ్రామస్తులకు పోలీసుల హెచ్చరికలు

అండగా ఉంటామని మానవ

హక్కుల వేదిక ప్రతినిధుల భరోసా

శ్రీకాకుళం, కంచిలి: మండలంలోని మండపల్లి పంచాయతీ బంజిరినారాయణపురం గ్రామానికి ఆనుకొని ఉన్న  సూదికొండలో క్వారీ అనుమతులపై గ్రామస్తులు విభేదిస్తున్న నేపథ్యంలో సంబంధిత క్వారీ కాంట్రాక్టర్‌ ఆధ్వర్యంలో పోలీసులు, అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. అనుమతులు వచ్చిన క్వారీని అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. సూదికొండ వద్దకు సోంపేట సీఐ పి.తిరుమలరావు, కంచిలి ఎస్‌ఐ ఎం.హరికృష్ణ, నలుగురు కానిస్టేబుళ్లు, మండల సర్వేయర్‌ నాగేశ్వరరావు, టెక్కలి మైన్స్‌ అధికారి రవికుమార్, క్వారీ అనుమతులు పొందిన కాంట్రాక్టర్‌ సతీష్‌రెడ్డిలు సోమవారం వెళ్లి గ్రామస్తులను పిలిపించి మాట్లాడారు.

క్వారీ తవ్వకాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించగా, తవ్వకాలు చేపడితే జీవనోపాధిని కోల్పోతామని చెప్పినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. దీనిపై తీరుమారకపోతే వేరేవిధంగా ఉంటుందని హెచ్చరించినట్లు గ్రామస్తులు రాష్ట్ర మానవహక్కుల వేదికకు ఫిర్యాదు చేశారు. దీంతో మానవహక్కుల వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు బీన ఢిల్లీరావు సోమవారం రాత్రి బంజిరినారాయణపురం గ్రామానికి వెళ్లి గ్రామస్తులను పరామర్శించారు. అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్గని, గ్రామస్తుల సమ్మతి లేకుండా కొండలో క్వారీ తవ్వకాలకు అనుమతించడం సరికాదని, ఈ విషయమై నిరసన తెలియజేస్తున్న గ్రామస్తులను బెదిరించడం ప్రజాస్వామ్య రుద్ధమని బీన ఢిల్లీరావు విలేకర్లతో పేర్కొన్నారు. మానవహక్కుల వేదిక ఈ అంశంపై పూర్తి నిబద్ధతతో వ్యవహరిస్తుందని  స్పష్టం చేశారు.  

గ్రీన్‌ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేస్తాం..
బంజరినారాయణపురం సూదికొండలో అడ్డగోలుగా ఇచ్చిన అనుమతుల్ని రద్దుచేయించే అంశంపై  గ్రీన్‌ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు రాష్ట్ర మానవ హక్కుల వేదిక ఉపాధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు పేర్కొన్నారు. గ్రామస్తులను పోలీసులు, అధికారులు బెదిరించడం సరికాదన్నారు. ఇక్కడికి కూతవేటు దూరంలో రూ.20కోట్లు వెచ్చించి ఎన్‌.టి.ఆర్‌.సుజలస్రవంతి పథకం మదర్‌ప్లాంట్‌ను భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నాయనే కారణంతో ఏర్పాటు చేశారని, లక్షల్లో మాత్రమే ఆదాయం వచ్చే గ్రానైట్‌ తవ్వకాలకోసం ఇంతటి మహత్తర పథకాన్ని కూడా నాశనం చేయడం తగదన్నారు.

పరిశీలనకే వెళ్లాం: సీఐ తిరుమలరావు
బంజిరినారాయణపురం కొండలో తవ్వకాల విషయమై వివిధ పత్రికల్లో సోమవారం కథనాలు రావడంతో క్షేత్రస్థాయిలో విషయం తెలసుకోవడానికి మాత్రమే గ్రామానికి వెళ్లామని సోంపేట సీఐ పి.తిరుమలరావు విలేకరులకు చెప్పారు. క్వారీ తవ్వకాలకు అనుమతులున్నప్పుడు ఎవరు అడ్డుకున్నా చట్టరీత్యా నేరమని, అలా కాదని అభ్యంతరాలుంటే న్యాయపరంగా వెళ్లవచ్చని స్పష్టం చేశారు. ఈ విషయాన్నే గ్రామస్తులకు తెలియజేశామని పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా