అభివృద్ధి వికేంద్రీకరణ కలిసొచ్చిన అదృష్టం

31 Jan, 2020 09:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని అంటే ఆకాశహర్మ్యాలు, అందమైన రోడ్లు, ఆహ్లాదకరమైన పార్కులు, పెద్ద పెద్ద మాల్స్, సినిమా హాల్సే కాదు. పురోభివద్ధి కారిడార్లు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య కేంద్రాలు, విద్యావకాశ నిలయాలు, స్వచ్ఛమైన మంచినీరు, నిరంతర విద్యుత్, అందరికి ఆరోగ్యం, ఆధునిక ఇంటర్నెట్‌ కమ్యూనికేషన్లు, వ్యవసాయ పురోభివద్ధికి పరిశోధనలు, అంతర్జాతీయ వ్యాపారానికి ప్రణాళికలు, ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు చర్యలు....ఇలా ఎన్నో బరువులు, బాధ్యతలు. (వికేంద్రీకరణతో అన్ని వర్గాలకు న్యాయం)

వీటన్నింటిని ఒకే నగరానికి పరిమితం చేయకుండా మూడు నగరాలకు విస్తరిస్తామనడం కొత్త సంప్రదాయం. అభివృద్ధి వికేంద్రీకరణకు అసలైన మార్గం. ఇదే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్న మాట. గీసుకున్న బాట. భారత దేశంలో నగరాలు అభివద్ధి చెందిన గతకాలపు చరిత్రను పరిశీలిస్తే కొత్త సంప్రదాయంలో ఉన్న శాస్త్రీయ దృక్పథం కూడా అర్థం అవుతుంది. (మూడు రాజధానులకు మద్దతుగా పోస్టుకార్డుల వెల్లువ)

17వ శతాబ్దం నుంచి భారత్‌ లో ముంబై, చెన్నై, కోల్‌కతా రేవు పట్టణాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. అప్పటికే భారతీయులకు ఎంతో నైపుణ్యం ఉండడంతో విదేశాల నుంచి ముడి సరకులను తీసుకొచ్చి వాటి ఉత్పత్తులుగా మార్చి ఎగుమతి చేయడానికి ప్రధానంగా ఈ రేవు పట్టణాలే తోడ్పడ్డాయి. కనుక అక్కడ తొలుత మార్కెట్లు కూడా అభివృద్ధి చెందాయి. బ్రిటీష్‌ పాలకుల హయాంలో రేవుల వద్ద సరకుల దిగుమతి, ఎగుమతి కార్యకలాపాలు మరింత విస్తరించాయి. వాటికి దేశీయ మార్కెట్లు  కూడా అవసరం వచ్చి దేశ రాజధాని ఢిల్లీతోపాటు దేశంలో పలు వ్యూహాత్మక నగరాలను అభివృద్ధి చేయాల్సి వచ్చింది. వాటికి మౌలిక సౌకర్యాలు కల్పించాల్సి వచ్చింది. 

బ్రిటీష్‌ పాలకులది కేంద్రీయ పాలన కనుక పలానా ప్రాంతమని తేడా లేకుండా ఏ ప్రాంతం ఏ వ్యాపారానికి వీలుందో, ఆ ప్రాంతంలోని పట్టణాలకు మౌలిక సౌకర్యాలు కల్పించడం అనివార్యమైంది. ఆ తర్వాత వ్యవసాయోత్పత్తులు, ఇతర మార్కెట్ల అవసరాల కోసం ద్వితీయ శ్రేణి నగరాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్, అలహాబాద్, వారణాసి, ఆగ్రా, రాజస్థాన్‌లో జైపూర్, ఉదయ్‌పూర్, పంజాబ్‌లో లూథియానా, అమృత్‌సర్, మధ్యప్రదేశ్‌లో భోపాల్, ఇండోర్‌ లాంటి నగరాలు అలా అభివృద్ధి చెందినవే. (ఇతర రాష్ట్రాలదీ సమగ్రాభివృద్ధి బాటే!)

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల ప్రాతిపదిక ప్రాంతాలు, నగరాల అభివృద్ది జరుగుతూ వచ్చింది. ఒకప్పుడు మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఉన్న ప్రధాన నగరాలైన, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, నిజాం పాలిత ప్రాంతంతో కలిశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందుతూ వచ్చింది. తెలంగాణాతో విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలోని నగరాలను, వాటి చుట్టూ ప్రాంతాలను మరింత వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. (మూడు రాజధానుల ఆలోచన అద్భుతం)

అలాంటప్పుడు మూడు నగరాలకు రాజధాని కార్యకలాపాలను విస్తరించుకునే అవకాశం లభించడం నిజంగా ఓ అదృష్టమే. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా వాణిజ్యం కొనసాగుతున్న నేటి పరిస్థితుల్లో ఓ రేవు పట్టణానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అలాంటప్పుడు రాష్ట్ర సెక్రటేరియట్‌ అక్కడ ఉండడం ఎంతైన శ్రేయస్కరం. ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితమైతే వైషమ్యాలకు, వేర్పాటు వాదాలకు దారితీస్తుందని అలా ఆవిర్భవించిన ఓ రాష్ట్రానికి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. 

(కంచీ యూనివర్శిటీలో డీలిట్, అమెరికాలో పీహెచ్డీ చేసిన సమీర్‌ శర్మ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు రాసిన పరిశోధనాత్మక వ్యాసానికి సంక్షిప్త స్వేచ్ఛానువాదం)

మరిన్ని వార్తలు