పుత్రశోకం

3 Jan, 2015 02:37 IST|Sakshi

విద్యుత్‌షాక్‌తో ముగ్గురు చిన్నారుల మృతి
మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు
పామర్రులో విషాదం

 
పామర్రు : చేపల కోసం వెళ్లకుండా ఉన్నా... తమ పిల్లలు  దక్కేవారేమో అంటూ  మృతిచెందిన చిన్నారుల  తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. హై ఓల్టేజీ విద్యుత్ తీగల మధ్య చిక్కుకున్న గాలిపటం తీయబోయిన నల్లబోతుల ఏసురాజు, నల్లబోతుల జాన్‌బాబు, భోగిన సురేష్‌లు  మరణించడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. పామర్రు పట్టణం 8వ వార్డులోని రావి హరిగోపాల్‌నగర్‌లో నివాసముంటున్న  నల్లబోతుల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరమ్మకు ముగ్గురు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు ఏసురాజు(14), రెండో కుమారుడు జాన్‌బాబును స్థానిక జెడ్పీ పాఠశాలలో చేర్పించారు. అయినా వారు స్కూలుకు వెళ్లకుండా ఇంటివద్దనే కాలక్షేపం చేస్తున్నారు. మూడో కుమారుడు జక్రయ్య స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన భోగిన వీరయ్య, తిరుపతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక్కడే కుమారుడు(సురేష్) ఉన్నారు. సురేష్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కాన్వెంట్‌లో ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ రెండు కుటుంబాలకు చేపలవేటే జీవనాధారం. పెద్దలు రోజూ ఉదయాన్నే చేపల వేటకు వెళ్తుంటారు.   యథావిధిగా శుక్రవారం ఉదయం కూడా వెళ్లగా.. బిడ్డల మృతి విషయం తెలియడంతో వేటనుంచి తిరిగి వచ్చిన  వారు మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదిస్తున్నారు.
 
చిరునవ్వుతో పంపించారు..

 నల్లబోతుల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరమ్మ దంపతుల ఇద్దరు కుమారులు ఈ దుర్ఘటనలో మృతిచెందడంతో వారు పడుతున్న వేదన వర్ణనాతీతం. తాము ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు చిరునవ్వుతో పంపారని, ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయారని వెంకటేశ్వరమ్మ గుండెలు బాదుకుంటూ రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.
 
ఒక్కగానొక్కడు..


ముగ్గురు కుమార్తెల మధ్య ఒక్కడే కొడుకు కావడంతో సురేష్‌ను అతడి తల్లిదండ్రులు వీరయ్య, తిరుపతమ్మ అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. విగతజీవిగా మారిన సురేష్‌ను చూసి తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. తరువాత తేరుకుని గుండెలవిసేలా రోదిం చడం అక్కడివారి హృదయాలను కలచివేసింది.  ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
 
ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కల్పన

 విద్యుదాఘాతంతో ముగ్గురు చిన్నారులు మృతిచెందారన్న విషయం తెలియగానే పామర్రు ఎమ్మెల్యే, శాసనసభలో వైఎస్సార్‌సీపీ డెప్యూటీ    ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన  ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.  కల్పన మాట్లాడుతూ చిన్నారుల మృతికి చింతిస్తున్నామని, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించేలా కృషి చేస్తామన్నారు. విద్యుత్ శాఖ నుంచి కూడా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  మాజీ ఎమ్మెల్యే డి.వై.దాసు, టీడీపీ పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి వర్ల రామయ్య, గుడివాడ ఆర్డీవో వెంకటసుబ్బయ్య, సీఐ కోసూరు ధర్మేంద్ర, పామర్రు ఎస్‌ఐ మోర్ల వెంకటనారాయణ తదితరులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
 

మరిన్ని వార్తలు