మోసం కేసులో ముగ్గురు కానిస్టేబుళ్ల అరెస్టు

4 May, 2015 00:16 IST|Sakshi

ఆదోని(కర్నూలు): అక్రమార్జనకు అడ్డదారులు తొక్కిన ముగ్గురు కానిస్టేబుళ్లను కర్ణాటక పోలీసులు అరెస్టు చేయటం కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. వివరాలు..  కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని బాంబే జువెలర్స్ యజమాని అలీం వద్ద గుమాస్తాగా పని చేస్తున్న ఓ వ్యక్తి బంగారు ఆభరణాలు కొనేందుకు ఇటీవల వాహనంలో బెంగళూరుకు వెళ్లాడు. ఆదోని ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ జయన్న, అతని బంధువు కర్నూలు ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణ, అతని మిత్రుడైన మరో ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్‌తో పాటు మరో ముగ్గురు పథకం ప్రకారం మరో వాహనంలో ఆ గుమాస్తాను వెంబడించారు. వారంతా బెంగళూరులోని ఓ దాబా వద్ద కలుసుకుని జువెలర్స్ దుకాణం గుమాస్తా వద్దనున్న డబ్బును అందరూ పంచుకున్నారు.


ఆ తర్వాత ప్రత్యేక పోలీసులు తనను పట్టుకుని దొంగ బంగారం కోసమే డబ్బు తెచ్చావంటూ నగదు లాక్కున్నారని యజమాని అలీంకు గుమాస్తా ఫోన్లో సమాచారం చేరవేశాడు. యజమాని సూచన మేరకు గుమాస్తా సమీపంలోని అల్సూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంపై పోలీసులకు అనుమానం వచ్చింది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఈ వ్యవహారంలో మొత్తం ఆరుగురు ఉన్నట్లు గుర్తించారు. గుమాస్తా కూడా పోలీసులతో చెయ్యి కలిపి నాటకం ఆడినట్లు తమదైన శైలిలో విచారించగా బయట పడింది. కర్నూలు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అనుమతి తీసుకున్న కర్ణాటక పోలీసులు శనివారం రాత్రి ఎమ్మిగనూరులో సీఎం బందోబస్తుకు వచ్చిన ఏఆర్ కానిస్టేబుళ్లు శేఖర్, సత్యనారాయణలను అరెస్ట్ చేశారు.


ఆదోని పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉన్న జయన్నను ఆదివారం తెల్లవారు జామున అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. డబ్బు పంపకాల్లో మొత్తం ఆరుగురు ఉండగా.. ముగ్గురు పోలీసులు, బంగారు వ్యాపారి గుమాస్తాను అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. పంచుకున్న డబ్బు ఎంత అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. అయితే కొందరు రూ.40 లక్షలని.. మరికొందరు రూ.23 లక్షలని చర్చించుకుంటున్నారు. ఈ విషయమై అల్సూర్ పోలీసులను ఫోన్‌లో సంప్రదించగా కేసు విచారణలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇదిలాఉండగా ఈ వ్యవహారంపై కర్నూలు ఎస్పీ విచారణకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు