మరో కరోనా కేసు నమోదు..

27 Mar, 2020 09:14 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు మూడుకు చేరుకోవడంతో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. స్వీడన్‌లోని స్టాక్‌హోం నుంచి విజయవాడకు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నెల 18న ఢిల్లీకి వచ్చిన 28 ఏళ్ల ఆ యువకుడు.. అదే రోజు విజయవాడకు చేరుకున్నాడు. ఈ నెల 25న విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చేరగా, ఆ యువకుడి నమూనాలను వెంటనే ల్యాబొరేటరీకి పంపించారు.  గురువారం రాత్రి వచ్చిన రిపోర్టులో అతని కి కరోనా పాజి టివ్‌గా తేలింది. దీంతో ఆ వ్యక్తి 18వ తేదీ నుంచి ఎక్కడెక్కడ తిరిగాడనే వివరాలన్నీ సేకరిస్తున్నారు.
(చేతులెత్తి నమస్కరిస్తున్నా.. అర్థం చేసుకోండి)

నగరంలో మూడు కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. రెండు జోన్లుగా విభజించి కఠినమైన ఆంక్షలు విధించారు. వాడవాడలా శానిటేషన్‌ పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తు ల నివాస ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. నగరంలో ఫీవర్‌ టెస్ట్‌ సర్వే ఉద్యమంలా సాగుతోంది. విదేశాల నుంచి వచ్చి గుట్టుచప్పుడు కాకుండా తలదాచుకుంటున్న వారి కోసం వలంటీర్లు జల్లెడ పడుతున్నారు.
(కరోనా.. దాక్కోలేవు!)

విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గోప్యత వీడకపోతే కుటుంబంతో పాటు, ప్రజలు కూడా కరోనా బారినపడే ప్రమాదముందని సూచిస్తున్నారు. మొండిగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై గురువారం రాత్రి కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలతలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు.
(మూడు వారాలు కఠినంగా లాక్‌డౌన్‌)


 

మరిన్ని వార్తలు