ఇకపై తుపానుల ముప్పు ఎక్కువ

20 Jun, 2020 05:13 IST|Sakshi

రెండు నెలల వ్యవధిలో దేశంపై దండెత్తిన మూడు పెను తుపానులు

సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తున్న గ్రీన్‌హౌస్‌ వాయువులు

దీనివల్ల రుతుపవనాల గమనంపై దెబ్బ

తుపానుల పౌనఃపున్యం పెరగడానికి కారణమిదే

వర్షపాత విరామాలు తీవ్రతకూ హేతువు ఇదే

కేంద్రానికి నివేదించిన ‘మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్స్‌’ 

సాక్షి, అమరావతి: అంఫన్‌.. సూపర్‌ సైక్లోన్‌.. నిసర్గ.. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ మూడు తుపానులు వరుసగా తూర్పు కోస్తా, పశ్చిమ కోస్తా, ఉత్తరాది రాష్ట్రాలపై విరుచుకుపడ్డాయి. గతంలో దశాబ్దానికి సగటున రెండు పెను తుపానులు దేశాన్ని ముంచెత్తేవి. తాజాగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే మూడు పెను తుపానులు సంభవించడాన్ని బట్టి చూస్తే.. వీటి పౌనఃపున్యం (ఫ్రీక్వెన్సీ) పెరిగిందని.. ఇకపై తరచుగా తుపానులు దేశంపై విరుచుకుపడే ప్రమాదం ఉందని ‘మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్స్‌’ అంచనా వేసింది. వర్షం పడే రోజులు (రెయిన్‌ డేస్‌) తగ్గడం, కురిసినప్పుడు అధిక వర్షపాతం నమోదు కావడం, వర్షానికి వర్షానికి మధ్య విరామం (డ్రై స్పెల్స్‌) అధికంగా ఏర్పడటం వల్ల వరుస కరువులు సంభవించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఈ పరిస్థితికి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడమే కారణమని వెల్లడించింది. వాతావరణంలో గ్రీన్‌ హౌస్‌ వాయువుల పరిమాణాన్ని తగ్గించకపోతే.. ప్రజల జీవన ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాతావరణ మార్పులపై ‘మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్స్‌’ అధ్యయనం చేసింది. ఆ నివేదికను శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది.

నివేదికలోని ముఖ్యాంశాలివీ.. 
► పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే గ్రీన్‌ హౌస్‌ (హరిత గృహ) వాయువుల్లో 90 శాతం పరిమాణాన్ని సముద్రాలే పీల్చుకుంటాయి. ఇది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడానికి దారి తీస్తోంది. 
► సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగితే భూ ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. 1901 నుంచి 2018 మధ్య కాలంలో ఉష్ణోగ్రత ప్రపంచ వ్యాప్తంగా 0.3 డిగ్రీలు పెరిగితే.. దేశంలో 0.7 డిగ్రీలు పెరిగింది. 21వ శతాబ్దం ముగిసేనాటికి దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 4.4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. 
► దీనివల్ల ధృవ ప్రాంతాల్లో మంచు కరుగుతోంది. ఇదే రీతిలో హిమాలయ పర్వత శ్రేణుల్లోని హిమానీ నదాలు (గ్లేసియర్స్‌) కరుగుతున్నాయి. దీనివల్ల సముద్రం ఎత్తు పెరిగి.. భూ ఉపరితలంపైకి చొచ్చుకొస్తోంది. 
► హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాల ఎత్తు పెరిగింది. ముంబై తీరంలో సముద్రం ఎత్తు సంవత్సరానికి 3.3 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతోంది. ఇదే సమయంలో బంగాళాఖాతం ఎత్తు ఏడాదికి సగటున 1.75 మిల్లీమీటర్లు పెరుగుతోంది. 

దుర్భిక్షం తీవ్రత పెరిగే అవకాశం..
► సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదల రుతు పవనాల గమనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో 1951 నుంచి 1980 మధ్య కాలం కంటే.. 1951 నుంచి 2015 మధ్య కాలంలో వర్షపాత విరామాలు 27 శాతం పెరిగాయి. వర్షం పడే రోజులూ తగ్గాయి. వర్షం కురిసే రోజుల్లో మాత్రం అధిక వర్షపాతం నమోదవుతోంది. 
► గత ఆరేడు దశాబ్దాలుగా దేశంలో వర్షపాతం క్రమేణా తగ్గుతోంది. వర్షపాత విరామాలు అధికంగా ఏర్పడటం కరువు పరిస్థితులకు దారి తీస్తుంది. దశాబ్దంలో సగటున రెండేళ్లు ద్వీపకల్ప భారతదేశం, ఈశాన్య, మధ్య భారతదేశంలోని ప్రాంతాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇకపై కరువు పరిస్థితుల తీవ్రత 1.3 శాతం పెరిగే అవకాశం ఉంది. 

వరుస తుపానులు తప్పవు 
► 1901 నుంచి 2014 వరకూ దశాబ్దంలో సగటున రెండు తుపానులు దేశాన్ని ముంచెత్తేవి. కానీ.. 2014 నుంచి ఏటా తుపానులు ఏదో ఒక ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నాయి.  
► గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాలకు అడ్డుకట్ట వేయకపోతే తుపానులు మరింతగా దేశంపై దాడి చేసే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు