వరినాట్లుకు శ్రీకారం

2 Aug, 2014 00:39 IST|Sakshi

 తెనాలిటౌన్ : మూడు రోజుల క్రితం వర్షాలు కురవడంతో డెల్టాలో వరినాట్లకు రైతులు శ్రీకారం చుట్టారు. బోర్లు కింద పోసిన నారుమళ్లు ఏపుగా పెరగడంతో కంచర్లపాలెం, సోమసుందరపాలెం గ్రామాల్లో శుక్రవారం నాట్లు ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల వల్లన కాల్వలకు సకాలంలో నీరు విడుదల అయ్యే పరిస్థితులు లేకపోవడంతో ఎక్కువ మంది వెద పద్ధతిపై వరిసాగుకు మొగ్గు చూపారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 93,750 ఎకరాల మాగాణి విస్తీర్ణం ఉంది.

దీనిలో దుగ్గిరాల మండలంలో 22 వేల ఎకరాలు, తెనాలిలో 22,500 ఎకరాలు, కొల్లిపరలో 15 వేల ఎకరాలు, కొల్లూరులో 12,250 ఎకరాలు, వేమూరులో 22వేల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉంది. కాగా డివిజన్ పరిధిలో సుమారు 40 వేల ఎకరాల్లో వెద పద్ధతిలో వరిసాగు చేపట్టారు. మిగతా 53,750 ఎకరాల్లో సాధారణ పద్ధతిలో వరినాట్లు వేయాల్సి ఉంది. మరో 10 రోజుల్లో నాట్లు వేసేందుకు పొలాలను రైతులు సిద్ధం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు