ఏపీ: మూడు రోజులు భారీ వర్షాలు

7 Jun, 2020 18:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో నేడు, రేపు, ఎల్లుండి  ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నేడు, రేపు, ఎల్లుండి రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

నైరుతి రుతుపవనాల విస్తరణ
దక్షిణ ఇంటీరియర్  కర్ణాటక, రాయలసీమలోని కొన్నిప్రాంతాలు, తమిళనాడులోని చాలా ప్రాంతాలు, నైఋతి బంగాళాఖాతం మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలో మొత్తం ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలు,  వాయువ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలలోనికి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని విజయవాడ వాతావరణ కేంద్రం తెలిపింది.

మధ్య అరేబియా సముద్రం, గోవా, కొంకన్ లో కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలో మరియు రాయలసీమలో మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతం మరియు ఉత్తర బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలలోనికి నైరుతి రుతుపవనాలు రాగల 2 నుండి 3 రోజులలో విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది.

తదుపరి రెండు రోజులలో మహారాష్ట్ర, కర్ణాటక లో మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, కోస్తా ఆంధ్రాలో మరికొన్ని ప్రాంతాలు.. బంగాళాఖాతం, ఈశాన్య భారతదేశం లో మిగిలిన ప్రాంతాలు, సిక్కిం, ఒరిస్సా,  గాంగేటిక్ పశ్చిమబెంగాల్ లో కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో  మధ్య ట్రోపోస్పియర్ స్థాయిలు ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని.. దీని ప్రభావం వలన రాగల 48 గంటలో తూర్పు మధ్య  బంగాళాఖాతం ప్రాంతాల్లో  అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.


 

మరిన్ని వార్తలు