రహదారులు రక్తసిక్తం

2 Mar, 2018 09:33 IST|Sakshi
ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన ఆటో

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

మరో ఏడుగురికి తీవ్ర గాయాలు

వారిలో ముగ్గురి పరిస్థితి విషమం

జిల్లాలోని రోడ్లు గురువారం రక్తసిక్తమయ్యాయి. యాదమరి, బుచ్చినాయుడుకండ్రిగ, పుంగనూరు మండలాల్లో వేర్వేరుగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆటోను ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు
యాదమరి : మండల పరిధిలోని లక్ష్మయ్యకండ్రిగ వద్ద బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిలో బుధవారం రాత్రి ఆటోను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ మనోహర్‌ కథనం మేరకు.. బంగారుపాళెం మండలం గుండ్లకట్టమంచికి చెందిన ఉమాపతి కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో తమిళనాడులోని వళ్లిమలైలోని మురుగన్‌ ఆలయానికి వెళ్లారు. స్వామి వారి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా యాదమరి మండలంలోని లక్ష్మయ్య కండ్రిగ వద్ద బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఉమాపతి(47) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు పల్లవి(23), ఇంద్రాణి(27), మునెమ్మ(40), విజయలక్ష్మి(47), శ్రీధర్‌(07), మౌనిష్‌(07), ఆటో డ్రైవర్‌ వేణు(35) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పల్లవిని తిరుపతికి, ఇంద్రాణి, మౌనిష్‌ను వేలూరు సీఎంసీకి తరలించారు. కేసు దర్యాపు చేస్తున్నట్లు ఎస్‌ఐ మనోహర్‌ తెలిపారు.

బైక్‌ను లారీ ఢీకొని..
పుంగనూరు : మండలంలోని సుగాలిమిట్ట సమీపంలో గురువారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సన్నువారిపల్లెకు చెందిన రామయ్య కుమారుడు రవీంద్రారెడ్డి(28) ఎస్‌ఆర్‌కే రోడ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి మదనపల్లె నుంచి పుంగనూరుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేసే సమయంలో లారీ డ్రైవర్‌ ఎటువంటి సిగ్నల్స్‌ ఇవ్వకుండా రాంగు సైడులోకి లారీని పోనిచ్చాడు. ఈ సంఘటనలో అతన్ని లారీ లాక్కెళ్లింది. తీవ్రంగా గాయపూడిన అతన్ని స్థానికులు పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చెట్టును ఢీకొన్న బైక్‌
బుచ్చినాయుడుకండ్రిగ : మండల కేంద్రమైన బుచ్చినాయుడుకండ్రిగ సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనటంతో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పద్మావతిపురం దళితవాడకు చెందిన గురవయ్య (25) బుచ్చినాయుడుకండ్రిగలోని హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అతను బుధవారం రాత్రి హోటల్‌లో పనిముగించుకుని ద్విచక్ర వాహనంలో ఇంటికి బయలుదేరాడు. బుచ్చినాయుడుకండ్రిగ సమీపంలో వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి కేటీరోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. తీవ్రంగా గాయపడిన గురవయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీన్ని గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ రామ్‌మోహన్‌ అక్కడికి చేరుకుని గురవయ్య మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు