కాటేసిన మద్యం

6 Feb, 2017 22:01 IST|Sakshi
మద్యం బాటిళ్లను పరిశీలిస్తున్న డీఎస్పీ
– వివాహ వేడుకలో అతిగా మద్యం తాగి ముగ్గురు మృతి
– మిలటరీ మద్యం బాటిళ్లపై పోలీసుల ఆరా
– ఎవరిపై కేసు నమోదు చేయని పోలీసులు
  
నంద్యాల: వివాహ విందులో అతిగా మద్యం సేవించిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బిల్లలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అనుచరుడు భూమా రామకృష్ణారెడ్డి కుమారుడు రవికుమార్‌రెడ్డి వివాహ విందు సందర్భంగా ఆదివారం సాయంత్రం నుంచే గ్రామంలో సందడి మొదలైంది. హైదరాబాద్‌లోని గోల్కొండ మిలిటరీ హాస్పిటల్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రవికుమార్‌రెడ్డి గ్రామస్తులకు, స్నేహితులకు మందు పార్టీ ఇవ్వడానికి దాదాపు 30 మిలిటరీ బాటిళ్లను గ్రామానికి తీసుకొచ్చారు. ఓల్డ్‌ఫాక్స్‌ రమ్, అరిస్ట్రోక్రాట్‌ విస్కీ, రాయల్‌ఛాలెంజ్‌ విస్కీలను బిందెల్లో పోసి, నీళ్లు కలిపి, గ్రామ నడిబొడ్డులోని గంగమ్మ ఆలయం వద్ద పానకంలా పంపిణీ చేశారు. విందులో పాల్గొన్న గ్రామానికి చెందిన కన్నాపుల్లయ్య, చిలకల కృష్ణుడు, గురువయ్య కూడా సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మద్యాన్ని అతిగా తాగారు. తర్వాత వీరు ఇళ్లకు వెళ్లారు. కొద్ది సేపటికి అపస్మారక స్థితికి చేరుకున్నారు.
 
మొదట పుల్లయ్యను కుటుంబీకులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందాడు. తర్వాత గురువయ్య, చిలకల కృష్ణుడును కుటుంబ సభ్యులు వేర్వేరుగా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వీరు కూడా కోలుకోలేక అర్ధరాత్రి మృతి చెందారు. కుటుంబ సభ్యులు వీరి మృతదేహాలను  గ్రామానికి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న రూరల్‌ సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్‌ఐలు రమణ, సూర్యమౌళి, గోపాల్‌రెడ్డి, బిల్లలాపురం గ్రామానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. సోమవారం ఉదయం నంద్యాల ఇన్‌చార్జి డీఎస్పీ ఈశ్వరరెడ్డి గ్రామాన్ని సందర్శించి మృతదేహాలను పరిశీలించారు. ఖాళీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షలకు పంపుతామని డీఎస్పీ తెలిపారు. 
 
అన్ని మిక్స్‌ చేయడమే ఘటనకు కారణం
మిలిటరీ క్యాంటిన్‌ నుంచి తెచ్చిన పలు రకాల మద్యాన్ని బిందెల్లో పోసి నీళ్లు కలపడంతో కల్తీ జరిగినట్లు ఎక్సైజ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ శ్రీరాములు తెలిపారు. అన్ని మిక్స్‌ చేసిన మద్యాన్ని సేవించడం ప్రమాదకరమన్నారు. దీంతోనే ముగ్గురు చెంది ఉంటారని పేర్కొన్నారు. 
 
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు 
మద్యం తాగి ముగ్గురు మృతి చెందిన సంఘటనకు సంబంధించి ఎవరిపై కేసు నమోదు చేయలేదని రూరల్‌ ఎస్‌ఐ రమణ తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదిక అందాక కేసును పరిశీలిస్తామన్నారు. అప్పటి వరకు ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసులు నమోదు చేశామన్నారు.  
 
రోడ్డున పడ్డ మూడు కుటుంబాలు
  •  గ్రామంలోని దళిత వాడకు చెందిన కన్నాపుల్లయ్య నిరుపేద. ఆయన భార్య మరియమ్మ, కుమార్తె మౌనిక గుడిసెలో నివాసం ఉన్నారు. కన్నాపుల్లయ్య పగలంతా పని చేస్తేనే వీరి కుటుంబం గడవదు. ఆదివారం సాయంత్రం 6గంటలకు వివాహ విందుకు వెళ్లిన పుల్లయ్య విగత జీవిగా ఇంటికి చేరడంతో మరియమ్మ కుప్పకూలిపోయింది. పుల్లయ్య పెద్దకుమార్తె సుమలతకు వివాహం కాగా చిన్నకుమార్తె మౌనిక అవివాహితురాలు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
  •  దండబోయిన గురువయ్య కూలీగా పని చేసేవాడు. కాని రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కాలు విరిగింది. దీంతో కూలీ పని చేసే అవకాశం లేక పొట్టెళ్ల వ్యాపారం ప్రారంభించాడు. అతని కుమారుడు మధు టిప్పర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగింది. గురువయ్య కూడా రాత్రి పెళ్లి విందుకు వెళ్లి మృత్యువాత పడటంతో కుమారుడిపై కుటుంబ భారం పడింది. మృతుడి భార్య లక్ష్మి రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. 
  •   వ్యవసాయ కూలీ చిలకల కృష్ణుడు నిరుపేద. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. కృష్ణుడు రోజూ కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కూడా రాత్రి వివాహ విందులో పాల్గొని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో సంజీవనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. ఆయన కోలుకోలేక మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబం దిక్కులేనిదైంది.      
మరిన్ని వార్తలు