కడదాకా కన్నపేగు వెంటే

23 May, 2017 04:14 IST|Sakshi
కడదాకా కన్నపేగు వెంటే

కన్నబిడ్డలను వదిలి ఒక్క క్షణమైనా ఉండలేని అమ్మ ఆఖరకు వారి వెంటే వెళ్లిపోయింది. అమ్మా అమ్మా అంటూ నిత్యం తల్లి వెంట తిరిగే చిన్నారులు చివరకు ఆ తల్లితోనే అనంతలోకాలకు పయనమయ్యారు. అప్పటి వరకు నాన్న అంటూ పిలిచిన బిడ్డలు ఇక లేరని తెలిసి ఆ తండ్రి గుండె తల్లడిల్లిపోతోంది. తమ ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేసిన సాయి, సిరిలు ఇక రారని తెలిసి సిరిపురం కన్నీరు పెట్టుకుంది. నేలబావిలో పడి తల్లీబిడ్డలు మృతి చెందిన ఘటన సిరిపురం గ్రామాన్ని శోకంలో ముంచేసింది.

శ్రీకాకుళం జిల్లా  : సంతకవిటి మండలం సిరిపురం గ్రామంలో నేలబావిలో పడి తల్లీబిడ్డలు రోహిణి (30), సిరివల్లి (5), సాయిసాత్విక్‌ (3)లు సోమవారం మృతి చెందారు. మామిడితోటలో జరిగిన ఈ దుర్ఘటనతో గ్రామం ఘొల్లుమంది. మృతుల్లో ముక్కుపచ్చలారని చిన్నారులు ఉండడం స్థానికులను కలిచివేసింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సిరిపురం గ్రామానికి చెందిన పొగిరి అప్పలనాయుడు భార్య పిల్లలతో కలిసి తన మామిడితోటకు కాయలు దించేందుకు సోమవారం వెళ్లారు. రెండు బస్తాల కాయలు రావడంతో ఒక బస్తాను ద్విచక్ర వాహనంపై వేసుకుని తాను ఇంటికి వెళ్తానని, పిల్లలను తీసుకుని రావాలని భార్యకు చెప్పాడు. ఆ బస్తాను ఇంటి వద్ద దించి మళ్లీ తోటకు వచ్చి రెండో బస్తాను కూడా తీసుకెళ్లాడు. అప్పటికీ తన భార్యాపిల్లలు ఇంటికి చేరకపోవడంతో అనుమానం వచ్చి తోటంతా గాలించాడు. చుట్టుపక్కల పరిశీలించగా నేలబావిలో భార్యాపిల్లలు పడి ఉండడం చూసి ఘొల్లుమన్నాడు. సమాచారం అందుకున్న స్థానికులు బావిలోంచి రోహిణితో పాటు చిన్నారులను బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందారు. వీరి మృతదేహాలను చూసి అప్పలనాయుడు తట్టుకోలేక కన్నీరుమున్నీరయ్యారు.

సిరిపురం కంట నీరు
తల్లీబిడ్డలు నేలబావిలో పడి మృతి చెందడంతో సిరిపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పలనాయుడు సిరిపురం గ్రామంలో ఫొటో స్టూడియో నడుపుతూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఈయన కుటుంబంలో ఇంతటి విషాదం సంభవించడాన్ని గ్రామస్తులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు మృత్యువాత పడ్డారని తెలుసుకొని గ్రామస్తులంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రోదనలతో మామిడితోట శోక సంద్రంగా కనిపించింది.

బావిలో బురద
రోహిణితోపాటు చిన్నారులు మృతి చెందిన బావిలో కొద్దిపాటి నీటితోపాటు బురద కూడా ఉంది. తొలుత చిన్నారులు బావిలో జారిపడడాన్ని గమనించి వారిని కాపాడే ప్రయత్నంలో రోహిణి కూడా బావిలో దిగి మృతి చెంది ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మామిడికాయలు ఇంటికి తరలించే ప్రయత్నంలో ముందుగా తన పిల్లలను అప్పలనాయుడు ఇంటికి చేర్చి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదికాదేమోనని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసు దర్యాప్తు
విషయం తెలుసుకున్న రాజాం రూరల్‌ సీఐ శేఖర్‌బాబుతోపాటు సంతకవిటి ఎస్సై ఎస్‌.చిరంజీవి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులతోపాటు బాధిత కుటుంబ సభ్యుల వద్ద వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

మరిన్ని వార్తలు