ఆ పట్టణాలిక ‘అమృత’ధామాలు

26 Jun, 2015 03:05 IST|Sakshi

తాడేపల్లిగూడెం : కేంద్ర ప్రభుత్వం ‘అమృత్’ పేరిట కొత్తగా ప్రకటించిన అటల్ పట్టణ రూపాంతరీకరణ, పునరుజ్జీవన పథకానికి ఏలూరు నగరం, భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాలు ఎంపికయ్యాయి. హడ్కో ఆధ్వర్యంలో అటల్ మిషన్ ఫర్ రీ జువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్ (అమృత్) పేరిట దేశంలోని ముఖ్య పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గురువారం శ్రీకారం చుట్టిన విషయం విదితమే.
 
 ఈ పథకం కింద రాష్ట్రంలో 31 పట్టణాలను అభివృద్ధి చేయనుండగా, వాటిలో ఏలూరు నగరం, సెలక్షన్ గ్రేడ్ మునిసిపాలిటీలైన తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాలకు స్థానం దక్కింది. పట్టణ పేదలకు గృహాలు, పట్టణంలో ప్రధాన మౌలిక సదుపాయా లు, సుందరీకరణ, రవాణా, సమాచార వ్యవస్థలతోపాటు పచ్చదనం అభివృద్ధి తదితర కార్యక్రమాలను అమృత్ పథకం కింద చేపడతారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఇప్పటికే అమలులో ఉన్న అందరికీ ఇల్లు పథకాన్ని కూడా ఇందులో చేర్చారు. తద్వారా పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.లక్ష నుంచి రూ.2.30 లక్షల వరకు నిధులిస్తారని సమాచారం.
 
 అభివృద్ధికి అవకాశం
 అమృత్ పథకం కింద ఒక్కొక్క పట్టణానికి కనీసం రూ.100 కోట్ల వరకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నిధులు అభివృద్ధి పనులు చేపట్టడానికి అక్కరకు వస్తాయని భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో మోటారు వాహనాల వినియోగం తగ్గించి సైకిళ్ల వినియోగాన్ని పెంచుతారు. ఇందుకు వీలుగా సైకిల్ ట్రాక్‌లు, ఆరోగ్యం కోసం నడక నడవటానికి వీలుగా వాకింగ్ ట్రాక్‌లు, వీటితోపాటు సాయంత్రం, ఉదయం వేల ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు వీలుగా సుందరీకరణ పేరిట పార్కులు వంటివి అమృత్ పథకం కింద సమకూరతాయని పురపాలకులు ఆశిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాల్సి ఉంది.
 
 పట్టణాలకు వరమే
 మునిసిపాలిటీల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకంలో జిల్లాలోని మూడు పట్టణాలకు చోటు దక్కడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవకాశాలు మెరుగవుతాయని పురపాలకలు సంబరపడుతున్నారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం పట్టణాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయమంతా ఖర్చులకే సరిపోతోంది. ఆర్థిక సంఘం నిధులిస్తున్నా.. అప్పులు, వేరే ఖాతాలకు మళ్లిపోతున్నాయి. చిన్నపాటి పని చేయాలన్నా ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే అన్నవిధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘అమృత్’ పథకానికి ఎంపికైన మూడు పట్టణాలకు ఎంతోకొంత మేలు జరుగుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు