మూడు కత్తెర్లకు ఓకే

19 Jun, 2018 10:54 IST|Sakshi
వెలవెలబోతున్న కేశఖండన శాల

పర్మనెంట్‌ సిబ్బందితో పనులు

సెలూన్‌ల వద్ద బారులు తీరిన భక్తులు

భక్తుల అవసరాన్ని వాడుకుంటున్న ఆటో వాలాలు

ఇంద్రకీలాద్రి : దుర్గగుడి కేశఖండన శాలలో క్షురకులు నిరవధిక సమ్మె చేస్తుండటంతో ఆలయానికి చెందిన పర్మనెంట్‌ సిబ్బందితో పనులు చేయించేలా ఏర్పాట్లు చేశారు. అయితే వారితో కూడా తలనీలాలు తీసేందుకు క్షురకులు ఒప్పుకోకపోవడంతో కేవలం మూడు కత్తెరలు మాత్రమే వేసేం దుకు అంగీకరిస్తున్నారు. ఆదివారం 3,500 మంది భక్తులు మూడు కత్తెర్లు ఇవ్వగా, సోమవారం  1,300 మంది భక్తులు మూడు కత్తెర్లు ఇచ్చారు.

పరిస్థితి తీవ్రతరం
సోమవారం మంత్రి వర్గంతో నాయీ బ్రాహ్మణుల సంఘ ప్రతినిధుల చర్చలు విఫలం కావడం, ఒకటి రెండు రోజుల్లో బార్బర్‌ షాపులను కూడా మూసి వేయాలని నిర్ణయించడంతో సమస్య ఇప్పుడు మరింత తీవ్రతరమవుతోంది. భక్తుల నమ్మకాలపై కూడుకున్న వ్యవహారం కావడంతో ప్రభుత్వం దీనిపై త్వరగా ఒక నిర్ణయానికి రావాలని పలువురు కోరుతున్నారు.

‘సెంటిమెంట్‌’ను వాడేసుకుంటున్నారు
భక్తుల సెంటిమెంట్‌ను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. అమ్మవారికి తలనీలాలను ఇచ్చేందుకు వచ్చే భక్తులను కొంత మంది  సెలూన్‌ల యజమానులు, ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా దండుకుంటున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తులు అమ్మవారికి తలనీలాలను సమర్పిస్తుంటారు. అయితే ప్రస్తుతం కొండపై కేశఖండన శాలలో క్షురకుల సమ్మెలో ఉండటంతో భక్తులు తలనీలాలు సమర్పించడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే కనీసం మూడు కత్తెర్లతో తలనీలాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుండగా, మరి కొంత మంది ఆలయానికి సమీపంలోని బార్బర్‌ షాపులలోనైనా తలనీలాలు ఇచ్చేయాలని నిర్ణయానికి వస్తున్నారు. దీంతో బ్రాహ్మణ వీధి, రథం సెంటర్‌లోని సెలూన్‌లకు డిమాండ్‌ పెరిగింది.

ఇష్టానుసారంగా చార్జీలు
దీనికి తోడు కొంత మంది ఆటో డ్రైవర్లు భక్తులను సెలూన్‌ల వద్దకు తీసుకువెళ్లి తలనీలాలు సమర్పించిన తర్వాత తిరిగి దుర్గాఘాట్‌ వరకు వదిలేందుకు ఒక్కొక్కరికి రూ. 70 నుంచి రూ. 100ల వరకు వసూలు చేస్తున్నారు. భక్తుల సెంటిమెంట్‌ను ఈ విధంగా ఆటో డ్రైవర్లు ఆదాయ మార్గంగా మాలుచుకుంటుండగా, బార్బర్‌ షాపుల యజమానులు ఒక్కొక్కరికి గుండు చేసేందుకు రూ. 50లు తక్కువ కాకుండా తీసుకోవడం కొసమెరుపు. వేల రూపాయలు చార్జీలు పెట్టుకుని యాత్రలు చేసుకుంటూ వస్తున్నామని తలనీలాలు ఇవ్వకుండా తిరి గి వెళ్లితే అశుభమని బావించి ఎంత ఖర్చు అయినా సరే భరించి తలనీలాలు ఇస్తున్నామని శ్రీకాకుళం జిల్లా నుంచి విచ్చేసిన  బృందం  పేర్కొంది.

మరిన్ని వార్తలు