ప్రపంచం కీర్తించే ఐదుగురిలో ముగ్గురు భారతీయులే

27 Jan, 2017 00:37 IST|Sakshi
ప్రపంచం కీర్తించే ఐదుగురిలో ముగ్గురు భారతీయులే

గుడివాడ: ప్రపంచం కీర్తించే ఐదుగురు మహానుభావుల్లో ముగ్గురు మన భారతదేశంలో పుట్టిన వారు కావడం ఎంతో గర్వకారణమని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ పేర్కొన్నారు. ఏపీలోని గుడివాడలో ఉన్న విశ్వభారతి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో గురువారం జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి చిన్నచిన్న రాజ్యాలుగా ఉన్న ప్రాంతాలను సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నాయకత్వంలో విలీనం చేశారని, భారతదేశాన్ని గణతంత్ర దేశంగా తీర్చిదిద్దుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించారని వివరించారు.

 ప్రపంచం కీర్తించే మహానుభావులు శ్రీకృష్ణుడు, జీసెస్, మహ్మద్‌ ప్రవక్త, బుద్ధుడు, మహాత్మాగాంధీ అని, వారిలో ముగ్గురు భారత గడ్డపై పుట్టినవారు కావడం మనం గర్వించదగ్గ విషయమన్నారు. భారతదేశ విశిష్టతను విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమం అనంతరం 3,214 మీటర్ల పొడవైన జాతీయ పతాక ప్రదర్శన ర్యాలీని యార్లగడ్డ ప్రారంభించారు. నాలుగు గంటలపాటు 3,500 మంది విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ డీఎస్పీ అంకినీడు ప్రసాద్, టూటౌన్‌ సీఐ శివాజీ, పాఠశాల వ్యవస్థాపకుడు పొట్లూరి శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు