రెండు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

21 Jun, 2018 08:13 IST|Sakshi

ఎదురెదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొన్న రెండు ఘటనల్లో ముగ్గురు మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదాలు పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామం వద్ద, నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో జరిగాయి.

పెంటపాడు:  పెంటపాడు–రాచర్ల రోడ్డులో దర్శిపర్రు గ్రామ శివారున మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత రెండు మోటార్‌సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో  ఇద్దరు యువకులు మరణించారు. మరో వ్యక్తికి స్వల్ప గాయలయ్యాయి. పెంటపాడు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాచర్లకు చెందిన కిలపర్తి చంద్రశేఖరశివకుమార్‌ (28) తాడేపల్లిగూడెం  బ్రహ్మానంరెడ్డి మార్కెట్‌లో హమాలీగా పనిచేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి పని ముగిశాక గ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. వల్లూరుపల్లికి చెందిన దంగేటి విజయ్‌కుమార్‌(24) శీలంశెట్టి సాయితో కలిసి స్వగ్రామం నుంచి గూడెం వెళుతున్నాడు. 

ఈ క్రమంలో రోడ్డుపై గొయ్యిని తప్పించబోయి దర్శిపర్రు బొమ్మల తూము వద్ద ఎదురుగా వస్తున్న శివకుమార్‌ బైక్‌ను ఢీకొట్టాడు. ఘటనా స్థలంలోనే  శివకుమార్‌ మరణించాడు. తీవ్ర గాయాలైన దంగేటి విజయ్‌కుమార్‌ను అంబులెన్స్‌లో తణుకు లోని ప్రేవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ విజయ్‌కుమార్‌ మృతి చెందాడు. విజయ్‌కుమార్‌ వెనుక కూర్చున్న సాయి సమీపంలోని పంట బోదెలో పడటంతో స్వల్పగాయాలయ్యాయి. అతను గూడెంలోని ఆసుపత్రిలో చికిత్స పొందాడు. పెంటపాడు ఎస్సై ఎ.రమేష్‌ ఆ«ధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం పోలీసులు బుధవారం మధ్యాహ్నం వారి బంధువులకు అప్పగించారు.

రాచర్ల, వల్లూరుపల్లిలో విషాద చాయలు
ఈ ప్రమాదంలో మరణించిన ఇద్దరు పేద కుటుంబాలకు చెందిన వారే. రాచర్లకు చెందిన శివకుమార్‌ గూడెం కూరగాయల మార్కెట్‌లో జట్టుకూలీ. నాలుగేళ్ల క్రితం రామలక్ష్మితో వివాహమైంది. వీరికి మూడేళ్లు, ఏడాది వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతని తండ్రి కూడా జట్టులో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందాడు. శివకుమార్‌ మృతితో ఆ కుటుంబం మగదిక్కును కోల్పోయింది. అతని భార్య, తల్లిని గుండెలవిసేలా రోదిస్తున్నారు. 

∙వల్లూరిపల్లికి చెందిన దంగేటి విజయ్‌కుమార్‌ తల్లి అతని చిన్నతనంలోనే మృతి చెందగా, నానమ్మ సత్యవతి వద్ద ఉంటున్నాడు. భవననిర్మాణ కార్మికునిగా పనిచేసే ఇతను ఖాళీ సమయాల్లో ట్రాక్టర్‌ నడుపేవాడు. చిన్న వ్యాపారమో, వాహనమో కొనుక్కోవాలని కాపు కార్పొరేషన్‌ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్నాడు. అయితే పదో తరగతి పాసై ఉండాలని అధికారులు చెప్పడంతో ప్రైవేట్‌గా పదోతరగతి కట్టి పాసయ్యాడు. ఇప్పుడు కాపు కార్పొరేషన్‌ ద్వారా రుణం పొంది సొంతంగా ఏదొకటి చేస్తూ బతకాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. వయసు వచ్చిన మనవడికి పెళ్లి చేసి తాను బాధ్యత తీర్చుకుందామని అతని నానమ్మ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో అతను మరణించాడు. ఈ విషయాన్ని బంధువులు చెబుతూ కంటనీరు పెట్టుకున్నారు.  

సమిశ్రగూడెంలో మరో ప్రమాదం..
నిడదవోలు రూరల్‌: మండలంలోని సమిశ్రగూడెంలో రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.  ఎస్సై డి.రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సమిశ్రగూడెంకు చెందిన లారీ డ్రైవర్‌ మల్లిపూడి శ్రీను కుమారుడు ప్రశాంత్‌ (23), అన్న కొడుకు మల్లిపూడి కిరణ్‌బాబు ఈనెల 19 రాత్రి  మంచినీళ్లు తీసుకురావడానికి బైక్‌పై వెళుతుండగా గ్రామ శివారులోని సిలువసెంటర్‌ సమీపంలో నిడదవోలు వైపు వస్తున్న మరో బైక్‌ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈఘటనలో తలకు తీవ్రగాయాలైన ప్రశాంత్‌ను రాజమహేంద్రవరంలో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం వేకువ జామున అతను మృతిచెందాడు. కిరణ్‌బాబుకు తీవ్రగాయాలు కావడంతో నిడదవోలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రశాంత్‌ లారీ క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. చేతికందిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ప్రశాంత్‌ తల్లి నాగమణి గుండెలవిసేలా రోదించింది. మృతుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు