కిడ్నీ మార్పిడి ఘటనపై త్రిసభ్య కమిటీ

11 May, 2019 09:55 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖలో కిడ్నీ మార్పిడి ఘటనలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి ఇదో వ్యాపారంగా పెట్టుకుని ఏటా కోట్లాది రూపాయలు ఆర్జించిన శ్రద్దా ఆసుపత్రి.. కాలం కలిసిరాక ఇప్పుడు అడ్డంగా బుక్కయిపోయింది. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. శ్రద్ద ఆసుపత్రి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన ఆపరేషన్‌ల తీరుపై ఆరా తీశారు. 

శ్రద్ధ ఆస్పత్రికి రాష్ట్రంతోపాటూ ఇతర రాష్ట్రాల్లోనూ బ్రోకర్లున్నారు. వీరు కిడ్నీ ఎవరికి అవసరం? ఎవరిస్తారు? వంటి వాటిపైనే దృష్టి సారిస్తారు. అలా దొరికిన వారితో ఆస్పత్రి యాజమాన్యం, వైద్యుడు (నెఫ్రాలజిస్టు)కు బ్రోకర్లు పరిచయం చేసి బేరం కుదురుస్తారు. ఇలా శ్రద్ధ ఆస్పత్రి యాజమాన్యానికి దేశంలోని వివిధ ప్రాంతాల బ్రోకర్లతో లింకులున్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. తాజాగా వెలుగు చూసిన పార్థసారథి వ్యవహారంలో పోలీసులకు అశ్చర్యం కలిగించే విషయాలు వెల్లడయినట్టు సమాచారం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో విశాఖకంటే మెరుగైన, అత్యాధునిక వైద్య సదుపాయాలున్న కార్పొరేట్‌ ఆస్పత్రులు ఎన్నో ఉన్నా... అంతగా పేరు ప్రఖ్యాతల్లేని విశాఖలోని శ్రద్ధ ఆస్పత్రికే కిడ్నీ మార్పిడి కేసులు పెద్ద సంఖ్యలో వస్తుండడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు