సొంతూరు వస్తూ.. దుర్మరణం

27 Dec, 2013 04:12 IST|Sakshi

పామూరు, న్యూస్‌లైన్ : నుచ్చుపొద పంచాయతీ పరిధిలోని చిలకపాడు, నాచవాగు మధ్య గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కనిగిరి మండలం నేలటూరు గొల్లపల్లికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. మృతులలో ఇద్దరు పురుషులు, రెండు నెలల పసికందు ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో సంఘటన స్థలం మార్మోగింది. సాయం చేసేందుకు కనుచూపు మేర ఎవరూ లేకపోవడంతో దాదాపు 20 నిమిషాల పాటు క్షతగాత్రులు అల్లాడిపోయారు.

వివరాలు.. కనిగిరి మండలం నేలటూరు గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇంటూరి సీమోను(28), రాజేశ్‌లు అన్నదమ్మలు. వీరు అక్కాచెల్లెళ్లు కుమారి, కెజియమ్మలను వివాహం చేసుకున్నారు. అన్న సీమోను భార్య కుమారి. తమ్ముడు రాజేశ్ భార్య కెజియమ్మ. అన్నదమ్ములు చెన్నైలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబ సభ్యులతో కలిసి అక్కడి అంబుత్తూర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో స్థలాల రిజిస్ట్రేషన్ కోసం అన్నదమ్ముల కుటుంబాలు స్వగ్రామం రావాలని భావించాయి. బుధవారం చెన్నైలో క్రిస్మస్ వేడుకులను ఘనంగా జరిపి గురువారం వేకువ జామున స్వగ్రామానికి కారు (టాటా ఇండికా విస్తా టీఎన్ 22 బిఎస్ 2007)లో బయల్దేరారు. కారును అక్కాచెల్లెళ్ల మేనమామ కుమారుడు జుటుకా సురేశ్‌బాబు నడుపుతున్నాడు. ఇతను చెన్నైలో వీరితో పాటే ఉంటున్నాడు.

 సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో కారు పామూరు దాటి  కనిగిరి రోడ్డులోని చిలకపాడు, నాచవాగు మధ్య ప్రయాణిస్తోంది. ఉన్నట్లుండి ముందు టైర్ పగిలిపోవడంతో కారు రోడ్డుపై పల్టీలు కొట్టింది. దీంతో కారు నడుపుతున్న సురేశ్‌బాబు (22), ఇంటూరి సీమోను (28), మెర్సీ (2 నెలలు) అక్కడికక్కడే మృతి చెందారు. రాజేశ్, కెజియమ్మ దంపతుల కుమార్తె మెర్సీ. రాజేశ్ దంపతులతో పాటు వీరి మరో కుమార్తె జెస్లీనా, సీమోను భార్య కుమారి మొత్తం నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ట్రాలీ వాహనంలో వైద్యశాలకు తీసుకెళ్లారు.
 మరో గంట దాటితే..
 అన్నదమ్ముల కుటుంబ సభ్యులు మరో గంటలో స్వగ్రామం వెళ్లేవారు. ఇంతలో ప్రమాదం జరిగి సీమోను, సురేశ్‌బాబు, మెర్సీ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కళ్లముందే తన భర్త సీమోను చేతులు తెగి విలవిల్లాడుతూ ప్రాణాలు విడుస్తుంటే భార్య కుమారి నిస్సహాయస్థితిలో కన్నీరు మున్నీరుగా విలపించింది. కారు నడుపుతున్న తన మేనమామ కుమారుడు సురేశ్‌బాబు అప్పటికే విగతజీవిగా పడి ఉండటం.. తన చెల్లెలు కుమార్తె రెండు నెలల మెర్సీ మృతి చెందడంతో ఆమె రోదన వర్ణనాతీతం. పామూరు సీఐ డి.మల్లికార్జునరావు, ఎస్సై గుంజి హజరత్‌బాబు, సీఎస్‌పురం ఎస్సై లాల్ అహ్మద్, ట్రైనీ ఎస్సై చంద్రశేఖర్‌లు వచ్చి వివరాలు నమోదు చేశారు.
 తాను చనిపోతూ..కుమార్తెకు ప్రాణం పొసిన పెదనాన్న
 కనిగిరి, న్యూస్‌లైన్ : సీమోను ముందు సీట్లో ఉండి తన తమ్ముడు రాజేశ్ పెద్ద కుమార్తె జెస్సీకాను పైన కూర్చోబెట్టుకున్నాడు. కారు బోల్తా కొడుతుండ టాన్ని ముందే పసిగట్టి చిన్నారి జెస్సీకాను కారులో నుంచి బయటకు విసిరేశాడు. ఆ తర్వాత కారు మూడు పల్టీలు కొట్టినట్లు క్షతగాత్రులు తెలిపారు. బాలిక స్వల్పగాయాలతో బయట పడింది. సిమోను చనిపోతూ.. తన కుమార్తెకు ప్రాణం పోశాడు. ఈ సంఘటనతో గొల్లపల్లి, వెంకట్రాయునిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు