అంతా.. అనుకున్నట్టే

4 Jul, 2014 01:55 IST|Sakshi
అంతా.. అనుకున్నట్టే

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  మున్సిపాలిటీలను గెలుచుకునేందుకు తెలుగుదేశం పార్టీ అనుకున్నట్టే చేసింది. పంతాన్ని నెగ్గించుకుంది. మూడు పట్టణాలను తన ఖాతాలో వేసుకుంది. జిల్లా లో శ్రీకాకుళం, రాజాం, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పాలకొండ మున్సిపాలిటీలున్నాయి. వీటిలో మూడు నెలల క్రితం పలాస, ఇచ్ఛాపురం, పాలకొండ, అమదాలవల సలకు ఎన్నికలు జరిగాయి. కోర్టులో కేసులు ఉన్నందున శ్రీకాకుళం, రాజాం ఎన్నికలు నిలిచిపోయాయి. ఎన్నికలు జరిగిన నాలుగింటిలో మూడు మున్సిపాలిటీలను తెలుగుదేశం, ఒకటి వైఎస్సార్‌సీపీ దక్కిం చుకుంది. ఆమదాలవలసలో మాత్రం వైఎస్సార్‌సీపీ అధికస్థానాలను కైవసం చేసుకున్నా కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రకు ఆ పీఠం కూడా తెలుగుదేశం పార్టీకే వెళ్లిపోయింది.
 
 సార్వత్రిక ఎన్నికలు జరగడం, ప్రభుత్వం ఏర్పడడం జరిగిపోయినా మున్సిపల్ పగ్గాలు ప్రతినిధుల చేతికి రావడం ఆలస్యమయ్యాయి. ఈ క్రమంలో గురువారం ఎన్నికల అనంతరం సభ్యులతో ప్రమాణస్వీకారం కూడా చేయించడంతో ఈ ప్రక్రియకు తెరపడింది. పలాస, పాలకొండ మున్సిపాలిటీల్లో టీడీపీకి పూర్తి మేజారిటీ ఉండడంతో ఆ పార్టీ వారే అధ్య క్ష పీఠాలను అధిరోహించారు. ఆమదాలవలసలో కాంగ్రెస్ సభ్యులు అధికార పార్టీకి కొమ్ము కాయడంతో పీఠం టీడీపీ వశమైంది. ఇచ్ఛాపురం పీఠాన్ని చేజి క్కిం చుకునేందుకు అధికార పార్టీ ఎన్ని కుయక్తులు పన్నినా ఫలితం లేకపోయింది. సభ్యులంతా వైఎస్సార్‌సీపీవైపు చివరివరకూ నిలవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ రెండు కుర్చీలు అదే పార్టీకి దక్కాయి.
 
 ఇచ్ఛాపురంలో ‘దేశం’ కుళ్లు రాజకీయాలు
 ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో అధిక వార్డులు వైఎస్‌ఆర్ సీపీకే దక్కాయి. 23 వార్డులకు టీడీపీకి కేవలం ఎనిమిది రాగా, వైఎస్సార్‌సీపీకి 13 దక్కాయి. రెండు స్వతంత్రులకు లభించాయి. వైఎస్సార్‌సీపీ సభ్యులు చేజారిపోకుండా ఆ పార్టీ విప్ జారీ చేసింది. కానీ అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా ఎలాగైనా పురపాలిక పీఠం దక్కించుకునేందుకు కొద్దిరోజులుగా కుయుక్తులు పన్నుతూ వచ్చింది. ఒక్కో సభ్యునికీ రూ.15 లక్షల వరకూ ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఇండిపెండెంట్లను తన వైపు తిప్పికొని అధిపత్యానికి సరిపడా సీట్లను వైఎస్సార్‌సీపీ నుంచి తెప్పించుకునేందుకు నానా పాట్లు పడింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డిపై ముందు నుంచీ ఉన్న అభిమానం, ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కించుకునేందుకు ఆ పార్టీ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎన్ని చేసినా తాము పార్టీ ఫిరాయింపులకు దూరమేనంటూ పరోక్షంగా సంకేతాలు పంపించారు. చివరకు చైర్మన్, వైస్ చైర్మన్ రెండు పీఠాలు వైఎస్సార్‌సీపీకే దక్కాయి.
 
 కాంగ్రెస్ దౌర్భాగ్యం
 దేశం, రాష్ర్టంలోనూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్‌పార్టీ మున్సిపల్ అధ్యక్ష ఎన్నికలో టీడీపీతో కుమ్మక్కయింది. సార్వత్రిక ఎన్నికల్లోనూ కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన ఆ పార్టీ ఆమదాలవలసలో మునిసిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం అమ్ముడుపోయింది. అక్కడ మొత్తం 23 వార్డులకు ఎన్నికలు జరగ్గా టీడీపీ 8, వైఎస్సార్‌సీపీకి 10 వార్డులు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి మూడు, స్వతంత్రులకు రెండు దక్కాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం ఎవరిపనిలో వారుండగా ‘దేశం’ నేతలు మాత్రం మిగతా సభ్యుల్ని తనవైపు రప్పించుకునే పనిలో పడ్డారు. ఫలితంగా ఓ సభ్యుడు టీడీపీలోకి జారిపోయాడు.
 
 దీంతో ఆ పార్టీ బలం 9కి చేరింది. అయితే వైఎస్సార్‌సీపీపై ఉన్న అభిమానంతో మరో స్వతంత్రుడు ఆ పార్టీలోకి వెళ్లగా ఆ పార్టీ బలం మొత్తం 11కి చేరింది. ఇక్కడ కథ మారింది. వైఎస్సార్‌సీపీకి పీఠం దక్కకుండా చేసేందుకు టీడీపీ బేరాలకు దిగింది. కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని శిబిరాలకు తీసుకుపోయింది. గురువారం జరిగిన పాలకవర్గ ఎన్నికల్లోనూ భారీ ఆఫర్ ప్రకటించింది. ఒక్కో వ్యక్తికీ నజరానాగా లక్షల రూపాయలు ముట్టజెప్పడంతోపాటు వైస్ చైర్మన్ పదవినిస్తామంటూ కాళ్లబేరానికి దిగింది. దీంతో ముగ్గురు కాంగ్రెస్ వార్డు సభ్యులు టీడీపీకి మద్దతు పలికారు. ఫలితంగా చైర్మన్ పదవి టీడీపీకి చెందిన తమ్మినేని గీతకు దక్కగా వైస్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.వెంకట రాజ్యలక్ష్మికి నజరానాగా దక్కింది.
 
 మహిళలకే కిరీటాలు
 ఆకాశంలో సగం అన్న చందాన జిల్లాలో మున్సిపల్ పాలక వర్గాలు అత్యధికంగా మహిళలకే దక్కాయి. రాజకీయాల్లో ఇన్నాళ్లూ తెరచాటునే ఉన్న మహిళలు ఏకంగా పురపాలిక పీఠాల్నే అధిరోహించడం శుభపరిణామం. ఎన్నికలు జరిగిన నాలుగు మున్సిపాలిటీల్లో పలాస తప్పా ఇచ్ఛాపురం, పాలకొండ, ఆమదాలవలసల్లో మహిళలకే చైర్మన్ కిరీటాలు దక్కాయి.
 
 నాలుగు మున్సిపాలిటీల్లో పరిస్థితి ఇలా..
 శ్రీకాకుళం సిటీ: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిస్థితి ఇలా ఉంది.  ఇచ్ఛాపురంలో 23 వార్డులుండగా టీడీపీ ఎనిమిది,  వైఎస్సార్‌సీపీ 13, స్వతంత్రులు ఇద్దరు విజయం సాధించారు. దీంతో వైఎస్సార్‌సీపీకి చెందిన పిలక రాజ్యలక్ష్మి చైర్మన్‌గా ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా అదే పార్టీకి చెందిన కాళ్ల శకుంతలను ఎనుకున్నారు.  పలాసలో 25 వార్డులకు టీడీపీ 17, వైఎస్సార్‌సీపీ 8 స్థానాల్లో గెలిచింది. దీంతో టీడీపీకి చెందిన కోత పూర్ణచంద్రరావు చైర్మన్‌గా, అదే పార్టీకి చెందిన గురిటి సూర్యనారాయణ వైస్ చైర్మన్‌గా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.  ఆమదాలవలసలో మొత్తం 23 వార్డులున్నాయి. వీటిలో వైఎస్సార్‌సీపీ 10, టీడీపీ 8, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 2 స్థానాల్లో గెలుపొందారు. అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున బీ-ఫారం పొందిన బొడ్డేపల్లి అజంతాకుమారి చైర్‌పర్సన్ అభ్యర్థిగా రంగంలోకి దిగగా, టీడీపీ నుంచి తమ్మినేని గీత కూడా బరిలోదిగడంతో ఎన్నిక (చేతులెత్తే విధానం) అనివార్యమయ్యింది.
 
 వాస్తవానికి మెజార్టీ స్థానాలు టీడీపీకి లేకపోవడంతో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు సభ్యుల మద్దతుతో పాటుగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆమదాలవలస ఎమ్మెల్యే  కూన రవికుమార్, శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలు కూడా ఓటింగ్‌లో పాల్గొన్నారు. టీడీపీ తరఫున మొత్తం 15 మంది మద్దతివ్వగా, వైఎస్సార్‌సీపీ సభ్యులు 10 మందితో పాటు స్వతంత్రుడితో సహా 11 మంది మద్దతిచ్చారు. దీంతో టీడీపీ అభ్యర్థి గీతకు అధ్యక్ష పీఠం దక్కింది. కీలకమైన మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి కానుకగా వైస్ చైర్‌పర్సన్‌గా కూన రాజ్యలక్ష్మికి టీడీపీ నేతలు అవకాశమిచ్చారు.  పాలకొండలో ఉన్న 20 వార్డు స్థానాల్లో టీడీపీకి 12, వైఎస్సార్‌సీపీ 3, స్వతంత్రులు 5  గెలుచుకున్నారు. దీంతో  టీడీపీకి చెందిన పల్లా విజయనిర్మల అధ్యక్షురాలుగా, వైస్ చైర్‌పర్సన్‌గా అదే పార్టీకి చెందిన శిరిపురపు చూడామణిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  
 
 మున్సిపాలిటీ    చైర్మన్    వైస్ చైర్మన్    పార్టీ
 ఇచ్ఛాపురం    పి.రాజ్యలక్ష్మి    కె. శకుంతల    వైఎస్సార్‌సీపీ    
 పాలకొండ    పి. విజయనిర్మల    ఎస్. చూడామణి    టీడీపీ
 పలాస    కె.పూర్ణచంద్రరావు    జి.సూర్యనారాయణ    టీడీపీ
 ఆమదాలవలస    టి.గీత (టీడీపీ)    కె.వెంకట రాజ్యలక్ష్మి    కాంగ్రెస్
 

>
మరిన్ని వార్తలు