కృష్ణా నదిపై కొత్తగా మూడు బ్యారేజీలు

2 Oct, 2019 03:36 IST|Sakshi

ప్రకాశం బ్యారేజీకి దిగువన నిర్మించే యోచన 

డీపీఆర్‌ల తయారీకి సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

సాగు, తాగునీటి అవసరాల కోసమే..

సముద్రపు నీరు ఎగదన్నకుండా అడ్డుకోవచ్చు 

కృష్ణా డెల్టా చౌడు బారకుండా చూడవచ్చు 

భూగర్భ జలాలు కలుషితం కాకుండా కాపాడవచ్చు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన మూడు బ్యారేజీల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై చోడవరం, గాజులంక, ఓలేరు వద్ద బ్యారేజీల నిర్మాణానికి డీపీఆర్‌ల తయారీకి రూ. 8.78 కోట్లను కృష్ణా డెల్టా చీఫ్‌ ఇంజనీర్‌కు ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో డీపీఆర్‌ల కోసం టెండర్‌ నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి కృష్ణా డెల్టా సీఈ కసరత్తు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనులపై గత నెల 12న సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు చోట్ల డబుల్‌లేన్‌ బ్రిడ్జిలు, ఒక బ్యారేజీగానీ లేదా మూడు చోట్ల బ్యారేజీలుగానీ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు. వీటిపై సీఎం జగన్‌ స్పందిస్తూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలను తీర్చడానికి మూడు చోట్ల బ్యారేజీల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. బ్యారేజీలు నిర్మిస్తే సముద్రపు నీరు కృష్ణా నదిలోకి ఎగదన్నదని.. దీని వల్ల డెల్టాను చౌడు బారిన పడకుండా రక్షించవచ్చునని.. భూగర్భజలాలు పెంపొందించడమే కాకుండా కలుషితం కాకుండా చూడవచ్చన్నారు.
ఎక్కడ: ప్రకాశం బ్యారేజీకి 12 కి.మీ.ల దిగువన కృష్ణా జిల్లా చోడవరం వద్ద 
నీటి నిల్వ సామర్థ్యం: 2.70 టీఎంసీలు
అంచనా వ్యయం: రూ. 1,210 కోట్లు

నిండుగా కృష్ణమ్మ..
భద్రాచలం దగ్గర నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గోదావరి నది ఎప్పుడూ నిండుగా కన్పిస్తుంది. అదే తరహాలో పులిచింతల నుంచి సముద్రంలో కలిసే వరకూ కొత్తగా నిర్మించే బ్యారేజీలతో కృష్ణా నదిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. సాగు, తాగునీటి అవసరాలు, పర్యాటక రంగంతో పాటు జలరవాణాకూ ఊతమిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

ఎక్కడ: ప్రకాశం బ్యారేజీకి 45 కి.మీ.ల దిగువన గుంటూరు జిల్లా గాజుల్లంక వద్ద 
నీటి నిల్వ సామర్థ్యం: 4.47 టీఎంసీలు
అంచనా వ్యయం: రూ. 1,275 కోట్లు

ఎక్కడ: ప్రకాశం బ్యారేజీకి 60 కి.మీ.ల దిగువన గుంటూరు జిల్లా ఓలేరు వద్ద 
నీటి నిల్వ సామర్థ్యం: 3.25 టీఎంసీలు
అంచనా వ్యయం: రూ. 1,350 కోట్లు

కృష్ణా వరద ప్రవాహాన్ని ఈ మూడు బ్యారేజీల నుంచి కాలువల ద్వారా మళ్లించి ఆయకట్టుకు నీటిని అందివచ్చు. తాగునీటి అవసరాలను తీర్చవచ్చు. 

మరిన్ని వార్తలు