శ్రీనివాసరావు సేవలో ముగ్గురు ఖైదీలు!

3 Jan, 2019 04:36 IST|Sakshi

జైల్లో రాజభోగాలు

వ్యక్తిగత పనులు చేసేందుకు బిహార్, ఒడిశా ఖైదీల నియామకం

సాక్షి, అమరావతి బ్యూరో: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై  హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు విశాఖ సెంట్రల్‌ జైల్లో వీఐపీ మర్యాదలు అందుతున్నాయి. చిత్రావతి హై అలర్ట్‌ బ్లాక్‌లో రిమాండ్‌ ఖైదీగా ఒంటరిగా ఉంచిన శ్రీనివాసరావుకు సదుపాయాలను సెంట్రల్‌ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిందితుడు ఉంటున్న గదిని శుభ్రం చేయడం, వ్యక్తిగత పనులు, భోజనం గదికి తెచ్చేందుకు  ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఖైదీలను ఏర్పాటు చేశారు. బిహార్‌కు చెందిన భాయ్, జలీల్, ఒడిశాకు చెందిన మిధుల్‌ అనే ఖైదీలను శ్రీనివాసరావుకు సేవలు చేసేందుకు నియమించారు. 

ఇతర రిమాండ్‌ ఖైదీలు కలవకుండా కట్టడి.. 
జైల్లో శ్రీనివాస్‌ ఉంటున్న గది వద్దకు నలుగురు కాపలా పోలీసులు, సేవలు అందిస్తున్న ముగ్గురు ఖైదీలు, జైలు ఉన్నతాధికారులు మినహా ఇతరులు ఎవరూ వెళ్లకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిందితుడికి జైల్లో జరుగుతున్న రాచ మర్యాదలు ప్రతిపక్ష నేతపై హత్యాయత్నాన్ని ఓ ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ పెద్దలే చేయించారనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. (అల్లిన కథే.. మళ్లీ)

శ్రీనివాస్‌కి సేవలు చేస్తే రోజూ నాన్‌వెజ్‌ 
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును రిమాండ్‌ ఖైదీగా సెంట్రల్‌ జైలుకి తరలించినప్పుడు అతడికి అవసరమైన సేవలు చేస్తే రోజూ శ్రీనివాసరావుకు అందించే మాంసాహారాన్నే ఇస్తామని జైలు అధికారులు ఖైదీలకు ఆఫర్‌ ఇచ్చారు. ఆసక్తి చూపిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఖైదీలను కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఎంపిక చేశారు. 

మరిన్ని వార్తలు