ఫేస్‌బుక్‌ స్నేహం.. ప్రాణాల మీదకు తెచ్చింది..

9 Jan, 2020 16:48 IST|Sakshi

నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థులు

ఫ్లిఫ్‌ కార్టు ద్వారా నిద్రమాత్రలు కొనుగోలు

సకాలంలో స్పందించిన పోలీసులు 

సాక్షి, ధర్మవరం: ఫేస్‌బుక్‌ స్నేహం ప్రాణం మీదకు తెచ్చింది.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో.. ముగ్గురు స్నేహితులు  నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు.. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో వారు బ్రతికి బయపటపడ్డారు. ధర్మవరం పట్టణంలో కలకలం రేపిన ఈ సంఘటనపై డిఎస్పీ రామాకాంత్‌ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...

ధర్మవరం పట్టణానికి చెందిన ముగ్గురు డిగ్రీ చదివే విద్యార్థులు తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారి తల్లిదండ్రులు బు«ధవారం రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కంప్లైంట్‌ తీసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఆ విద్యార్థిణిల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఈ ముగ్గురు విద్యార్థులు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు వారు పట్టణంలోని సవేరా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. వారిని పోలీసులు విచారించగా జరిగిన  వివరించారు.

ఫేస్‌బుక్‌ పరిచయంతో అప్పుచేసి:
డిగ్రీ చదువుతున్న ముగ్గురమ్మాయిలలో ఒకరికి పట్టణంలోని మారుతీ నగర్‌కు చెందిన పూజారి మహేష్‌ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం రెండో అమ్మాయికి రూ.20వేలు నగదు అప్పుగా తీసుకుంది. నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌తో మూడో అమ్మాయితో సదరు మహేష్‌ పరిచయం పెంచుకోవడంతో మొదటి అమ్మాయికి మహేష్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో మొదటి అమ్మాయి ద్వారా రెండవ అమ్మాయికి ఇచ్చిన అప్పును తిరిగి ఇచ్చేయాలని, అందుకు వడ్డీ కూడా చెల్లించాలని ఒత్తిడి చేశాడు. వారిద్దరినీ అసభ్య పదజాలంతో  దూషించాడు. దీంతో ఆ ముగ్గురు అమ్మాయిలు ఆ మొత్తాన్ని తిరిగి మహేష్‌కు ఇచ్చేందుకు తర్జనబర్జనపడుతూ వస్తున్నారు. 

రోజురోజుకూ మహేష్‌ నుంచి వారికి ఒత్తిడి అధికమవ్వడంతో   తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మెసేజ్‌ చేసి ముగ్గురూ బస్సెక్కి అనంతపురం బయలుదేరి వెళ్లారు.  అనంతపురం బస్టాండ్‌లో బస్సు దిగి తమ వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలను వారు మింగేశారు. అప్పటికే కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలిస్తున్న  ధర్మవరం పట్టణ పోలీసులు అనంతపురం బస్టాండులో ముగ్గురు అమ్మాయిలు అపస్మారక స్థితిలో పడి ఉన్న విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.

ఈ కామర్స్‌ ద్వారా నిద్రమాత్రలు కొనుగోలు:  ఆ ముగ్గురమ్మాయిలకు అన్ని నిద్రమాత్రలు ఎలా వచ్చాయని పోలీసులు విచారించగా వాటిని ఫ్లిఫ్‌కార్టులో కొనుగోలు చేసినట్లు తెలిపారు. వాటిని ముగ్గురమ్మాయిలు ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసి, ఆత్మహత్యకు ప్లాన్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితునిపై వేధింపుల కేసు నమోదు:–ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్యాయత్నానికి కారణమైన మహేష్‌పై వేధింపుల కేసు నమోదు చేనట్లు పోలీసులు తెలిపారు.  ఈ సందర్భంగా ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌ మాట్లాడుతూ ఈ ఫేస్‌బుక్‌ వాట్సప్‌ల మాయలో పడొద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని కోరారు. 

అభినందన: కాగా ముగ్గురమ్మాయిల మిస్సింగ్‌ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ అస్రార్‌ బాషా, ఎస్సై శ్రీహర్ష, హెడ్‌కానిస్టేబుళ్లు డోనాసింగ్, శ్రీధర్‌ ఫణి, కానిస్టేబుళ్లు ప్రసాద్, శీనానాయక్, శ్రీనివాసులుల ను డీఎస్పీ అభినందించారు. వారికి రివార్డుకోసం ఎస్పీకి సిఫార్స్‌ పంపామని తెలిపారు.

మరిన్ని వార్తలు