మూడేళ్ల క్రితం ఇదే రోజున..

15 Jul, 2018 03:34 IST|Sakshi
గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట దృశ్యం (ఫైల్‌)

గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు 29 మంది బలి

అమాయకుల ప్రాణాలు తీసిన ‘షూటింగ్‌’

మండపేట: మూడేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు గోదావరి పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చి సర్కారు ప్రచార దాహంకారణంగా తొక్కిసలాటలో చిక్కుకుని 29 మంది బలయ్యారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 2015 జూలై 14న పుణ్యస్నానాల కోసం రాజమహేంద్రవరం వచ్చిన 29 మంది సీఎం చంద్రబాబు ప్రచార యావ కారణంగా మృత్యువాత పడ్డారు. 52 మంది గాయాలపాలయ్యారు. పుష్కర ఘాట్‌లో తాను నిర్వహించే పూజలను చిత్రీకరించి ప్రచారం చేసుకోవాలన్న సీఎం తాపత్రయమే అమాయకుల ప్రాణాలను బలిగొంది. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు రెండు గంటలకు పైగా ఘాట్‌లోనే ఉండిపోవడంతో రద్దీ పెరిగింది. షూటింగ్‌ పూర్తయిన అనంతరం చంద్రబాబు వెళ్లాక ఒక్కసారిగా భక్తులను వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకుని మృత్యువాత పడ్డారు. దీనిపై నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం నియమిచిన జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ నివేదిక ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయలేదు.

19 మంది గిరిజనులు జలసమాధి
ఈ ఏడాది మే 15న దేవీపట్నం మండలం మంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా వాడపల్లి మధ్య గోదావరిలో లాంచీ తిరగబడిన సంఘటనలో 19 మంది గిరిజనులు జలసమాధి అయ్యారు. పడవ ప్రయాణాలకు సంబంధించి నిబంధనల అమలులో వైఫల్యం, లాంచీ యజమాని నిర్లక్ష్యం ప్రమాదానికి కారణంగా గుర్తించారు. లాంచీ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి నాలుగు రోజులు హడావుడి చేసినా తర్వాత పరిస్థితి షరా మామూలే అయింది. 

కాలిపోయిన పర్యాటక బోటు
పాపికొండల అందాలను తిలకించేందుకు గత మే 11వ తేదీన పర్యాటకులు పడవలో వెళ్తుండగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సరంగు సమయస్ఫూర్తితో ప్రాణ నష్టం తప్పింది. షార్ట్‌ సర్కూట్‌ వల్ల ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. పర్యాటక బోటులో గ్యాస్‌ సిలిండర్, కిరోసిన్‌ తదితర నిషేధిత వస్తువులు ఉండకూడదని నిబంధనలు పేర్కొంటున్నా పాటించడం లేదు. 

నాడు కృష్ణాలో... 
సాక్షి, విజయవాడ: ప్రకాశం జిల్లా ఒంగోలు వాకర్స్‌ క్లబ్‌కు చెందిన దాదాపు 60 మంది సభ్యులు గత ఏడాది నవంబర్‌ 12న అమరావతి వెళ్లి అక్కడ దైవ దర్శనం తరువాత విజయవాడకు వచ్చారు. భవానీ ద్వీపం చూసిన తరువాత పున్నమీ ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి కృష్ణా, గోదావరి నదులు కలిసే పవిత్ర సంగమం వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చీకటి పడడంతో ఏపీ పర్యాటక శాఖకు చెందిన బోటు వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వెంచర్‌ సంస్థకు చెందిన ప్రైవేట్‌ బోటు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.300 తీసుకుని 38 మందితో బయల్దేరింది. కృష్ణా–గోదావరి నదులు కలిసే ప్రదేశం వద్దకు వచ్చే సరికి బోటు పెద్ద కుదుపునకు గురైంది. ఏం జరుగుతోందో తెలిసేలోపే ఒక వైపునకు ఒరిగిపోయింది. బోటులోని వారంతా నదిలో పడిపోయారు. ఈత వచ్చిన వారు ఈదుకుంటూ నది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడే ఉన్న జాలర్లు కొంతమందిని రక్షించారు. చివరికి 22 మంది జలసమాధి అయ్యారు. 

మరిన్ని వార్తలు