ముగ్గురు యువకుల దుర్మరణం

20 Mar, 2014 00:46 IST|Sakshi

కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ :
 కాకినాడ బీచ్ రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
 
  పిఠాపురానికి చెందిన దుర్గ(19), కాండ్రకోట కల్యాణ్‌కుమార్(18) బుధవారం స్థానిక రాజేంద్రనగర్‌లోని స్నేహితుడు సవరపు దిలీప్(18) ఇంటికి వచ్చారు. ముగ్గురూ కలిసి మధ్యాహ్నం మోపెడ్‌పై బీచ్‌కు వెళ్లారు. బీచ్ రోడ్డులో షికారు చేశారు. కాగా పోర్టులో సరకు అన్‌లోడ్ చేసిన కంటైనర్ ట్రాలర్ బీచ్ రోడ్డు మీదుగా వాకలపూడి లైట్‌హౌస్ వైపు వెళుతోంది. ఆ ట్రాలర్‌ను తప్పించి ముందుకు వెళ్లే క్రమంలో మోపెడ్ వేగాన్ని పెంచారు.
 
 కోరమండల్ ఎరువుల కర్మాగారం సమీపంలో మోపెడ్ అదుపుతప్పి, దానిపై ఉన్న దుర్గ, కల్యాణ్ కుమార్, దిలీప్ ట్రాలర్ కింద పడ్డారు. దుర్గ, దిలీప్ తలలపై నుంచి ట్రాలర్ చక్రాలు ఎక్కడంతో అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలపాలైన కల్యాణ్ కుమార్‌ను స్థానికులు 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 
  అప్పటికే అతడు చనిపోయినట్టు అత్యవసర విభాగ వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న సర్పవరం ఎస్సైలు డి.ప్రశాంత్ కుమార్, సురేష్ చావా తమ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శవపంచనామా నిర్వహించి మృతదేహాలను జీజీహెచ్ మార్చురీకి తరలించారు.
 
 హృదయవిదారకంగా సంఘటన స్థలం
 కంటైనర్ ట్రాలర్ కింద పడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించడంతో సంఘటన స్థలం హృదయ విదారకంగా కనిపించింది. రక్తపు మడుగులో దుర్గ, దిలీప్ మృతదేహాలు పడి ఉండగా, వారి తలలు ఛిద్రమై భయానకంగా కనిపించా యి. యువకులు అతివేగంగా నాలుగైదు సార్లు బీచ్ రోడ్డులో చక్కర్లు కొట్టారని స్థానికులు చెబుతున్నారు. ట్రాలర్‌ను తప్పించబోయి వారి మోపెడ్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగిందంటున్నారు.
 
 మిన్నంటిన రోదనలు
 ముగ్గురు యువకులు ఒకే ప్రమాదంలో చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని రోదించిన తీరు చూపరులను కలచివేసిం ది. కాగా కల్యాణ్ కుమార్ కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు చేరుకుని గుండెలు బాదుకుంటూ రోదించారు. మృతదేహాలు రోడ్డు మధ్యలో పడి ఉండడంతో మూడు గంటల పాటు  బీచ్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది.

మరిన్ని వార్తలు