ఇక యుద్ధమే

21 Dec, 2013 04:07 IST|Sakshi

 =రాళ్లు రువ్వితే కాల్పులకు ఆదేశం
 =కూంబింగ్ పార్టీకి సూచనలిచ్చిన ఎస్పీ

 
 సాక్షి, తిరుపతి : ఎర్రదొంగలపై యుద్ధం చేయడానికి పోలీస్ యంత్రాంగం సన్నద్ధమైంది. దాదాపు 500 మంది పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది కూంబింగ్ నిర్వహించేందుకు శుక్రవారం శేషాచలం అడవులకు బయల్దేరి వెళ్లారు. రాత్రి అటవీ శాఖ కార్యాలయంలో తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు, అదనపు ఎస్పీ ఉమామహేశ్వర శర్మ, సీఎఫ్‌వో రవికుమార్‌లు కూంబింగ్ పార్టీకి సూచనలిచ్చారు. ఆ సమయంలో మీడియాను అనుమతించలేదు.

విశ్వసనీయ సమాచారం మేరకు.. వీలైనంత వరకు ఎర్ర కూలీలను అరెస్టుచేసే ప్రయత్నం చేయాలని, రాళ్లు విసిరిన పక్షంలో కాల్పులు జరిపేందుకూ వెనుకాడవద్దని ఆదేశించినట్టు తెలిసింది. కూలీలు ఎక్కడెక్కడ ఉంటారు, వారి జాడలు ఏ విధంగా తెలుసుకోవాలి.. అనే అంశాలపై ఎస్పీ వీరికి వివరించారు. సాయుధ పోలీసులు తిరుపతి అర్బన్, కడప, చిత్తూరుల నుంచి కూంబింగ్‌కు వచ్చారు. చట్టపరిధిలో చేయాల్సింది చేయాలని ఎస్పీ సూచించినట్లు తెలిసింది.  ఎస్పీ రాజశేఖర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు 342 మంది ఎర్రకూలీలను అరెస్టు చేశాం. దీని వెనుక ఉన్న పెద్దలను అరెస్టు చేస్తాం... మా వద్ద కొన్ని పేర్లు ఉన్నాయి.

కూలీలను పంపిస్తున్న మేస్త్రీలు, స్మగ్లర్లు, కింగ్‌పిన్‌లనూ వదిలేది లేదురూ. అని అన్నారు. దీని వెనుక ఎవరు ఆర్థికంగా ఆదుకుంటున్నారనే విషయాలపైనా ఆరా తీస్తున్నామని చెప్పారు. మార్గాలను చూపించే వారిని, వాహనాలను సరఫరా చేసే వారిపైనా దృష్టి పెడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులను హత్య చేయడం చిన్న విషయం కాదని అన్నారు. అటవీ సంపదను రక్షించడం అటవీ శాఖ బాధ్యత అని, అటవీ సిబ్బందిని ఆదుకోవడం తమ బాధ్యతని తెలిపారు. ఎర్రకూలీలకు ష్యూరిటీ ఇచ్చే వారిపైనా దృష్టి సారిస్తున్నామన్నారు.

తమిళనాడులోని తిరునల్వేలి, వేలూరు జిల్లాలకు చెందిన ఎస్పీలతోనూ మాట్లాడుతున్నామని తెలిపారు. అక్కడ నుంచి కూలీలు రాకుండా ఉండేలా, అక్కడి వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉందని అన్నారు. అయితే ముందుగా ఈ జిల్లా వారికీ దీనిపై అవగాహన ఉండాలని సూచించారు. ఎర్రకూలీలు సిబ్బందిపై రాళ్ల దాడి చేస్తే కాల్పులు జరపడానికి అనుమతిచ్చినట్టు వెల్లడించారు.
 
మరో మూడు నెలల్లో ఎర్రదొంగలు లేకుండా చేస్తాం : రవికుమార్
 శేషాచలం అడవుల్లో ఎర్ర దొంగలను మరో మూడు నెలల్లో పూర్తిగా లేకుండా చేస్తామని కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రవి కుమార్ అన్నారు. ఆయన ఁసాక్షిరూ.తో మాట్లాడుతూ జనవరి ఒకటో తేదీ నుంచి అటవీ సిబ్బందికి ఫైరింగ్ శిక్షణ ఇస్తామని, ప్రస్తుతానికి పోలీసుల నుంచి ఆయుధాలను తీసుకుంటున్నామని, త్వరలోనే అటవీ సిబ్బందికి వాటిని అందజేస్తామని ఆయన వివరించారు.
 

మరిన్ని వార్తలు