రోడ్డున పడేశారు

31 Aug, 2013 03:34 IST|Sakshi

 పాలమూరు, న్యూస్‌లైన్: సర్కారు తీసుకుంటున్న అనిశ్చిత నిర్ణయం వల్ల హెల్త్ అసిస్టెంట్ కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డున పడాల్సి వచ్చింది. ఒక్కోసారి మూడు నాలుగు నెలల పాటు వేతనాలు రాకపోయినా ప్రభుత్వ సర్వీసులో ఉన్నామనే బాధ్యతతో వారు పదేళ్లపాటు వివిధ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఇంత చేసినా ప్రభుత్వం ఒక్క నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 1200మందిని రోడ్డున పడేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 31 మంది ఉద్యోగావకాన్ని కోల్పోయి దీనావస్థకు చేరుకున్నారు. వయస్సు మీదపడి, వేరే ఉద్యోగాలకు అర్హత కోల్పోయి, కుటుంబ పోషణ భారమైన తమను విధుల్లోకి తీసుకోవాలంటూ గతేడాది జూలై 12 నుంచి హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. శనివారం నాటికి వారి దీక్షలు 415 రోజుకు చేరింది.
 
 రీ-రిక్రూట్‌మెంట్ ద్వారా తొలగించిన వారిని తిరిగి కాంట్రాక్టు విధుల్లోకి తీసుకోవచ్చంటూ మంత్రుల బృందం గత మే 1న ప్రభుత్వానికి సిఫారుసు చేసింది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఆమోదించారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా సిబ్బందిని విధుల్లోకి తీసుకునే జీఓ ముసాయిదాను తయారు చేసి ఆర్థిక శాఖ అనుమతి కోసం ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ వద్దకు పంపిస్తే, అక్కడి నుంచి ఎలాంటి ఆమోదం తెలపకుండా ఫైలును తిరిగి పంపించారు. దీంతో 1200 మంది ఉద్యోగావకాశాలు కోల్పోయారు.
 
 ఇదీ కాంట్రాక్టు సిబ్బంది దుస్థితి
 వైద్య ఆరోగ్య శాఖలో 2002 నుంచి హెల్త్ అసిస్టెంట్ పోస్టులు అధిక సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం 5,444 రెగ్యులర్ పోస్టులను మంజూరు చేసింది. కానీ 2002లో 2,324 హెల్త్ అసిస్టెంట్ (పురుష) పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆమేరకు కలెక్టర్లు, డీఎంహెచ్‌ఓల ఆధ్వర్యంలో జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)లు రాత పరీక్ష నిర్వహించాయి.
 
 పదోతరగతితో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) డిప్లొమా చేసిన వారు, ఇంటర్‌తో ఎంపీహెచ్‌డబ్ల్యూ డిప్లొమా చేసిన వారు ఈ రాత పరీక్షకు హాజరయ్యారు. అయితే ఇంటర్‌తో ఎంపీహెచ్‌డబ్ల్యూ చేసిన వారినే మెరిట్ ప్రకారం 2,324 పోస్టులను భర్తీ చేశాయి. దీంతో పదోతరగతి డిప్లొమా హోల్డర్లు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 2006లో ఎస్సెస్సీతో డిప్లొమా చేసిన వారితో 1,781 కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేశారు. ఇలా రెండుసార్లు కలిపి మొత్తం 4,105 మందిని భర్తీ అయ్యారు. కానీ వివిధ కారణాల వల్ల వీరిలో 3,868 మంది మాత్రమే విధులు నిర్వహిస్తూ వచ్చారు. వివిధ శాఖల్లోని కాంట్రాక్టు పోస్టులను రెగ్యులరైజ్ చేసే ఉద్దేశంతో అధ్యయనం కోసం ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో తమ పోస్టులు రెగ్యులర్ కాకపోవచ్చన్న ఉద్దేశంతో 10వ తరగతితో డిప్లొమా చేసిన హెల్త్  అసిస్టెంట్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో జారీచేసిన హైకోర్టు ఉత్తర్వులను పాటిస్తూ రీ-ఫ్రెష్ రిక్రూట్‌మెంట్ చేపట్టాలంటూ కోర్టు ఆదేశించింది.
 
 ఆ మేరకు వైద్య ఆరోగ్య శాఖ 16.2.2012న జీఓ 273ను జారీ చేస్తూ కాంట్రాక్టు సిబ్బందితో కొత్తగా ఎంపిక ప్రక్రియను చేపట్టింది. పదోతరగతి, ఇంటర్‌లతో డిప్లొమా చేసిన వారందరినీ క్లబ్ చేసి మెరిట్ ప్రకారం మొత్తం 2,324 పోస్టులను భర్తీ చేసింది. ఇవి పోనూ 1544 పోస్టులు మిగిలాయి.
 
 కొంతమంది పైరవీలు చేసుకుని ఉద్యోగం తెచ్చుకోవడంతో 2,560 పోస్టులను భర్తీ చేసినట్లయింది. పైరవీలతో ఉద్యోగాలు పొందినవారు ఎక్కువగా చిత్తూరు జిల్లాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన పోస్టుల్లో పనిచేసిన కాంట్రాక్టు సిబ్బందిలో కొందరు ఇతర ఉద్యోగాల్లో చేర డంతో ప్రస్తుతం ఉన్న 1200 మందిని ప్రభుత్వం టర్మినేట్ చేయడంతో వారు రోడ్డున పడ్డారు.

మరిన్ని వార్తలు