చంద్రబాబు, లోకేష్‌ల కుట్రే

4 Mar, 2019 03:31 IST|Sakshi
మాట్లాడుతున్న లోకేశ్వరరెడ్డి

ఓట్ల తొలిగింపుపై వాస్ట్‌ సంస్థ ప్రతినిధి తుమ్మల లోకేశ్వరరెడ్డి

దీనిపై ఫిర్యాదు చేసినందుకు ఏపీ పోలీసులు తన ఇంటికొచ్చి దౌర్జన్యం చేశారంటూ ఆవేదన

చంద్రబాబు, లోకేశ్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు 

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ ఓట్ల నమోదు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు వెనుక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి లోకేష్‌ హస్తముందని, వారి కుట్రతోనే ఇదంతా జరుగుతోందని ’ఓటర్‌ అనలటిక్స్‌ అండ్‌ స్ట్రాటజీ టీమ్‌ (వాస్ట్‌) సంస్థ ప్రతినిధి తుమ్మల లోకేశ్వరరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీ నుంచి వచ్చిన పోలీసులమంటూ కొందరు ఆదివారం తన ఇంట్లోకి వెళ్లి దౌర్జన్యం చేసిన నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని లోకేశ్వరరెడ్డి హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌  వీసీ సజ్జన్నార్‌కు ఫిర్యాదు చేశారు. తమ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసిన వారు గుంటూరు జిల్లాలో డీఎస్పీగా పనిచేస్తున్న కులశేఖర్‌తోపాటు మరో ఇద్దరు పోలీసులుగా తేలిందని లోకేశ్వరరెడ్డి కమిషనర్‌కు తెలియజేశారు. అనంతరం లోకేశ్వరరెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే... ‘ఈ రోజు ఉదయం కొంతమంది మా ఇల్లున్న కాలనీకి వచ్చి సెక్యూరిటీని బలవంతంగా తోసేసి నా ఇంటికి వచ్చి డోర్లు కొట్టారు. మా కుటుంబ సభ్యులు ఎవరు మీరు అని అడుగుతుండగానే అసభ్యంగా మాట్లాడుతూ ఎవడు వాడు ఎందుకు చేస్తున్నాడంటూ నన్ను దూషించడం ప్రారంభించారు.

ఈరోజు వాడిని తీసుకువెళ్తామంటూ అసభ్యంగా మాట్లాడారు. వెంటనే నేను మా ఫ్రెండ్స్‌కు తెలియచేయడంతో పాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చా. స్థానిక పోలీసులు వస్తున్నారని తెలియగానే వారు వెళ్లిపోయారు. ఏపీ నుంచి వచ్చిన పోలీసులు దాదాపు ముప్పావుగంట సేపు మా ఇంటిలో దౌర్జన్యం సృష్టించి  చాలా అసభ్యంగా దూషించారు. ఏపీ సీఎం చంద్రబాబు లోకేష్‌లే దీని వెనుక ఉన్నారు. ఒక ప్రవేటు సంస్థకు ఆంధ్రాలో నివసిస్తున్న ప్రజల డేటాను ఎలా ఇస్తారు.  ప్రభుత్వానికి బాధ్యత లేదా? లబ్ధిదారులు ఎవరు? వారికి ఏమేమి ఇచ్చాం. వారి అకౌంట్‌ నెంబర్లు ఏమిటి? వారి వ్యక్తిగత వివరాలు సహా సమాచారం అంతా ఈ ప్రయివేటు కంపెనీకి అప్పగించారు. ఓటర్లను మీ జాతి ఏమిటి? మీ మతం ఏమిటి? మాకు ఓటు వేయకపోతే మీ ఓట్లను తొలగిస్తాం అంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ తొలగింపు వ్యవహారం, నకిలీ ఓట్ల నమోదు వ్యవహారం ఒకటిన్నర సంవత్సరం నుంచి జరుగుతోంది’ అని చెప్పారు. కాగా, రాష్ట్రంలో బోగస్‌ ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని వాటిని పరిశీలించాలని ఏడాదిన్నర క్రితం తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ ఒక టీమును వేశారని.. ఆ టీములో లోకేశ్వరరెడ్డితో పాటు  పలువురు ముఖ్యులు పనిచేశారని పొన్నవోలు తెలిపారు. ‘రాష్ట్రంలో 52 లక్షలకు పైగా ఓట్లు నకిలీవి ఉన్నాయని నవంబర్‌లోనే మేము హైకోర్టులో పిల్‌ వేశాం.  ఈనెల 20వ తేదీన హైకోర్టు ప్రతి 15 రోజులకు బోగస్‌ ఓట్లు ఎన్ని తీసేశారో నివేదించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో ఏం చేయాలో పాలుపోక చంద్రబాబు ఇష్టానుసారం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌ చేస్తున్న దుర్మార్గమైన పని ఇది’ అన్నారు.

మరిన్ని వార్తలు