తిరుమల ఘాట్‌లో కూలిన బండరాళ్లు

31 May, 2017 01:40 IST|Sakshi
తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కూలిన బండరాళ్లను తొలగిస్తున్న జేసీబీ
తప్పిన పెనుప్రమాదం.. ప్రయాణికులు క్షేమం
 
సాక్షి, తిరుమల: తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో మంగళవారం బండరాళ్లు కూలాయి. రాళ్లు పడుతున్న సమయంలో వాహనదారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌రోడ్డులోని 7 నుంచి 16వ కిలోమీటరు వరకు అప్పుడప్పుడు బండరాళ్లు కూలుతుంటాయి.  మంగళ వారం ఉదయం 10 గంటలకు ఈ మార్గంలోని 9.4 కిలోమీటరు వద్ద సుమారు వంద అడుగుల ఎత్తునుంచి భారీ స్థాయిలో నాలుగు రాళ్లు కూలాయి.

బండరాళ్ల వేగానికి రోడ్డుపక్కన ఏర్పాటు చేసిన ఇనుప క్రాష్‌గ్రిల్స్‌ కూడా రెండు ముక్కలయ్యాయి. ఇదే సమయంలో అటుగా వస్తున్న వాహనదారులు రాళ్లు కూలడం గమనించి ఎక్కడి వాహనాలు అక్కడే ఆపేశారు. వాహనాల్లోని ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. సమాచారం అందుకున్న ఘాట్‌రోడ్డు డిప్యూటీ ఈఈ సురేంద్రరెడ్డి ఘటన స్థలానికి చేరుకుని, జేసీబీ ద్వారా కూలిన బండరాళ్లు తొలగించారు. తిరుమల ఘాట్‌రోడ్లలో కూలడానికి సిద్ధంగా ఉన్న బండరాళ్లను తొలగించాలన్న నిపుణుల సూచనలు పట్టించుకోకపోవడం వల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెపుతున్నారు.  

 

మరిన్ని వార్తలు