తీరంలో అలకలం..!

25 Apr, 2018 13:04 IST|Sakshi
ఉప్పాడ తీరప్రాంతంలో ఎగసిపడుతున్న కెరటాలు

పిఠాపురం : పిఠాపురం సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరంలో కడలి కెరటాలు ఉగ్రరూపం దాల్చాయి. ఎగసిపడుతున్న కెరటాల తాకిడికి తీరప్రాంతం అతలాకుతలమవుతోంది. తీరప్రాంత వెంబడి రక్షణగా నిర్మించిన రక్షణ గోడ తునాతునకలవుతోంది. మంగళవారం ఉదయం నుంచి సముద్రం వెనక్కి వెళ్లిపోగా సాయంత్రానికి ఒక్కసారిగా సుమారు 20 మీటర్ల మేర ముందుకు చొచ్చుకుని వచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. 

మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో అలల ఉధృతి మరింత పెరిగింది. తీరప్రాంతం వెంబడి ఉప్పాడ నుంచి కాకినాడ శివారు వాకలపూడి వరకు ఉన్న బీచ్‌రోడ్డు తీవ్ర కోతకు గురవుతోంది. బుధవారం ఉదయానికి రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యే సూచçనలు కనిపిస్తున్నాయి. తీరప్రాంతంలో లంగరు వేసిన బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకునే పనిలో మత్స్యకారులు నిమగ్నమయ్యారు.

పిడుగు హెచ్చరికలు

భారీ వర్షంతోపాటు జిల్లాలో పిడుగులు పడే అవకాశాలున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో మారేడుమిల్లి, పిఠాపురం, ఉప్పాడ, ప్రత్తిపాడు, శంఖవరం, రామచంద్రాపురం, కాకినాడ, రౌతులపూడి తదితర మండలాల పరిధిలో మంగళవారం పిడుగులు పడే అవకాశాలున్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి.

టోర్నడోను తలపించిన ఈదురు గాలులు 

కాకినాడ రూరల్‌: సముద్ర తీరం వెంబడి వీచిన బలమైన ఈదురుగాలులు మంగళవారం సాయంత్రం సూర్యారావుపేట వాసులను భయకంపితులను చేశాయి. టోర్నడో తరహాలో ఆకస్మాత్తుగా వీచిన బలమైన గాలులతో ఈ ప్రాంతంలోని పూరిళ్లు, తోపుడు, మిక్చర్‌బళ్లు, చిన్న, చిన్న నావలు ఎగిరి పడ్డాయి. మత్స్యకారులు, ఇతర పర్యాటకులు పరుగులు తీసినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పూరిపాకలు సైతం గాలిలో ఎగిరిపడ్డాయి. ఏ జరుగుతుందో అర్థం కాక మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాత్రి అంతా మేల్కొని ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు అక్కడి పెద్దలు తెలిపారు.  

మరిన్ని వార్తలు