పిడుగుల పగ

5 Jun, 2018 13:01 IST|Sakshi

అనకాపల్లి టి.వెంకుపాలెంలో    చెట్టు కింద ఉన్న ఇద్దరు    విద్యార్థులు దుర్మరణం     చోడవరం మండలం    గోవాడలో మరో    యువకుడి మృతి నేడు, రేపు కూడా    పిడుగులు    పడే అవకాశం

చోడవరం/కశింకోట/తుమ్మపాల: విశాఖ జిల్లాపై పిడుగులు పగబట్టాయి. తరచూ ఎక్కడో చోట పిడుగులు పడుతూ జనాన్ని పొట్టనబెట్టుకుంటున్నాయి. గడచిన కొన్నేళ్లతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో పిడుగుపాట్ల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. సోమవారం అనకాపల్లి, చోడవరం మండలాల్లో పిడుగులు పడి ఒక చిన్నారి, ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి మండలం టి.వెంకుపాలెంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న పోలిన హేమంత్‌కుమార్‌ (19), నిడిశెట్టి పవన్‌కుమార్‌ (18)లు క్రికెట్‌ ఆడుకుంటూ వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్లి తలదాచుకున్నారు. ఆ చెట్టుపై పిడుగుపడడంతో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. చోడవరం మండలం గోవాడలో సుంకర శ్రీను (19) అనే మరో యువకుడు పిడుగుపడి మరణించాడు. ప్రైవేటు కంపెనీ లో పనిచేస్తున్న శ్రీనుకు సోమవారం వారాంతపు సెలవు కావడంతో పొలంలో పశువులు మేపడానికి వెళ్లాడు. అక్కడ వర్షం కురుస్తుందని చెట్టు కింద నిలబడగా పిడుగుపడి చనిపోయాడు. 

విస్సన్నపేటలో విషాదఛాయలు
పిడుగు ఇద్దరు విద్యార్థులను బలిగొంది. దీంతో మండలంలోని విసన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒకే గ్రామానికి చెందిన వీరు ఒకేసారి అనంతలోకాల్లో కలిసిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. విసన్నపేటకు చెందిన  నడిశెట్టి పవన్‌కుమార్‌ (18), పోలిన హేమంత్‌ (16)లతోపాటు పక్కనున్న రామాపురం, జంగాలపాలెం గ్రామాలకు చెందిన సుమారు 20 మంది యువకులు సోమవారం సాయంత్రం  క్రికెట్‌ ఆడటానికి తమ్మయ్యపేట గ్రామ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కొందరు యువకులు ఆట ఆడుతుండగా వర్షం పడుతుండటంతో చెట్టు కింద నీడ కోసం పవన్‌కుమార్, హేమంత్‌ నిలుచున్నారు. ఇదే సమయంలో ఉరుములతో ఒక్కసారిగా  పిడుగు పడింది. దీంతో వారు  దాని దాటికి అక్కడే కుప్ప కూలిపోయి మృత్యువాత పడ్డారు. దీంతో సహాచర యువకులు చూసి ఒక్కసారిగా హతాశులయ్యారు. వీరిలో పవన్‌కుమార్‌ తండ్రి విశ్రాంత ఆర్మీ ఉద్యోగి. తల్లి కోటి లక్ష్మి. వీరికి ఇద్దరు మగ సంతానం. పవన్‌కుమార్‌ వారికి రెండో కుమారుడు. అనకాపల్లిలోని కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. క్రికెట్‌ అంటే అభిమానం. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో   ఖాళీ సమయంలో ఆటలాడుతుంటాడు. ఎప్పటిలాగు మిత్రులతోపాటు ఆటకు వెళ్లి పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డాడు.  అంది వచ్చిన కుమారుడు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు దు:ఖ సాగరంలో మునిగిపోయారు.

హేమంత్‌ ఒకడే కుమారుడు...
పోలిన జగ్గారావు, పద్మ దంపతులకు హేమంత్‌ ఒక్కడే మగ సంతానం. అనకాపల్లిలోని కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు.తన కుటుంబాన్ని ఆదుకోవలసిన ఒక్కగానొక్క కుమారుడు క్రికెట్‌ ఆడటానికి వెళ్లి  పిడుగుపాటుకు  మృతి చెందడం కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ఇక తమకు దిక్కు ఎవరంటూ జగ్గారావు దంపతులు రోధిస్తున్నారు. వీరిద్దరి మృతితో గ్రామంలో విషాదం అలముకుంది.

పొలంలో పశువులు కాస్తుండగా..
చోడవరం: పిడుగు రూపంలో మృత్యువు ఓ యువకుడ్ని బలి తీసుకుంది. దీనితో ఒక్కసారిగా గోవాడలో తీవ్ర విషాదం అలముకుంది. ఒక పక్క ఎండ మండిపోతుండగా అంతలోనే ఆకాశం కారుమబ్బులు కమ్ముకొని ఉరుములు మెరుపులతో జనాన్ని బెంబేలెత్తించింది. క్షణాల్లోనే వర్షం కురవడంతో పొలం పనుల్లో ఉన్న వారంతా సమీపంలో పాకలు వద్దకు పరుగులు తీశారు. ఇదే సమయంలో తమ పొలం పక్కనే ఉన్న కొండ సమీపంలో పశువులను మేపుతున్న సుంకర శ్రీను (19) సమీపంలో ఉన్న చెట్టు వద్దకు పరుగు తీశాడు. ఆ చెట్టు తనను తడవకుండా నీడనిస్తుందనుకుంటే అదే మృత్యువుగా మారి ప్రాణం తీసింది. ఉరుము మెరుపులతో ఒక్కసారిగా శ్రీను నిలుచున్న తాడిచెట్టుపై పిడుగు పడింది. ఆ పిడుగు షాక్‌కి తాడిచెట్టుతోపాటు దిగువ చెట్లు కూడా కాలిపోయాయి.

దీనితో ఆ చెట్టుకిందే ఉన్న శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు శ్రీనుది సొంత ఊరు బుచ్చెయ్యపేట కాగా చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో గోవాడలో ఉంటున్న తన పెద్దమ్మ నక్కా కన్నమ్మ దగ్గరే ఉంటున్నాడు. ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్న శ్రీను ఇటీవల ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. సెలవు రోజుల్లో పొలంలో పశువులను మేపుతూ పొలం పనులు చూసుకుంటున్నాడు. రోజూలాగే సోమవారం కూడా పశువులను పొలంలో మేపుతుండగా ఆకస్మికంగా పిడుగు పడి మృతి చెందాడు. తన చెల్లెలు కొడుకైనా కన్నకొడుకు కంటే ఎక్కువగా చిన్నప్పటి నుంచీ పెచ్చుకొచ్చిన పెద్దమ్మ నక్కా కన్నమ్మ గుండెలవెసేలా రోదించింది. పరుగుపరుగున ప్రమాద స్థలానికి చేరింది. అప్పటికే కాలిన గాయాలతో విగత జీవిగా పడిఉన్న కొడుకుని చూసి ఆ పెద్ద తల్లి గుండెలు బాదుకొని ఏడ్చింది. 

మరిన్ని వార్తలు