ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లకు టికెట్ల జారీ ఉండదు

3 May, 2020 03:48 IST|Sakshi

వలస కూలీల తరలింపునకు జిల్లాకు ఒక రైల్వే స్టేషన్‌ ఎంపిక

కూలీలను స్టేషన్లకు చేర్చే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే

తరలించాల్సిన వారి సమాచారంపై రెండ్రోజుల్లో స్పష్టత

ఆ తర్వాతే తరలింపు ప్రక్రియ ప్రారంభం

సాక్షి, అమరావతి: ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లకు టికెట్ల జారీ ఉండదని రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. ఎంతమంది ఇతర రాష్ట్రాలకు వెళతారు? అక్కడ ఎంత మందిని తీసుకురావాలి? అనే సమాచారం తీసుకోవడానికి విజయవాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నంబర్లు 1902, 0866–2424680 ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.

రాష్ట్రం నుంచి ఎంతమందిని పంపించాలి, ఇతర రాష్ట్రాల నుంచి ఎంతమందిని వెనక్కి తీసుకురావాలనే అంశాలపై రెండ్రోజుల్లో ప్రభుత్వానికి స్పష్టత రానుంది. ఎన్ని రైళ్లు అవసరమవుతాయనే దానిపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో విజయవాడ, గుంతకల్, గుంటూరు డివిజన్ల రైల్వే మేనేజర్లు చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు ఇప్పటికి ఐదు రైళ్లను ఏపీకి కేటాయించినట్లు రైల్వే శాఖ తెలిపింది. అవసరమైతే మరిన్ని రైళ్లు అందుబాటులో ఉంచుతామని రైల్వే వర్గాలు తెలిపాయి. వలస కూలీలపై సమగ్ర వివరాలు సేకరించిన తర్వాత తరలింపు ప్రక్రియ ప్రారంభించనున్నారు. 

► వలస కూలీలను రైల్వే స్టేషన్లకు తరలించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ అధికారులే చేపట్టనున్నారు. 
► వలస కూలీల సమాచారం రాష్ట్ర ప్రభుత్వమే రైల్వేకు అందిస్తుంది.
► ఒక్కో జిల్లాలో ఒక్కో రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసి అక్కడి నుంచే వలస కూలీలను తరలించాలి.
► ఇతర రాష్ట్రాల్లో ఉన్న యాత్రికులు, విద్యార్థులు, వలస కూలీలు, కార్మికులను తీసుకొచ్చే విధానంపై పాలసీ రూపకల్పనకు కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం సంప్రదించనుంది.
► మే 17 వరకు ప్యాసింజర్‌ రైళ్లను నడపబోమని రైల్వే శాఖ తేల్చి చెప్పింది. రైల్వే స్టేషన్లకు ఎవ్వరూ రావద్దని ప్రయాణికుల్ని కోరింది.  

>
మరిన్ని వార్తలు