వెనామీకి ‘వైరస్’

18 Oct, 2013 03:48 IST|Sakshi

చిట్టమూరు, న్యూస్‌లైన్ : టైగర్ రొయ్యల సాగుతో ఆక్వా రైతులను కుదేలు చేసిన ‘వైట్‌స్పాట్’, ‘విబ్రియో’ తాజాగా వెనామీని వెన్నాడుతున్నాయి. రోగ నిరోధక శక్తి అత్యధికంగా ఉండే విదేశీ పంట వెనామీ రాకతో జిల్లాలో ఆక్వా రైతులు కొద్దిగా కుదుటపడ్డారు. కొద్ది రోజుల క్రితం వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ అంతంత మాత్రంగా ఉండటంతో పెద్ద లాభ, నష్టాలు లేకుండా వెనామీ సాగును కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో వెనామీ రొయ్యలకు మంచి డిమాండ్ ఏర్పడటంతో ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఆక్వా రైతులు ఆనంద పడ్డారు.
 
 ఇన్నాళ్ల నష్టాలను ఒక్కసారిగా పూడ్చుకోవచ్చన్న రైతుల ఆశలను హేచరీలు సొమ్ము చేసుకుని, వారిని నట్టేట ముంచుతున్నాయి. నాణ్యత లేని రొయ్యల పిల్లలను హేచరీలు రైతులకు అంటకడుతుండటంతో వెనామీకి ‘వైట్‌స్పాట్’, ‘విబ్రియో’ వంటి వైరస్‌లు సోకి నెల రోజుల వ్యవధిలోనే వేలాది ఎకరాల్లో గుంతలు ఖాళీ అవుతున్నాయి.  మండలంలో మల్లాం, రాఘవవారిపాళెం, ఆరూరు, ఈశ్వరవాక, పిట్టివానిపల్లి, కొక్కుపాళెం, కొత్తగుంట, పల్లంపర్తి, ఎల్లూరు తదితర గ్రామాల్లో వేల ఎకరాల్లో వెనామీ రొయ్యలు సాగు చేస్తున్నారు. అయితే హేచరీల అత్యాశ రొయ్యల రైతులను నిలువున ముంచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెనామీకి మంచి డిమాండ్ ఉండటంతో జిల్లాలో వేలాది ఎకరాల్లో సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. దీంతో హేచరీల్లో డిమాండ్ తగ్గట్టు సీడ్ అందుబాటులో లేకపోవడంతో హేచరీలు కృత్రిమ చర్యలతో నాసిరకమైన సీడ్ తయారు చేసి రైతులకు అందజేస్తున్నారు. పంట దిగుబడి బాగుండాలని రైతులు ఎప్పటికప్పుడు సెలినిటీ, పీహెచ్ టెస్ట్‌లు చేయిస్తుంటారు. ఈ నేపథ్యంలో టెక్నీషీయన్లు రొయ్యల రసాయనాలు వ్యాపారులతో కుమ్మక్కై రసాయన మందులు వాడకాన్ని సూచిస్తున్నారు.
 
 దీంతో రైతులు వారు సూచిస్తున్న రసాయనాలను విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇలా నెల రోజుల వరకు పిల్లల ఎదుగుదల బావున్నప్పటికీ ఆ తర్వాత రొయ్య తలపై తెల్లటి మచ్చలు (వైట్‌స్పాట్) ఏర్పడి మృతి చెందుతున్నాయి. మరికొన్ని గుంతల్లో విబ్రియో సోకి రొయ్యలు ఎర్రగా మారి చనిపోతున్నట్లు రైతులు లబోదిబో మంటున్నారు. వైరస్ గాలి ద్వారా అన్ని ప్రదేశాలకు వ్యాప్తి చెందటంతో రోజుల వ్యవధిలో మిగతా గుం తలకు త్వరితగతిన  వ్యాప్తి చెంది రొ య్యలు చనిపోతున్నాయి. రొయ్యలు బాగా వచ్చిన సమయంలో రేట్లు లేక, రేట్లు ఉన్న సమయంలో రోగాలతో ఆక్వా రైతులు ఆర్థికంగా చితికి పోతున్నారు.  
 
 లోకల్ సీడ్‌తోనే వైరస్ వ్యాప్తి
 వెనామీ విదేశీ సీడ్. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటే ఈ సీడ్ కొన్నేళ్ల క్రితం ఇక్కడకు దిగుమతి అయింది. రొయ్య పిల్లలు తయారు చేసే హేచరీలు విదేశాల నుంచి స్పెసిఫిక్ ఫాతోజెన్ ఫ్రీ బ్రూడర్స్ (ఎస్‌పీఎఫ్)ను దిగుమతి చేసుకుని తల్లి రొయ్యలను తండ్రి రొయ్యలతో జీన్స్ మార్పిడితో ఉత్పత్తి చేసిన పిల్లలను బ్రూడర్స్‌లో పెంచి అందుకు అనువైన సెలినిటీలో రైతులకు  అందజేయాల్సి ఉంది.
 
 అయితే ఇలా చేయాలంటే వ్యయభారం అధికంగా ఉండటంతో హేచరీలు ఈ విధానాలకు నీళ్లొదులుతున్నాయి. జిల్లాలోని హేచరీలు స్థానికంగా సాగుచేస్తున్న గుంతల్లోని తల్లి రొయ్యలను సేకరించి వాటి ద్వారా సీడ్ ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లాలో టైగర్ రొయ్యకు సోకిన వైట్‌స్పాట్ అవశేషాలు ఇంకా గుంతల్లో ఉండటం, నాసిరకంగా సీడ్ వల్ల వెనామీకి వైట్‌స్పాట్ సోకుతున్నట్లు టెక్నిషియన్లు చెబుతున్నారు.
 
 నిస్సారంగా మారుతున్న గుంతలు
 రొయ్యల కోసం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాల మూలంగా భూసారం తగ్గి భూములు నిస్సారంగా తయారవుతున్నాయి. భూమి పొరల్లో ఉండే సహజ ఖనిజ, సారాలు తగ్గిపోవడంతో భవిష్యత్‌లో రొయ్యల సాగుకు కూడా పనికి రాని విధంగా మారుతున్నాయి. కనీసం భవిష్యత్‌తో వరి, ఇతర పంటల సాగు చేసేందుకు ఉపయోగపడని విధంగా నిస్సారంగా భూమి తయారవుతుంది.
 
 ఆత్మహత్యలకు
 దారితీస్తున్న పరిస్థితులు
 రొయ్యల రేటు చూసి గుంతలు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్న రైతులకు జిల్లాలోని హేచరీల మోసంతో మళ్లీ ఆక్వా రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి అనివార్యమవుతోంది. రొయ్యలు సాగులో అనుసరించాల్సిన మెళుకువలను ఎంపెడా అధికారులు  రైతులకు నేర్పి, వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉండగా అవేమి పట్టనట్లు వ్యవహరించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ేహ చరీలపై దాడులు నిర్వహించి నాసిరక రొయ్య పిల్లల్ని రైతులకు అంటకడుతున్నా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఎంపెడా అధికారులు ఆక్వా రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టేందుకు పటిష్టమైన ప్రణాళికమైన చర్యలు చేపట్టాల్సి ఉంది.
 

>
మరిన్ని వార్తలు